పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

నారాయణస్వామి వెంకటయోగి॥ యెవరైనా ఉన్నారా – ఎక్కడ? ॥

యెవరినైనా తెలిసిన వాళ్ళని అర్జెంటు గా కలవాలి – అన్నీ కూలిపోయిన మైలు రాళ్ళే! ఎక్కడని పత్తా చెప్పను – ఎవరైనా వస్తారేమో నని ఎదిరిచూపు – మాటలు లేక నోరెండుక పోతోంది – నోటి నిండా గాజుపెంకులు – వేచి చూసే క్షణాలు – యెవరినైనా హఠాత్తుగ పలకరించాలని దేవులాట – చౌరస్తాలన్నీ సర్కారు తుమ్మల పరిక్కంపలే – గీరుకుపోయిన పెదవులతో చిరునవ్వుతారెవరో – గడ్దకట్టిన ఎలక్ట్రానిక్ భాష పరిచిత శీతలత్వమై కోసుకుపోతోంది – యెటూ పోలేము – ఇక్కడ క్షణం వుండలేం – బుజాల మీద చేతులెవరివి – బిగుసుకుపోతున్నాయి – నిశ్చలచైతన్యం లోకి నూకేస్తున్నాయి – యెవరినైనా గట్టిగా అలుముకోవాలి – యెన్ని శతాబ్దాలైంది – మనిషిని కౌగలించుకోక – శరీర వేడిని తాపించక – చుట్టూ ఇనుపకవచాల శరీరాలు – ఇంటర్నెట్ ని కప్పుకున్న శరీరాలు – అంతా ఒక్క తీరుగనే –– గుర్తు పట్టలేను – కాంక్షించలేను – అక్షరాలే పదాలే మాటలే వాక్యాలే పొంతన లేదు అర్థంకావు వినబడవు స్పష్టంగా – అంతా ఒకే అరుపు – అంతా ఒకే చెవులు చిల్లులుపడే నిశ్శబ్దం – తిరిగి తిరిగీ అదే చౌరస్తాకు – అవే ముళ్ళకంపలకు చినిగిపోయిన మురికి అంగీలా వేళ్ళాడుతూ – ఎండా, వానా, వెన్నెల లేని రాత్రో, వెల్తురు లేని పగలో తెలియని – ఏ చోట? ఏ పూట ? ఎవరైనా ఇటువైపు వస్తున్నరా, పోతున్నరా - చేయందిస్తున్నరా, మాట విసురుతున్నరా, పలుకులు గుచ్చుతున్నరా – ఏదో ఒక దీర్ఘ నిద్ర, పొడుగాటి కల – రాళ్ళు విసిరే మౌనం - ఏమీ తెలియని నిర్విచారం –బూడిదలా పరుచుకున్న నిరామయం – యెవరైనా ఉన్నారా – ఎక్కడ?
3.9.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి