అక్షర ప్రయోక్త Posted on: Sat 19 Apr 23:42:42.728647 2014 భాష ఒక ఆటంకం అన్నాడు చలం తన మ్యూజింగ్స్‌లో ఒక చోట. ఉద్దేశించిన భావాలను మాటలు బట్వాడా చేయవు అన్నాడు ఆరుద్ర. శ్మశానాల వంటి నిఘంటువులు దాటానన్నాడు శ్రీశ్రీ. వినూత్న భావాలనూ, విప్లవకర ఇతివృత్తాలనూ భాషలోకి మలచడం, అక్షరాలుగా అమర్చడం ఎప్పుడూ పెద్ద సవాలే. ఆ సమస్యను కళాత్మకంగానూ, అద్భుత సృజనతోనూ పరిష్కరించిన రససిద్ధుడు గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్. తను సృష్టించిన మార్మిక వాస్తవికత లేదా మ్యాజికల్ రియలిజం గతాన్ని, వర్తమానాన్ని, నిజాన్ని, కల్పననూ జమిలిగా చూపించిన అపురూప ప్రక్రియ. ఆకలి మంటలు, అనారోగ్యాలు, అమానుష హింసాకాండల మధ్య క్రూర నియంతలు, వీర విప్లవకారులతో కూడిన లాటిన్ అమెరికాలో సుదీర్ఘ చరిత్ర నుంచి ఆవిర్భవించిందే మ్యాజికల్ రియలిజం అని ఆయనే అభివర్ణించారు. 'కవులు, యాచకులు, సంగీత కళాకారులు, ప్రవక్తలు, యుద్ధ వీరులు, పనికిమాలిన వాళ్ళు ఇలా అందరూ కూడా హద్దుల్లేని ఈ వాస్తవిక ప్రపంచంలోని జీవులే. కాస్త కాల్పనికతతో, ఊహాజనిత శక్తితో మేం పనిచేస్తాం. మాకున్న కీలకమైన సమస్య ఏంటంటే, మా జీవితాలు నమ్మదగ్గవిగా మార్చుకోవడానికి సాంప్రదాయసిద్ధమైన మార్గాలు కొరవడడం వల్లనే మేము కొంత కాల్పనికతను ఆశ్రయించాల్సి వచ్చింది' అన్నాడు. ఈ నేపథ్యంలో మార్క్వెజ్ ప్రాచుర్యం కల్పించిన మార్మిక వాస్తవికత ఆధునిక ప్రపంచంలోని అత్యంత సంచలనం సృష్టించిందంటే దానికి గల చారిత్రిక పునాదులే కారణం. అయితే మార్మిక వాస్తవికతతో పాటు మార్క్సిస్టు దృక్పథం గల వారిని కూడా మహత్తరంగా ఆకర్షించిన ఫైడల్ కాస్ట్రో వంటి వారికి ఆప్తుడుగా, ఆత్మీయుడుగా మెలిగిన మార్క్వెజ్ స్వయంగా ప్రజా పక్ష వాది, సామ్రాజ్యవాద వ్యతిరేకి కావడం గొప్ప విశేషం. అందుకే ఆయనకు యావత్ ప్రపంచం నివాళులర్పిస్తుంది. చాలామంది లాటిన్ అమెరికన్ మేధావులు, కళాకారుల లాగే కూడా తన కాలంలో దైనందిన రాజకీయ వ్యవహారాలపై మాట్లాడక తప్పని పరిస్థితి. మార్క్వెజ్ వామపక్ష దృక్పథంతో ప్రపంచాన్ని వీక్షించాడు. చిలీలో ప్రజలు ఎన్నుకున్న మార్క్సిస్టు అధ్యక్షుడు సాల్వడార్ అలెండీని సైనిక కుట్రతో కూలదోసిన నియంత జనరల్ పినోచెట్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. క్యూబా అధినేత ఫైడల్ కాస్ట్రోను నిరంతరం బలపర్చాడు. మార్క్వెజ్ తన రచనల రాతప్రతిని కాస్ట్రోకు పంపించేవాడు. సెర్వాంటిస్ రాసిన డాన్ క్విక్సాట్ తర్వాత మార్క్వెజ్ హండ్రడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ గొప్ప గ్రంథమని పాబ్లో నెరూడా అంతటి మహాకవి ప్రశంసించాడంటే దాని విశిష్టతకు ఒక నిదర్శనం. బైబిల్ తర్వాత ఎక్కువ ప్రతులు అమ్ముడు పోయింది మార్క్వెజ్ రచనలే. హండ్రెండ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్, లవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ కలరా వంటి ఆయన రచనలు అక్షరాభిమానులను అమితంగా అలరించాయి. తన బాల్యం నుంచి విన్న కథలన్నీ గుర్తుంటాయని ఆయన అన్నారంటే ఎంత అద్భుతమైన ప్రతిభ, సృజన కలబోతగా రచనలు చేశారో అర్థమవుతుంది. ఈ కారణంగానే ఆయన సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యానికి ప్రతీక అయిన నోబెల్ పురస్కారం వెతుక్కుంటూ వచ్చింది. అసలు ప్రపంచ వ్యాపితంగానే రాజకీయంగా తమకు అనుకూలమైన వారికి నోబెల్ ఇస్తున్నా సాహిత్యానికి వచ్చేసరికి అనివార్యంగా వామపక్ష భావాలు గలవారికే ఈ పురస్కారం దక్కుతున్నదంటే వాటి విశిష్టతే కారణం. మార్క్వెజ్‌పై యూరోపియన్ రచయితల ప్రభావం కన్నా లాటిన్ అమెరికా రచనల ప్రభావమే ఎక్కువ. వారు ఆ నేలకు ప్రతినిధులుగా తమ సాంస్కృతిక స్ఫూర్తి కోసం పాత ప్రపంచం వైపు చూసేవారు. దాన్నుంచి తమ సరికొత్త సవాళ్లకు సమాధానం కనుగొనాలని మార్క్వెజ్ భావించారు. చిలీలో మార్క్సిస్టు భావాలు గల సాల్వడార్ అలెండీ అధ్యక్షుడుగా ఎన్నికైతే జనరల్ పినోచెట్ సైనిక కుట్ర జరిపి హత్య చేశారు. ఇందుకు నిరసనగా ఆయన అధికారంలో ఉన్నంత కాలం తాను రాయబోనని మార్క్వెజ్ శపథం చేశారు. అయితే తర్వాత మాత్రం ఇలా చేయడం సరికాదని భావించారు. నికరాగ్వాలో శాండినిస్టా విప్లవానికి సంఘీభావం తెలిపారు. అడుగడుగునా అభ్యుదయ భావాలనే అసలైన చిరునామాగా జీవితం సాగించారు. ఆయన జీవితం, రచనలూ కూడా గొప్ప ఉత్తేజ కారకాలయ్యాయి. ఆయన నోబెల్ బహుమతి ప్రసంగం కూడా గొప్ప ప్రేరణగా నిలిచింది. రచయితగా తనకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల కారణంగా అనేక పదవులు వెతుక్కుంటూ వచ్చినా నిక్కచ్చిగా తిరస్కరించారు. కొలంబియాలో పుట్టినా, స్పెయిన్‌లో చాలా కాలం గడిపినా, ఇతర లాటిన్ అమెరికన్ దేశాలలో పనిచేసినా ఆయన జీవితమంతా వామపక్ష ఉద్యమాలతోనూ, నేతలతోనూ మమేకం కావడం గొప్ప విశేషం. మహా రచయితగా గుర్తింపు పొందినా మార్క్వెజ్ జర్నలిజం విడనాడటానికి నిరాకరించారు. వెనిజులా నేత హ్యూగో చావేజ్, క్యూబా సారథి ఫైడల్ కాస్ట్రో వంటి వారిపై సాధికార గ్రంథాలు ప్రచురించడమే గాక తన స్వదేశమైన కొలంబియాను సర్వనాశనం చేసిన కొకైన్ మాఫియాపైన పెద్ద పుస్తకాలు రాశాడు. జర్నలిజాన్ని ఎన్నటికీ వదిలే ప్రసక్తి ఉండబోదని ప్రకటించడం ఆయన వృత్తి గౌరవాన్ని తెల్పుతుంది. ఇంకా సినిమాలతో సహా పలు రంగాలలో ప్రతిభ చాటుకున్న వ్యక్తి ఆయన. 1999లోనే కేన్సర్ సోకినా ఇంతకాలం అనారోగ్యంతో పోరాడుతూనే అక్షర యజ్ఞం కొనసాగించిన మార్వ్వెజ్ మరణం 20వ శతాబ్దికి సంకేతమైన ఒక మహా రచయితను మనకు దూరం చేసింది. అయితే ఆయన మార్మిక వాస్తవికతలాగే ఆయన అక్షర స్ఫూర్తి కూడా నిలిచే ఉంటుంది.http://ift.tt/1lmkfAU
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmkfAW
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmkfAW
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి