వర్చస్వి// స్టోళ్ళు // - - - - - - - - ఎక్కడినుంచో దొర్లి పడుతోందో వెకిలి గొంతు! కొత్తగా ‘స్టోళ్ళ’ పై రాళ్ళుగా విరుచుకుపడుతున్న తంతు!! స్టోళ్ళో, పరదాలో, ముసుగులో – ఎందుకా పళ్ళికిలింపు? కన్నే కొట్టాడో, కాంతల బ్రతుకుల్లో మన్నే కొట్టాడో కళ్ళలో కామపు తేళ్లేసుకుని వాంఛా కొండి తో కుట్టాడో! తన ముఖం వాడికి చూపించదలచలేదు!అంతే!! ఎక్కడిదా వెకిలి గొంతు? మట్టిగొట్టుకున్న మగతనాలు పడతుల మొఖాన యాసిడ్లు కొడుతుంటే పూడుకుపోయిన గొంతేనా అది! తనమానాన తాను పోతున్న మానిని శీలం పై ఓ పైశాచికత్వం మానభంగం గావించినపుడెక్కడ మూసుకు పోయిన గొంతేనా అది! తనువుని కామగ్నికి బూడిద చేసుకునికూడా పేరు బయట పెట్టుకోలేక గుట్టుగా ‘నిర్భయం’టూ చట్టపు నామాన్ని తొడుక్కుని తృప్తి పడ్డందుకా ఆ వెకిలితనం! ఆ వెకిలి నవ్వుల మదపు తోడేళ్ళ కళ్ళు తప్పించడం కోసమేగా ఆ ‘ స్టోళ్ళు’! అవి - మృగత్వపు మసి మరకలని మరిచిపోవాలనుకుంటున్న తెరలు! దౌర్జన్యం చేసిన దౌర్భాగ్యపు ముఖాలమీద ఉమ్ము కూడా వేయడం ఎందుకులెమ్మంటూ నోటికి అడ్డంగా కప్పుకుంటున్న క్షమాతెమ్మెరలు!! ఎవరికళ్ళో అక్కడ మొసళ్ళ పద్యాల్ని కార్చేస్తున్నాయి? మర్యాదల పద్యాల పొరల్ని పైకి ‘పరదాలా’ పెట్టుకుని లోలోన మనసుతో అడిగించింది చెమికీచీర కిందికి దించమనే కదూ! నీదైన రసానుభూతి నీకు కలిగితే మైకపు మద్యాన్ని పద్యాల చీరలుగా చుట్టి సింగారించేది నువ్వే! మోడర్నిటీ పరదాల ర్యాంపుల మీద సొంపుల్ని వొంపి పజ్యాల దండేల మీద అర్ధ నగ్నంగా ఆరేసేదీ నువ్వే! మనసు రంజిల్లితే చెలియ మనసు పిచ్చి కోమలం! వాడి ఆగడాల్ని గుంజీలు తియిస్తే అది కేవలం పిచ్చి కమలం!! ఎందుకా వెకిలివేషం? జబ్బలు విరగకాచేలా చూపించే వాడి బ్లేజరు విహారాలు మరొకప్పుడు జుబ్బా తొడిగిన వాడి కంత్రీ సాయంత్రాలు వెంట్రుకలాటి వాణ్ణి విశేషంగా చూపించే బెర్ముడా తొడుగులు వాడికైతే వాడికి నచ్చిన వేషం! వీళ్ళేస్తే వాడికి నచ్చని పిచ్చి వేషం!! అసలు చీరో, చెంగో, పమిటో, పరదానో, ముసుగో, స్టోలో- అహోరాత్రాలూ వాటి స్టాటిస్టిక్కులతో ఏం పని? సరిగా సూటిగా చూడు! స్త్రీ-లో నీకో వంపుతీరిన సకార దేహం, పైన తలకట్టు కప్పిన గుడి దీర్ఘపు ముసుగూ కనిపిస్తే, నాకు మాత్రం ..... ఆ క్రిందే - ద్వంద్వ నైజాల్ని చీల్చే చుర కత్తీ, విశ్వాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ నింపుకున్న క్రావడి దొన్నె కనిపిస్తుంది //2.03.14// (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా.......)
by Humorist N Humanist Varchaswi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fZ3s1W
Posted by Katta
by Humorist N Humanist Varchaswi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fZ3s1W
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి