మనవాళ్ళు ఇంగ్లీష్ లోనుంచి అనువాదం చేసుకోవడంలో చూపించినంత ఉత్సాహం తెలుగు రచనల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయడంలో ఎందుకు చూపించరు..!అనువాదం వల్లనే మన వాతావరణం లోని మనకే సొంతమైన కొన్ని అంశాలు ఇతర భాషలవాళ్ళకి బాగా చేరే అవకాశం ఉన్నది.ఎప్పుడో తప్ప పెద్దగా తెలుగు లోని వివిధ సాహిత్య ప్రక్రియలు ఇతర భాషల్లోకి ,ముఖ్యంగా ఆంగ్ల భాష లోకి వెళుతున్నట్లు కనిపించడంలేదు. ఇంగ్లీష్ లోకి సీరియెస్ గా అనువాదం చేసేవాళ్ళు బహుతక్కువ.ముక్కలు ముక్కలుగా,పేరాగ్రాఫ్ లుగా ఇంగ్లీష్ లో రాసేవాళ్ళని చూసినపుడు అనిపిస్తుంది..వీళ్ళెందుకని ఇంతకంటే ఎక్కువ పరిధి ఉన్న ఆంగ్ల అనువాద ప్రక్రియలోకి రాకూడదూ అని.ఎందుకనో తెలుగు వాళ్ళలో ,ఇంగ్లీష్ బాగా వస్తుందని అనుకునేవాళ్ళ లో కూడా ఒక తెలుగు కధనో,నవలనో అనువాదం చేయాలంటే బెరుకుగా ఫీలవుతారు. చాలామంది ఇంగ్లీష్ ప్రొఫెసర్లు,లెక్చరర్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు.తెలుగువాడి ఆంగ్లప్రకటనా సామర్ధ్యం పై సాటి తెలుగువాడికే చాలా సందేహం.అందుకనేనేమో తెలుగువాళ్ళు ఒక ఇంగ్లీష్ పత్రిక పెట్టినా లేదా ఏ ఆత్మకధ లాంటిది రాసుకున్నా పక్కన బాసటగా ఏ తమిళునిదో,బెంగాలీదో,కనీసం ఏ మిశ్రా,చావ్లా లాంటి పేర్లు దానికి సపోర్ట్ గా ఉండవలసిందే.అప్పుడుగాని శంఖులో తీర్థం పోసినట్లుగా ఆ ఆంగ్లరచనని మనం ఆమోదిస్తాం. తెలుగు వాడికి నగర సంస్కృతి లేకపోవడమే దానికి కారణం అని కొందరంటారు. నాకైతే అనిపిస్తుంది ఇంగ్లీష్ ఫిక్షన్ ని ,నాన్ ఫిక్షన్ ని చదివే సంస్కృతి ని మనలో పెంపొందింపజేసుకోకపోవడమే అసలు కారణం..! EAMCET,IIT లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని లక్షలు పోసి ఇంటర్మీడియెట్ బట్టీ చదువులు చదివిస్తాం..కాని ఇంగ్లీష్ లోని మంచి పుస్తకలని చదవడం లో అభిరుచిని గాని, పట్టుమని పది వాక్యాలని రాసే అభినివేశాన్ని గాని ఈ సో కాల్డ్ కార్పోరేట్ కాలేజీలు ఇవ్వవు. మనం తెలుగు పుస్తకాల్ని ఎలా చదువుతామో ,అలాగే ఇంగ్లీష్ పుస్తకాల్ని కనీసం సమకాలీనమైనవాటిని చదివే ఒక సంస్కృతి ప్రతి చదువరిలోనూ రావాలి.తెలుగుని ప్రేమించడం అంటే ఇంగ్లీష్ ని ద్వేషించడం ,తిట్టడం అనే హిపోక్రసీ లో జీవిస్తున్న వాళ్ళని నిర్లక్ష్యం చేస్తేనే ఇది సాధ్యం. మనకి మించిన నగర సంస్కృతి కేరళలో మాత్రం ఏముంది.నగర సంస్కృతి అంటే కేవలం material luxuries అనే కోణం లోనే తీసుకోరాదు. అది మానసిక తలాల్లో జరిగే ఒక ముందు చూపుగా కూడా పరిగణించాలి.మీరు కేరళ వెళ్ళండి..మన మండల కేంద్రాల్లో కనిపించే కొన్ని ఖరీదైన బిల్డింగులు కూడా అక్కడి జిల్లా కేంద్రాల్లో కనిపించవు. అయితే ఒక చిన్న పెంకుటింటిలో ,పైన ఏ ఆచ్చాదన లేకుండా లుంగీ లో ఉండే ఒక మామూలు వ్యక్తి కూడా వైక్కం బషీర్ ని చదివినట్టే సిడ్నీ షెల్డన్ నీ చదువుతాడు.Alexia De Vere పాత్రని ప్రస్తుత మహిళా రాజకీయవేత్తలతో పోల్చిచెప్పగలడు.అది ఎలా వచ్చింది...తమ మాతృ భాషలానే ఆంగ్ల రచనల్ని చదివే ఒక సంస్కృతి లోనుంచి..! అనువాదం లక్ష్యం ఏమిటి..?ఒక ప్రాంత నేపధ్యాన్ని ఇంకొకరికి పరిచయం చేయడం.నూటికి నూరు శాతం "ఒరిజినల్ రచన" కి దగ్గరగా లేదని విమర్శించడం కూడా కూడని పని.అనువాదం చదివే పాఠకుడు ఒరిజినల్ నుంచి అనువాదం లోకి వచ్చే Gap ని అర్ధం చేసుకోగలడు.మరీ నలగని వాటిని ఫుట్ నోట్స్ ని ఇచ్చి చాలా మేరకు help చేయవచ్చు. ఓ మితృడు ఈ మధ్యన అన్నాడు...కొన్ని తెలుగు పదాల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయడం కష్టం అని.అవును మక్కీకి మక్కీగా ఇతర భాషలో పదాలు ఉండకపోవచ్చు.కాని మన భాషలోని పదాన్ని అలాగే ఉంచి దాని నేపధ్యాన్ని వివరిస్తే అర్ధం కాకపోవడమనేది ఉండదు.పైగా పఠితకి అది థ్రిల్ల్లింగ్ గా ఉంటుంది. ఉదాహరణకి "ఒమెర్త" అనే పేరుతో మేరియో ప్యూజో ఒక నవలరాశాడు.అది ఇటాలియన్ పదం.ఇంకా చెప్పాలంటే సిసిలీ పరిసరాల్లో మాఫియా అవసరాల్లో భాగంగా పుట్టిన పదం. ఆ నవల రాసేటప్పుడు దానికి సమానమైన ఆంగ్ల పదం లేదు. కాబట్టి దాని నేపధ్యం గూర్చి ముందర పేజీల్లోనే వివరణ ఇస్తాడు రచయిత.CODE OF SILENCE అని.ఎటువంటి పరిస్తితుల్లో కూడా తనకి గాని,తన కుటుంబ సభ్యులకు గాని హాని జరిగినా పోలీసులకి ఆ వ్యక్తి గురించిన వివరాలు ఇవ్వకుండా ఉండటం దానిలో ఓ భాగం.అవసరమైతే నిష్కారణంగా జైలుకి వెళ్తారు తప్ప వెల్లడించరు.ఆ "ఒమెర్త" ని అధిగమించినవాళ్ళు Family చేతిలో Death punishmint ని అనుభవించవలసిందే.ఇక్కడ Family అంటే కుటుంబం అని కాదు నేర సామ్రాజ్యం అని అర్ధం మాఫియా పరిభాషలో. మరి ఇవన్నీ ఎలా తెలిశాయి....దానికి తగిన వర్ణనలు,వివరాలు అదనంగా ఇవ్వబట్టే కదా..!ఈ రోజున ఒమెర్త అనే పదం ఇంగ్లీష్ భాషలో కలిసిపోయింది ఆ నవల పుణ్యాన. ఇది తెలుగు కీ వర్తిస్తుంది. ---KVVS MURTHY
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qPLVj6
Posted by Katta
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qPLVj6
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి