తొలిసారి నిన్ను చూడాలంటే భయమేసింది
రోడ్డు దాటుతున్న నల్ల పావురాన్ని తెగబలిసిన నాలుగు గిర్రలు గుద్దేసి
నెత్తురు చిమ్మి విలవిల్లాడుతున్నప్పుడు
గుండె చెదిరిన తల్లి రెండు సముద్రాలను చేతుల్లో పట్టుకొని వణికిపోయినట్టు
నిన్ను చూడాలంటే నిజంగా తొలిసారి భయం పుట్టింది
మనసుకు నీడ లేదు
ఒంటికి సేద లేదు
గాలిలో చల్ల దనమే లేదు
నీ మాటల సవ్వడి లేక్ రాత్రికి కాళ్ళు చచ్చువడ్డాయి
మరోసారి నీ నీడ సోకని ఈ వెలుగు తెరలన్నీ నలుపెక్కాయి
తెల్లారిందో లేదో రైలు పట్టాల మీద నా ప్రాణం చితికిపోవాలని పరుగెత్తింది
చివరిసారి నీతో మాట్లాడాలనే ఆశ
ఊటలా పొంగే దుక్కం తప్ప నీ కేమీ చెప్పాలని లేదు
నిన్ను వీడిపోతున్నాననే దిగులు తప్ప చావంటే అసలు భయం లేదు
నీ ప్రేమ నది నాలో పారాలనే ఆశయం తప్ప వేదించాలనే రోగం లేదు
ఎంత ఒడుపుగా నన్ను మరణ మంచం దించావు
అంతులేని వలపుతో వేయి గిర్రలను తప్పించావు
మళ్ళీ ఒకసారి నిన్ను చేరాలంటే సత్తువ ఇంకిపోయింది
నువ్వు తప్ప మరో లోకం లేదని
నీ కదలికల చిత్రాలు తప్ప నా మనో తెరమీద వేరే ఏవీ కనిపించవని
నా సమస్త జీవనాడులు నీ నవ్వుతో తప్ప మరేదానితోనూ ఉద్దీపించవని
ఎన్నిసార్లు చెప్పాను ఎన్ని నదులను నీ కాలి మడిమల మీద ప్రవహించాను
అదే నవ్వుతో అదే మాట చెప్తే నా చుక్కల ముగ్గులేసుకున్న ఆకాశం చిద్రమైపోదు
నీ తర్క తంత్రులతో పాత పాటే మీటుతావేమోనని కొత్తగా భయమేసింది
అనంత కరుణా రసధునిలా
కడలి ఒడిలో శాంతంగా నిలబడి నవ్వే తెర చాపలా
నీ కనుల భాషతో కొత్త వ్యాకరణం రాసి
నా వేదననంతా ఒక్క శబ్దంతో తుడిచేశావు
ఇప్పుడు రోజూ రైలు పట్టాలు నన్ను చూసి నవ్వుతూ సాగిపోతున్నాయి
*23.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి