భవానీ ఫణి ॥ పసి(డి ) కలలు ॥ పండిన లేత చేతుల్తో తన మేని రంగుని సరిచూసుకుంటూ ఏమారిఉన్న ఆ పెంకు ముక్క, ఉన్నపాటుగా ఏదో ఒక గడిలోకి తొక్కుడు బిళ్ళగా విసిరివేయబడి అదే గోరింటాకు తో ఎరుపెక్కిన అరికాలి క్రింద నలిగి అలిసిపోతోంది ఎగిరెగిరి తన్నుతూ తాడాట ఆడుతున్న పసి పాదాల జంటని పదే పదే ప్రేమగా ముద్దాడే పుడమి సహనానికి అచ్చెరువొందుతూ మైమరిచిన చిరుగాలి, ఛెళ్ళున తాకే తాడు తాకిడికి ఉండుండీ ఉలికిపాటుకి గురవుతోంది తనని పైకంటా విసిరి నేలమీదున్నతన నేస్తాల్ని నేర్పుగా అందుకుని అతి లాఘవంగా తిరిగి తనని కూడా గుప్పిట చేర్చుకుంటున్న ఆ మెత్తని చేతి తాలూకూ గాజుల కోలాహాలానికి ఓ చింతపిక్క చిత్రంగా తుళ్ళి పడుతోంది వైభవంగా జరిగిన తన వివాహ వేడుకకి సిగ్గిల్లిన ఓ బొమ్మ పెళ్లి కూతురు, తనలో జీవమే లేదన్న విషయం మరిచి చిట్టి పొట్టి పెళ్లి పెద్దల సమక్షాన చేతనత్వాన్ని కోల్పోయానని తెగ కంగారుపడిపోతోంది పగడాలు రాశి గా పోసి పైన తెల్లని బొండు మల్లెని గుచ్చినట్టు ఆవకాయ కలిపిన అన్నం ముద్ద మీద కూర్చుని ఉన్న ఓ వెన్నముద్ద మెలమెల్లగా కరుగుతూ వయ్యారాలు పోతోంది దీపాల వేళ ఆరుబయట నిలబడి కొబ్బరిచెట్టు ఆకుల మధ్య నుండి తొంగి తొంగి తనని చూస్తుంటే ఎప్పుడో కొబ్బరాకులో నక్కిన ఓ వర్షపు చినుకు ముక్కుపైకి దూకిందని ఆ చిలిపి చంద్రుడు విరగబడి నవ్వుతున్నాడు ఇంతందమైన కలల పల్లకీలో నన్నెక్కించుకుని బాల్యం లోకి మోసుకెళ్తున్న ఈ బంగారు క్షణాలు కరిగిపోతాయేమోనని ఉదయాన్నిసైతం రావద్దంటూ కనురెప్పల తలుపుల్ని మరింతగా బిగిస్తున్నాను నేను !!! (కౌముది ఏప్రిల్ 2014 సంచిక లో వచ్చిన నా కవిత http://ift.tt/OqqTem) పోస్ట్ చేసిన తేదీ 07. 04. 2014
by Bhavani Phani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OqqTem
Posted by Katta
by Bhavani Phani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OqqTem
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి