పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

Rammohan Rao Thummuri కవిత

నిన్నటి వెన్నెల ........................ వెన్నెల లో తడుస్తున్నప్పుడు తన్మయత్వమే తప్ప ధ్యాసేది? తలపులు జ్ఞాపకాల్ని తడిమినప్పుడు వెనుకటి రోజులన్నీ మళ్లీ తెరకెక్కుతాయి అప్పటి అంగి లాగులకు అమాయకత్వమే ఎక్కువ చెప్పులు లేని కాళ్లకు చెట్లూ గుట్టలంటేనే మక్కువ మోకాళ్లమంటి నాగులకుంట నీళ్లల్లో నీరుగట్టెల్ని నిర్లక్ష్యం చేసే తెంపరితనం వీరన్న గుట్ట సందమామ గుట్ట సొనికల్లో సీతాలప్పండ్లకోసంసొట్లు శోధించడం ఎండకాలం పెరండ్లల్ల దిరిగి రేగుచెట్టు దులిపి రేగువండ్లతోటే గూడరామయ్యయో బొమ్మెన కిట్టయ్యయో తిట్లుగూడాదినటం దాగుడుమూతలాడుకుంటూ ఎదురింట్లో పక్కింట్లో గుమ్ములు గరిశెలు ఖరాబుజేసి గడ్డివాములు ఖంగాలి జేసి వాళ్ళవి వీళ్లవి సొడ్లు దినటం గద్దె మీద కస్పనర్సిమ్లు తాత కతలు వినుకుంటు పోద్దుబొయ్యినాంక ఇంట్ల తిడ్తరని బయంబయంగ ఇంటికి జేరి అయినయా తిరుగుళ్ళు అని అక్షింతలు వేయించుకోవడం కంక బద్దల తోటి బాణాలు జేసి పజ్జొన్న బాణప్పుల్లల చివర్ల చింతపండు మైదంబెట్టి బట్టల దుకాన్ల అట్టలుదెచ్చి కత్తిరిచ్చి కిరీటాల్జేసి బొగ్గు మీసాలతో మక్కబూరు గడ్డాలతో రోకలిబబండ గదలతో సైకిలుట్యూబు తోకలతో అరుగులమీద నాటకాలాడిన ఆకతాయితనం రోకలిబండ నడుమ బట్టపేగులో కప్పనుబెట్టి కట్టి బుజంమీద మోసుకుంటూ ఇల్లిల్లూ దిరుక్కుంటూ కప్పతల్లి కప్పతల్లి కడుపు నిండవొయ్ అని పాడుకుంటూ ఇండ్ల ముందర నిలబెట్టి ఆడోళ్లు నెత్తిమీద గుమ్మరించిన నీళ్లకు పెయ్యిమీది బట్టలుదడిసి దగ్గువడిషాలు తెచ్చుకోవటం చిర్రగోనెలాడుకుంటు తుమ్మూరోళ్లింటినుంచి కాసర్ళోళ్లింటిదాకా బజార్లు కొలుచుకుంటూ బలాదూరుదిరగటం సిగిరెడ్డబ్బాలు జమ జేసి పత్తాలు తయారుజేసి పగటిపూట పసులకొట్టంల పత్తాలడటం ఎంగిలి పూలనాట్నుంచి సద్దులదాకా గుమ్మడి పూలకు గునుగు పూలకు తంగెడుపూలకు చెట్టపట్టాలతో చేన్లు చెల్కలు దిర్గటం వెన్నీల రోజులైతే బజారు ఉస్కెల వెన్నీల చన్నీల అనుకుంటూ వెలుగు నీడలతో దోబూచులాడుకోవటం వానకాలం వరదకుకొట్టుకొచ్చిన ఉస్కెల దాసన్నపుల్లలాడటం లేకపోతే బొమ్మరిళ్లుగట్టడం తుమ్మ బొంగరాలు పట్టుడు బొంగరాలు దెచ్చుకుని జాలలు పేనుకుని బొంగరాలాడేటప్పుడు గుండందాటి తిరిగిన బొంగరం మీద బొంగరం ములికితో పోట్లు పొడవటం గడ్డపోణి దుకాన్ల కొనుక్కొచ్చిన గోలీలతో జేబులు నింపుకుని బొటనవేలు నేలకానించి మధ్యవేలుతో గోలికి సూటివెట్టి గోలీతో కొట్టడం అప్పటి ఆటలే వేరు ఆ రోజులే వేరు అప్పటి దోస్తులందరూ ఇప్పుడు ఎక్కడ మనుమలతో మనుమరాళ్లతో ఆడుకుంటున్నరో అది కరువైనవాళ్లు జీవితాలు బరువైనవాళ్లు నిన్నటి వెన్నెల ఎక్కిళ్లతో ఎరుపెక్కిన చెక్కిళ్లతో కార్చలేని కన్నీళ్ళతో కడ వైపు చూస్తున్నరో.... వాధూలస 15/3/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m5SDUr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి