selected Readings ~ గంటేడ గౌరునాయుడు | మా ఆకాశంలో నెలవంక ................................................................. మా ఇంటి ఆకాశానికి పూచిందొక నెలవంక వంకంటే వంకగాదు ఇంటిల్లిపాదినీ వెంటతిప్పుకునే అల్లరల్లరి పిల్లజింక. *** వేరువేరు తీరుతీరుల విడివిడి ప్రపంచాలను ఒకే ప్రపంచం చేసింది. మేము మరిచిపోయిన ఆటల్నీ,పాటల్నీ మాకందించి మరబొమ్మలమైపోయిన మమ్మల్ని మనుషుల్ని చేసింది. నెలవంక తెచ్చింది మా ఇంటికి లిపిలేని వెన్నెల భాష అదే మమ్మల్నిప్పుడు పాలిస్తున్న అధికార భాష . దానికీ వ్యాకరణం ఉంది దానికో వింత సౌందర్యం ఉంది. శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసే మహత్తేదో ఉంది దానికి, అదే మా ఆత్మల్నిప్పుడు అనునిత్యం శాసిస్తోంది. వొచ్చీరాని మాటల వొయ్యారినెలవంక వంకంటే వంకగాదు .. వేయిపున్నముల వెన్నెలజింక. *** మేజాబల్లమీద కూజాలోకి రెండాకులతో ఓ పూలరెమ్మ చేరగానే గదంతా కళాకాంతులతో నిండిపోయినట్టు, పచ్చనాకు ప్రమిదలో ఒకే ఒక్క అరుణారుణ పల్లవి మొక్కను దివ్వసమ్మి గా వెలిగించినట్టు, పువ్వంత పాలనవ్వు మాయింటి ఆకాశాన్ని వెలుగు వెల్లువ తో ముంచెత్తింది. చిట్టి చంద్రవంక నట్టింట పాకుతుంటే మా మానస కాసారాల లోలోతుల్లోకి చొచ్చుకుని మేము కోల్పోయిన ప్రమోదాల నిధుల వేదాలకోసం శోధిస్తున్న మీనమే అనిపిస్తుంది. తన చిట్టిచిట్టి చేతులు నేలకు ఆనించి మెల్లమెల్లగా పారాడుతుంటే మేం మోయలేని మహానంద మంధరగిరిని మూపునకెత్తుకున్న కూర్మం లా గోచరిస్తుంది. బాలరాముడౌతుంది, చిలిపి కృష్ణుడౌతుంది, శతాధిక అవతారాలతో మాలోపలి దానవులను, దశకంఠులను దునుమాడి అంతరంగాల్ని ప్రక్షాళన చేస్తుంది మా నవ్వుచినుకుల నెలవంక, వంకంటే వంకగాదు ఎదలోయల చీకటులను తొలగించే వెలుగులెంక. *** నెలవంక వెలుగువేళ్ళతో తాకితేచాలు రబ్బరుబొమ్మ రసరమ్య రాగాలు పలుకుతుంది. పూలపిడికిళ్ళతో పట్టుకుంటేచాలు కొయ్యగుర్రం కీలుసవరించుకుని పరుగులు పెడుతుంది. పగులగొట్టినా ప్రాణం పోసుకుని తనచుట్టూ ప్రదక్షణలుచేస్తాయి ఆటబొమ్మలన్నీ. దాని అనుగ్రహం కోసం చేతులుసాచి నిరీక్షిస్తుంటాయి నిరంతరం మా ప్రాణాలన్నీ. ఆటల్లో అలయబెట్టి అందీ అందకుండా అలరించే మా చిన్ని నెలవంక వంకంటే వంకగాదు ఎద ఎదనూ పూపొద ను చేసిన పసిపలుకులప్రియాంక. *** నక్షత్ర ధూళి తో నలుగుపెట్టి మిన్నేటి గంగ తో స్నానమాడించి తెల్లమబ్బుల బొచ్చుతువ్వాలుతో ఒళ్ళుతుడిచి కళ్ళకు చీకటి కాటుక దిద్ది చెక్కిట దిష్టిచుక్క పెట్టి వేలికిమిగిలిన కాటుకరేకను అరిపాదంకింద అద్ది ఇంద్రధనసు ఉయ్యాలలో వేసి జోలపాడితే దాని నీలాల కళ్ళమీద నిదరపువ్వు వైశఖపున్నమిలా విచ్చుకుంటుంది. నిద్దరలో దాని ముద్దుమోము నిశ్చల దీపంలా వెలుగుతుంది. పరిమళాలు నింపుకుని పిల్లగాలి పాపచుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే ఇల్లు ఇల్లంతా ప్రశాంత దైవమందిరమైపోతుంది. నిదరలో బెదురుతుందో , కల చెదురుతుందో ఉన్నట్టుండి ఉలిక్కిపడి తపోభంగమైన మునిలా కలవమొగ్గల కళ్ళు విప్పారుస్తుంది. అప్పుడది ఏడిస్తే అదొక ఇతిహాసం, నవ్వితే అది నవీన కావ్యం. పాపతో గడిపే ప్రతీ క్షణమూ కమ్మని కవిత్వానుభవమే, అదొక నిత్యనూతన సాహిత్యాధ్యయనమే, మేమిప్పుడు నెలవంక పాలనవ్వులకు దోసిళ్ళుపట్టి కళ్ళనిండా నింపుకునే చుక్కలం నెలవంకెకు వేలాడే సరికొత్త ఆశల చొక్కాలం. మా నెలవంక... గోరుముద్దల ముద్దుల గోరువంక, వంకంటే వంకగాదు ప్రేమ క్షీరసాగర గర్భాన మేము నిర్మించుకున్న శతసహస్ర దళసుమాలంకృత స్వర్ణలంక అదేకదా మా ప్రియ ప్రపంచమింక.
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ly0PXU
Posted by Katta
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ly0PXU
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి