పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, సెప్టెంబర్ 2012, శనివారం

జిలుకర శ్రీనివాస్॥నిన్ను చూశాకే తెలిసింది॥

1)

సముద్రాన్ని కళ్ళలో దాచుకొని తిరగడం ఎంత కష్టమో నిన్ను చూశాకే తెలిసింది ఆగిపోయిన కాలం వెనుక దాక్కోవటం నాకు చేత కాదని తెల్సుకున్నాక గట్టు దాటి పొంగే కడలి ఎన్ని సార్లు గొంతు కోసుకుందో మరెవ్వరికీ తెలియదు ప్రియా! బతకడమే పరమావధి అయితే ఎలాగైనా బండి లాగేయోచ్చు తలలు వాలిపోయే చోట కలలు కాలిపోయే చోట మురికి నీరు మాత్రమే నరాల్లో పారే చోట ఎలాగో అలా బతికేయటం నాకు నచ్చదు మెరుపులున్న చోటు నీ మురిపాల నవ్వులున్న
చోటు ఆకాశంలో తెల్లని మల్లె వొంకలున్న చోటు నీ సమస్తమూ ఓకే ఒక దివ్య వెలుగైన చోటు కోసం వెతుకుతూ నువ్వు నడిచిన దారిలో కాంతులీనుతూ ఉంటాను

2)

కలలు రావటం ఆగిపోయాయి అవి నువ్వోచ్చిన దారిలో గడ్డమూ మీసాలూ వేసుకొని ఒంటి మీద గుడ్డ లేకుండా తిరుగుతున్నాయి పిచ్చి పట్టిందని మిత్రులు ప్రకటించేశారు డాక్టరు చేతులెత్తేశాడు నాకోసం ఒక్క కంపెనీ నాలుగు మందు బిళ్ళలు తయారు చేట్లేదంటే ఎంత గర్వంగా ఉందొ తెలుసా నాకు నన్ను దోచుకొనే వీలు ఇవ్వలేదు కదా నేను! నిన్న రాత్రి పక్క వీధిలో వాళ్ళు కత్తులు నూరుకుంటున్నారు నల్లటి బాంబులు చుట్టుకుంటున్నారు కులాన్ని మాయ చేయాలంటే మతాన్ని ముస్తాబు చేయాలని పాడుకుంటున్నారు నేను నిన్నే దేవులాడుకొంటూ నీ కోసం బెంగ పడుతూ ఉరుకొచ్చాను కాళ్ళకు అడ్డుపడ్డ రెండు పెద్ద కత్తులు బొడ్లో దోపుకొచ్చాను రెండూ నీకోసమే జాగ్రత్తగా తలకింద పెట్టుకో హక్కుల గురించి నువ్వు మాట్లాడితే వినే వాడెవ్వడు? కనిపించ కుండా పోయినోళ్ళ జాబితాలో నీ పేరు ఎప్పుడు చేర్చాలా అని చూస్తున్నారు

3)

మాల్కం ఎక్స్ మాట్లాడుతూనే ఉన్నాడు నిన్ను రక్షించుకోవటం వీలు కాదు నీ సంఘమే నిన్ను కాపాడుతుందని చెప్తూనే ఉన్నాడు నల్ల జాతి ముఖాల మీద చిర్నవ్వుతో నన్ను పిలుస్తూనే ఉన్నాడు నాకు ఆయనకు అంబేద్కర్ను పరిచయం చేయాలనుంది ఇద్దరినీ ఒక్క వేదిక మీద చూడాలని ఉంది మాల్కంకు బాబాసాహెబ్ తత్త్వం తెలిస్తే ప్రపంచం చాల మారిపోయేది! ఎక్కడో జనం పిలుస్తూనే ఉంటారు వాళ్ళకిప్పుడు బాట చూపే వాళ్ళు కావాలి నువ్వేమో నాకు తప్పిపోయిన దారి చూపావు నువ్వు చూపిన దిక్కుకే అడుగులేస్తున్నానా! నా వెనుక సముద్రమేదో నడిచోస్తున్నట్టుంది

4)

చేతులు పక్క మీద నీ కోసం నిద్దర్లో తడుముకుంటాయి నువ్వోదిలేసి పోయిన తీపి చిహ్నాలు చిలిపిగా నవ్వుతూ దొర్లిపోతాయి కాళ్ళు కడుపులోకి దోపుకొని మూల్గుతూ ఉంటానా నువ్వు చదివిన పవిత్ర మంత్రం గదిని పరిశుద్ధం చేస్తుంది సమూహాల మధ్య ఒంటరిగా బతకడం ఎంత కష్టమో నీకు తెలుసునా? నీలో ధగధగా వెలిగే లోకాలను చూసినప్పుడు కళ్ళు మూతలు పడి మూగగా రోదించడం ఎంత కష్టమో తెలుసునా నీకు? నీ ప్రేమ లేకుండా నీ కమ్మని నవ్వులు లేకుండా యుద్ధం లో ముందుకురకటం అసలు ఎంత నరకమో కదా ప్రియా! నేను ప్రపంచాని జయిస్తే చూసి ఆనందించాలని నువ్వు ఆరాటపడుతున్నావు. నువ్వు హాయిగా ఆనందంతో నవ్వుల తోటవైతే చూడాలని నేను కత్తి తిప్పుతున్నాను. ఇప్పటికీ సముద్రం నా కళ్ళు దాటడం లేదు పిచ్చిది గొంతు నొక్కుకొని చచ్చిపోతుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి