నా దగ్గర ఉన్నదిదే..నేను అమ్మేదిదే..
ఎవరేమైనా అననీ..
గోప్పననీ..తప్పననీ..పతిత అననీ...పరాన్న భోక్తం అవనీ..
నా పిల్లల ఫీజులు కట్టేందుకు...మేం మనుష్యుల్లా బ్రతికేందుకు..
తప్పదీ తొమ్మిది నెలల బరువు..
తోసేసా తలకెత్తుకున్న పరువు...
నా గర్భం అమ్మక తప్పదు.. నా దగ్గర ఉన్నదిదే..
పొగిడారు కొంతమంది.. తెగిడారు మరింతమంది..
అసూయ పడ్డారు మా వాడ వాళ్ళు..
ఆశగా చూసారు అవకాశం రాని వాళ్ళు..
ఛీ..దీనికన్నా ఒళ్లమ్ముకుంటే నయం...అన్నాయి కొన్ని నోళ్ళు..
నా కడుపు కూడా నా వోళ్ళే కదా..
వచ్చిందో సందేహం
వోళ్ళే కదా అమ్ముకుంటున్నది..??
నీరు పట్టిన నిండు నెలలే కదా నా వరకు మిగిలేది..?
వ్యభిచారం కంటే.. వంశాలు నిలపటం
ఖచ్చితంగా లాభసాటి బేరం..
నిజమే.. ఈ పని ఘోరమే..
రక్త బంధాన్ని.. ప్రేమ పాశాన్ని అమ్ముకుంటున్న నేను..
మీ ఊహా ప్రపంచపు బ్రహ్మ రాక్షసినే..
బ్రహ్మ రాయలేని నా విధి నేను విధిగా నిర్వర్తిస్తున్న దానినే
అందుకే మీ సహానుభూతి పై ఆశా లేదు..
సహకారం పై ఆసక్తీ రాదు..
అవునూ.. మళ్ళా సందేహం..
నా కడుపు..క్షమించాలి నా వొళ్ళు నేనమ్ముకుంటే..
మీకేంటి బాధ..??
పుట్టిందగ్గర్నుంచీ అద్దె కిస్తూనే ఉన్నా కదా
పాచి పనుల్లో.. అమ్మకి చేతులిచ్చా..
తాగోచ్చిన నాన్న దెబ్బలకి.. వీపు..
పెళ్ళయ్యాక మావోడికి.. వొళ్ళంతా ఇస్తూనే ఉన్నా..
అమ్మనయ్యాక నా పిల్లల కోసం రక్తం..
ఇలా వీళ్ళందరికీ అడక్కపోయినా మనసు నైవేద్యం ఇస్తూనే ఉన్నా..
ముక్కలుగా కోసి .. శరీర పళ్ళెం లో పెట్టి మరీ..
ఇవాళ ఏదో నా గర్భం అద్దె కిస్తే..
భూగర్భం చీలినంత గోల చేస్తారెందుకు..
ప్రతీ ఆడదీ చేస్తున్నదేగా..
ఇప్పుడు దానికో వెల నిర్ణయమైనందుకు..
మనం సంతోషించాల్సిన విషయం కదూ..
సరే గానీ..
నిరంతరం తాము నమ్మిన విలువలు అమ్ముకుంటున్న వారి మీద
లేని జాలి, జుగుప్స..
నా మీద కుమ్మరించకండి దయ చేసి..
వర్ణాల కతీతంగా వంశాల బరువు మోయగలం గానీ..
మీ సానుభూతి నెత్తి కేత్తుకోలేను..
అసలే ఒట్టి మనిషిని కాను నేను..!!
--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి