కె.ఎన్.వి.ఎం.వర్మ//ఆవకాయ,One Demand// చింతనిప్పుల్లాంటి నాన్న కళ్ళు ఎర్రబడ్డ కంచం చూసి ఎలా మెరుస్తాయో నాకు మాత్రమే తెలిసిన వారసత్వకధ చెబుతా విను.. రక్త పోటు 160/100 ఉంది కదా పిప్పళ్ళ బస్తాలా ఉన్నావ్ చస్తే ఎలా మొయ్యాల్రా నిన్ను అని ఉమ్మూసుకొచ్చిన మధు రెండు ముద్దలు పెట్టించుకుందామనుకున్నాను అప్పుడే కాళీ చేసావా అన్నప్పుడు బొసి కంచం నేనూ నవ్వాము మజ్జిగలోకి దాచుకున్న ముక్కలేమో ఎక్కిరించాయ్ ఇల్లాలా! ఇక ఆవకాయ పెట్టు విధానం చూద్దాం గోలెంలో తిరగబోసి కాయలు అటక మీద నుంచి ఆవకాయ కత్తిపీట తీస్తారు ఆరడుగుల నాన్నకి కత్తి పీట లోకువో కత్తిపీటకి మావిడికాయలు లోకువో సంవత్సరం పాటూ గుడ్డకట్టి అటక మీద దాచినా కత్తి పీట తగ్గని పదును వెనుక గండికోట రహస్యం నా మట్టిబుర్రకి చిక్కదు జీడి తీసి ముక్క తుడిసి పిల్లలంతా తలో చేయీ వేస్తే సీతమ్మగారి కూర వెక్కిరించే అమ్మ సుబ్బరాయుడికి ఏమొచ్చులే డెకారించే నానమ్మ అకస్మాత్తుగా స్నేహితురాళ్ళై పోతారు ఆవపిండి, వెళ్ళుళ్ళి గుళ్ళు, ఉప్పూ కారం పప్పు నూనె ఆవకాయ ముక్క కలవగానే పింగాణీ జాడీకి పెళ్ళి కూతురు కళ వస్తుంది మేనత్తల వాటాలు చుట్టు పక్కాలకి పంపకాలు చాకలికి, మంగలికి, పాలేర్లకి సర్దుబాట్లు జరుగుతావుంటే ఆవకాయ పడితే ఆరోజు కూర వండటం నిషిద్దం అప్పుడు అమృతం పట్టుకొస్తుంది నానమ్మ సీతమ్మ వేడి వేడి నూకలన్నం కంచంలో కుప్ప పోసి మద్యలో గుంట పెట్టి నిండా వెన్నపూస వేసి కొత్తావకాయ వేసుకొని తింటుంటే....అబ్బా అలా గుటకలేయకు నీకు నోరూరితే నాకు సంభందం లేదు ఆవకాయ తినని జన్మ జన్మా కాదు పైన అమృతం దొరుకుతుందో లేదో పద ముందు ఆవకాయన్నం తిందాం. ఉగాదికి సెలవు ఇచ్చినట్టే ఆవకాయ పట్టిన రోజూ సెలవివ్వాలని నా చిన్నప్పటి డిమాండ్....06.03.2014.
by Nvmvarma Kalidindi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jUwAg7
Posted by Katta
by Nvmvarma Kalidindi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jUwAg7
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి