మరువం ఉష | చీకిపోయిన చినుకులు ------------------------------------- వానతెరల్లో మసక చూపుకి ఉన్నపాటుగా ఉలికిపాటు- పిచ్చుకొకటి విగతజీవియై పడి ఉందక్కడ, వెల్లకిలా ఆకాశాన్ని నోరు వదిలిచూస్తూ. చితికిన వంటిమీద కదిలివెళ్ళిన చక్రాల గుర్తు, విహ్వలతతో కుప్పకూలినట్లు నానిన ఆకొకటి తోడుగా... నిన్న రెక్కలెగరేసి వెక్కిరించినదీ పిట్ట కాదు కదా? మనసంగీకరించట్లేదు, ఓ స్వేచ్ఛ మలిగిపోయిందంటే. రావికొమ్మ రాసుకున్న గోడ పగుళ్ళువారినట్టు, ఈ క్షణపు నిట్టూర్పుకు గతపు మచ్చ మీద పెచ్చురేగింది. గదిలో నలుగురు ఆకతాయిలు- గోడహద్దుల వెంట తరిమి తరిమి, గొళ్ళెపు మోతతో రెక్క విరిగేలా ఎగిరిస్తూ, పసితనపు పిచ్చి పూనకంలా, పిచ్చుక పాలిట శాపంలా. గది వెలుపల నా బిక్కమొహానికి, నా వెర్రికేకలకి గోనె సంచీలో బిగించి కట్టిన పిట్ట స్పర్శ బదులు ఇచ్చింది. “పలుకదిక, ఆటకట్టిక” అరుపుల కేళిలో అదిరిపడ్డ నా గుండె. పెరట్లో గుట్టుగా కప్పెట్టిన గుప్పిళ్ళలో మట్టి వాసన మిగిలే ఉందేమో, ఇప్పటికీ అమ్మమ్మ ఇంటి దూలాల్లో పిచ్చుక కేక ధ్వనిస్తుందేమో. అటక మీద చింకిపాతలు హరికెను లాంతరు మసి తుడిచినట్లు, చీకిపోయిన శోకపు చినుకులు ఆదరాబాదరా బతుకుల బురదని కడుగుతుంటాయి. కంటి ఎదుటి దైన్యాన్ని తప్పుకుపోతున్నందుకు కసురుతుంటాయి... 09/03/14
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gcEq4a
Posted by Katta
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gcEq4a
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి