తిలా పాపం ... తలా పిడికెడు . . ! ! బ్రతకడానికి అవకాశాలు కల్పించక ఆత్మ హత్య మహా పాపమని చట్టాలు చేసే చట్టుబండల ప్రభుత్వం . . ! బ్రతుకు మీద విరక్తి కలిగేలా ఆస్తులు, మెటీరియలిస్టిక్ విజయాల కొలమానాల్లో ఆత్మాభిమానాన్ని కొల్లగొట్టే సమాజం...! బ్రతకాలనిపించడానికి గుప్పెడు ప్రేమను, కాసింత మనోస్తైర్యాన్నిచ్చి , ఆసరాగా మేమున్నామనే ధైర్యాన్ని అందించలేని కుటుంబం . . ! ఉద్యోగాల వేటకు ఆయుధాల్ని చెక్కటమే పరమావధిగా కాసుల బాటలే కాని బ్రతుకు పాఠాలు నేర్పని కళాశాలలు . . .! చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కన్ను మూసాక కన్నీటి వీడ్కోళ్ళు ఆయుష్షు తీరాక అశ్రు నివాళులు శ్వాస ఆగాక సంతాప సభలూ. . ! రాలు తున్న ఒక్క విరినైనా దోసిట పట్ట లేమా .. ? ఒక్క సారి నీ చుట్టూ నిశితంగా చూడు . . . నీ నేస్తాన్నో , సహచరినో సహోదరున్నో, సహోద్యోగినో నిను కన్న వారినో, నువ్వు కన్న వారినో . . గల గలా మాట్లాడే వాడు మూగబోయాడా? చలాకీగా తిరిగే వాడు స్తభ్ధమై పోయాడా? చలోక్తులు విసిరేవాడు వేదాంతాలు వల్లిస్తున్నాడా? పనిమంతుడు పరధ్యానంలో పడ్డాడా? సమూహాల్లో ఒంటరిగా ఉంటున్నాడా? ఒంటరిగా శూన్యం లోకి చూస్తున్నాడా? ప్రసన్నంగా ఉండేవాడు అసహనంగా అరుస్తున్నాడా? కళ్ళల్లో, నవ్వుల్లో జీవం లేదా? నైరాశ్యపు మహమ్మారి కమ్మేస్తుందో . . మాయదారి మృత్యు హేల ముంచుకొస్తుందో . . పరికించి చూడు. . . మామూలు ప్రవర్తనకి ఏ మాత్రం తేడా కనపడినా విస్మరించకు . . ఒక్క సారి భుజం మీద చేయి వేసి ఆత్మీయంగా పలకరించు . . . సంఘర్షణ ఎందుకని సావధానంగా ప్రశ్నించు. . . గడ్డ కట్టిన దైన్యాన్ని దయతో తట్టు కన్నీరై కరిగితే కరుణతో గుండెలకు హత్తుకొని ఓదార్చు...! సమస్యకు పరిష్కారం చూప లేకున్నా చెదిరిన మనసుకు స్వాంతన ఇవ్వు . . అలసిన బ్రతుకుకు ఆసరా ఇవ్వు . . జీవించడానికి అర్ధాన్ని జీవితానికి సార్ధకతనీ కలిగించుకోగలిగే తరుణోపాయాన్ని బ్రహ్మోపదేశంలా గావించు. . తొలి పొద్దులోనే మంచు బిందువుల్లా ఆవిరై పోతున్న మరిన్ని ప్రత్యూషల్నో, ఉదయ కిరణాల్నో సజీవంగా ఉంచడానికి స్వాంతనోక్తుల సంజీవిని హృదయం చేతుల్లొ ఎత్తుకు తిరుగుదాం . . ! నుదుటి రాత రాసిన విధాత కన్నా పురుడు పోసిన కన్న తల్లి కన్నా పునర్జన్మ ఇవ్వగలిగిన వారు మహనీయులు . . ! ! "చెలిమియె కరువై వలపే అరుదై చెదిరిన హృదయము శిలయై పోగా నీ వ్యధ తెలిసి నీడగ నిలిచీ . . . చీకటి మూసిన ఏకాంతంలో నేనున్నానని నిండుగ పలికే వారు నిజంగా ధన్య జీవులు. . ! నిర్మలారాణి తోట [ తేది: 11. 02. 2014 ]
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eMFIn5
Posted by Katta
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eMFIn5
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి