భాషాసిద్ధి లోకంలో జరిగితే, కవిత్వ భాషను కవులు తయారు చేసుకుంటారు. సాధారణభాష కవిత్వ భాషగా మారే క్రమం ఒకటుంటుంది. ఆ క్రమంలో జరిగే పరిణామాలను గుర్తిస్తే కవిత్వ భాషాస్వరూపం అర్థం అవుతుంది. ఇవి చేరాగారు “కవిత్వభాష” అన్న వ్యాసంలో చెప్పిన మాటలు. వ్యవహారంలో ఉండే మామూలు మాటలనుంచి కవిత్వాన్ని సృష్టించవచ్చు కాని, ఆ మామూలు మాటలే కవిత్వం కాదన్న సంగతి కవిత్వాన్ని రుచిచూసిన ఎవరికైనా తెలిసిన విషయమే. సాధారణ వ్యవహారంలో ఉన్న భాషకీ కవిత్వంలో ఉన్న భాషకీ కొంతైనా వ్యత్యాసం ఉండడం సహజం. కవిత్వంలో భాషకి స్థూలంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మామూలు విషయాన్నైనా చదివేవాళ్ళ (వినేవాళ్ళ) మనసులకి బాగా హత్తుకొనేట్టు చెప్పడం. మామూలు వ్యవహారంలో మనం వాడే భాషకి యీ ప్రయోజనం సాధారణంగా ఉండదు. మన భావాన్ని ఎదుటివాళ్ళకి వ్యక్తం చెయ్యడం వరకే సాధారణ భాష చేసే పని. ఒకవేళ నొక్కి చెప్పాల్సిన సందర్భం వచ్చినా, ఉచ్చరించే స్వరమూ, హావభావాలూ వంటి భాషేతరమైన ప్రక్రియల సహాయం తీసుకుంటాం (పిల్లల మీద కోపాన్ని ప్రదర్శించే సందర్భం దీనికి మంచి ఉదాహరణ!). కవిత్వంలో అది కుదరదు. చెప్పే విషయాన్ని హత్తుకొనేట్టు చెప్పడానికి కవికి ఉన్న పరికరం భాష ఒక్కటే. కాబట్టి భాషలోంచి కవిత్వాన్ని పుట్టించే ఆల్కెమీ కవికి తెలిసి ఉండాలి. రెండవ ప్రయోజనం – ఒకోసారి కవి చెప్పాలనుకున్న విషయం మామూలు విషయం కాకపోవచ్చు. కవి ఊహలోంచి పుట్టిన ఒక విచిత్రమైన కల్పన కావొచ్చు. లేదా మాటలలో చెప్పలేని ఒక గాఢమైన అనుభూతి కావొచ్చు. ఇలాటి సందర్భాలలో సాధారణ భాష పనిచెయ్యకపోవచ్చు. అప్పుడు కవి తనదైన భాషని సృష్టించుకుంటాడు. కవిత్వభాష వ్యవహార భాషకన్నా ఎందుకు భిన్నమైనదో చేరాగారి “కవిత్వభాష” అన్న వ్యాసం మరింత విస్తృతంగా చర్చిస్తుంది.
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ie8MX1
Posted by Katta
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ie8MX1
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి