మహిళా దినోత్సవం...??? ||పద్మా శ్రీరామ్|| ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి… ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి… మారుతున్న కాలంతో మగువ కూడ మారాలి మంద బుద్ధి నడక మాని మగువ తెగువ చూపాలి మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ ఇవీ సమాజం ఆడవారి కళ్ళకు తీయగా కడుతున్న వలువలు.యుగయుగాలుగా ఎవరి కాలికిందో కాదు తను నమ్మిన సంప్రదాయాల విలువల క్రింద తనని తానే బందీ చేసుకున్న అమాయిక మహిళల గాధలు పునశ్చరణ చేసుకుందామా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగానైనా ఒకపరి… నిజాయితీగా…. త్రేతాయుగం….. అయోనిజ భూజాత…శీలపరీక్ష పేరుతో అగ్నిపునీతై , అమాయత్వానికి ఏకైక సింబల్ ఆఫ్ వుమన్ గా యుగయుగాలకు నిలిచిపోయిన ధాత్రి .. సీత… శీలమంటే ఆడవారికి మాత్రమే కాదు నిర్దేశింపబడినది…ఏక పత్నీవ్రతం చేపట్టిన శ్రీరామచంద్రుడికీ శీల పరీక్ష కోరవలసినదే కదా సీతమ్మ తల్లి…. కోరలేదు సరికదా భర్త ఆజ్ఞ కు శిరసొగ్గింది… అదలా ఉంచితే ఎవడో చాకలివాడు ఏదో అన్నాడని రాజ ధర్మం పేరుతో నిండుచూలాలిని నట్టడవికి పంపేస్తాడా ??? మనందరిచేతా పురుషోత్తముడిగా పిలువబడుతున్న రామచంద్రమూర్తి చేయతగ్గ కార్యమేనా ఇది? పెళ్లిలో మంత్రాల అర్ధం ఇదేనా? నాతిచరామి అంటే ఇంతేనా ? ఆడిన మాట తప్పనివాడు ఆదర్శపురుషుడు మన రాఘవుడు …మరి ముందు జరిగినది పెళ్ళి…అన్నమాట నాతిచరామి..తరువాతే రాజయ్యాడు…మరి రాజ ధర్మం ముందు వైవాహిక వాగ్దానం వీగిపోయిందా…పాపం సీతమ్మ తల్లి ఎంత వగచిందో అజ్ఞాతవాసంలో ఎన్ని ఇక్కట్లు పడిందో….కానీ నిశ్శబ్దంగా పిల్లలను భర్తకప్పగించి అవతారం చాలించింది…అదీ మౌనంగానే భర్తను ఏనాడూ తూలనాడి ఎరుగదు.ఎందుకిలా చేసావని ఎదురుపడి అడిగిన దాఖలాలూ లేవు…త్రేతాయుగపు మహిళాధ్యాయం ఆ తల్లి మౌనంతోనే ముగిసిపోయింది… అక్కడే నిలిచిపోయింది. ద్వాపర యుగం . ఒక విధివంచిత కాదు కాదు భర్తృ వంచిత అయిన ద్రౌపది కధ. కురుక్షేత్ర సంగ్రానికి బీజమేసిన అతివ వ్యధ. మౌనమవలేదు ఈ మహిళ. అన్యాయమనిపించిన చోట ఎలుగెత్తి ప్రశ్నించింది. మనసైనవాడూ, స్వయంవరంలో తనను గెలుచుకొన్నవాడు అమ్మ మాటను అడ్డంపెట్టి అన్నతమ్ములకు పంచాడు. ధర్మరాజు అనే పేరు మాటున ఒక భర్త తన్నొడ్డాక పెళ్ళాన్నొడ్డాడు. అసలు ఆ సమయములో ఆమె ఎవరి పత్నో చరిత్రకు తెలుసో లేదో . ఒకవేళ అతని పత్ని కానియెడల తమ్ముని పత్నిని ఒడ్డడం ధర్మమో అధర్మమో… ఆ ధర్మరాజుకు,అతని సహోదరులకు ద్రౌపది పాతివ్రత్యం కాని,ఆమె ఎదలో రగిలే జ్వాలలు కాని అర్థమౌతాయని అనుకోవడం మన అవివేకమే అవుతుంది. వారి వారి జన్మలన్నీ కర్మ బంధాలే కావొచ్చు కానీ ఆడది ఎంత ప్రేమించినా సంతృప్తి చెందని సగటు మగాడు ఆనాడూ ఉన్నాడని ధర్మరాజు ద్రౌపది అంతిమ దశలో ఆమెనుద్దేశ్యించి చేసిన విమర్శ ఋజువు చేస్తుంది.. భగవంతునికి స్త్రీల పట్ల ఎంత వివక్షుందో ద్రౌపది నుదుటి రాత ఇలా వ్రాయడంలోనే తెలుస్తోంది. యుగంతో పాటు కాలమూ మారింది . మహిళలు సైతం అక్షర జ్ఞానంతో కొంతవరకూ మారారు. వెనుతిరగక అలసిపోని అవిశ్రాంత శ్రామిక మహిళలు ఆత్మ స్థైర్యంతో విజయ పధంలో పయనిస్తూ అగ్రపధంలో ఉన్నారు. కానీ అవీ వేళ్ళమీద లెక్కించే ఘనతలే. నేటి సమాజాన్ని చూస్తే ఇక చరిత్రలన్నీ ముగిసే కలియుగమొచ్చింది అనిపిస్తోంది . కార్పొరేట్ కల్చర్ పెరిగింది.క్లబ్బులూ పబ్బులూ డిస్కో థెక్కులూ పెచ్చుమీరాయి. వాటితోపాటే మృగాళ్ళకు ఆకలి హెచ్చింది. తల్లి, చెల్లి , కూతురు, మనవరాలు ఎవరైనా కానీ వరసేదైనా కానీ ,పక్కింటమ్మాయి కానీ మతిస్థిమితం లేనిదైనా కానీ , పసికూన కానీ , పతివ్రత కానీ …ఆడదైతే చాలు అనుకుంటూ కిరాతకంగా శీల దోపిడీలు హెచ్చాయి. ఒక శ్రీలక్ష్మి తో మొదలై నిర్భయలతో ముగుస్తున్నాయి చాలా కధలు.ఎక్కడుంది లోపం పుట్ట్తుక లోనా , పెంపకంలోనా, సమాజం లోనా, సినీ ప్రభావం లోనా , నాగరికతల్లోనా? లోపమెక్కడున్నా బలిపశువు వనితే ఎందుకవుతోంది? ఇదే వరుస కొనసాగితే ఆలయాల్లో స్త్రీ దేవతలు కూడా ఉండరు. అమ్మతనం కరువై…మమకారం మరుగై ఎడారైన ఎడదలతో సమాజం బ్రతుకీడుస్తుంది. మహిళ కోరే మార్పు ఎక్కడినుంచో దేవునిలా ఊడిపడదు. మననుంచే రావాలి. మహిళల్లోంచే రావాలి. బూజు పట్టిన భావాల్లోంచి బయటికి రాగలగాలి. వరకట్నపు చావు లేని రోజు , ఆడపిల్లపై అఘాయిత్యాలు లేని రోజు , ధైర్యంగా ఆడవాళ్ళందరూ కనీసం రాత్రి 10 లోపు బయట క్షేమంగా తిరగగలిగే రోజు కోసం ఎదురు చూపు . “ఆకాశంలో సగం అవనిలో సగం…. నా తనువులో సగం…ఇంకేమి ఇవ్వాలి మీకీ జగం” అంటూంటారు కొందరు పురుషోత్తములు. మహిళకు సగ భాగాలక్కరలేదు.అసలు ఎవరిసొమ్మునో ధారాదత్తంగా ఏ మహిళా స్వీకరించదు.తనకూ వ్యక్తిత్వముందని గౌరవించాలి. అస్థిత్వ గుర్తింపుకై ప్రాకులాడే స్థాయి నుంచి మహిళలు దిశానిర్దేశం చేసే స్థాయికెదగాలి . ఎవరో ఏదో చేస్తారని కాదు. ఇది చదివి కొందరైనా స్త్రీల బ్రతుకులు మార్చేందుకు పూనుకొంటారని, తమతో సమాన గౌరవం మహిళకిస్తారనే చిన్ని ఆశ. అప్పటివరకూ వత్సరానికొకసారి ఆకులు రాల్చే శిశిరంలో వచ్చే మూర్దాభిషేకం ఈ “మహిళా దినోత్సవం” …బలిచ్చే జీవానికి బహు పూజలన్నట్లు జరుపుకుంటూనే ఉందాం. మర్నాటికల్లా మళ్ళీ మామూలే…. అయినా సరే చెప్తున్నా నా ప్రియ సోదరీ మణులందరితో పాటు ఇంత బడబాగ్నిని మోస్తున్న నా తల్లి మూగ ధరిత్రి క్కూడా….. “ హ్యాపీ ఉమెన్స్ డే “ 8th March 2014
by Padma Sreeram
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1imaqG4
Posted by Katta
by Padma Sreeram
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1imaqG4
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి