కత్తులకంటిన
నెత్తుటి గాయాల్ని
కన్నీళ్ళతో కడుక్కోవాలి.
యుద్దానికి, యుద్దానికి మధ్య, కాసేపు
కాఫీ బ్రేక్ ఇవ్వండి మిత్రులారా.
వున్న మూడడుగులూ కాస్తా-
కబ్జా చేసేస్తే ఎట్లా?
పదాల్ని ప్రసవించే ప్రయత్నంలో,
నిండు చూలాలు నా కలం.
కాలు మోపేంత కాలమైనా-
కనికరించండి కామ్రేడ్స్.
ఆయుధాల సంతలో ఓ మూల
పంజరాల్లో పావురాళ్ళు.
వాదోపవాదాల పాదాల క్రింద-
తలెత్తుకోలేని లేత చిగుర్లు.
పచ్చని చెట్టొకటి దొరికిందనే కదా-
పుల్లా పుడకలతో గూళ్ళు కట్టుకునేది?.
పిట్టల స్వప్నాల్ని తూటాల సవ్వడితో
వెళ్లగొట్టేస్తే ఎలా?
సమరానికి సమరానికి మధ్య-
శాంతిక్కూడా చోటిస్తేనే కదా
మూణ్ణిమిషాల మౌనం పాటించేది?.
శవాల్ని గుర్తుపట్టనివ్వండి సోదరులారా.
వివాదాల నదుల్లో
అట్లా ముంచేస్తే ఎలా..?
పిల్లకాల్వల్లో కాగితప్పడవల్ని
కొద్ది దూరమైనా కదలనివ్వండి.
నినాదాల వర్ణాల్ని
పులిమేసిన గోడలపై
ఏదో ఓ మూల
చిన్నారి సాలెపురుగులుంటాయి
కవిత్వాన్ని అల్లుకోడానికి-
వాటికి
అనుమతినివ్వండి.
అరె మిత్రులారా...
కవిత్వం అల్లుకోవడానికి
ఎవరికీ
అడ్డుకాకండి.
__03/09/2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి