పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

సురేష్ వంగూరీ || మరో ముల్లు ||


ముల్లును ముల్లుతోనే తీయాలి
తీసే విధానం సరిగా తెలియాలి

ఒక ముల్లు కసుక్కున దిగబడింది దోపిడీదారుడిలా
మరో ముల్లు జాగ్రత్తగా దానిని తొలగించాలి ఉద్యమకారుడిలా

వాదాలూ, విశ్లేషణలూ తర్వాత
ముందు ముల్లెలా తీయాలో తెలుసుకో
ఎగబడి ఆగ్రహించటం ఉద్యమమైతే కాదు

ముల్లును మెత్తగా గీరటం తెలుసా
లేతగా స్పృశించటం తెలుసా
కొంచెం కొంచెంగా చర్మాన్ని చల్లగా చీలుస్తూ
లోపలికి పోవటం తెలుసా
ఒక్కొక్క పొరనే ఓర్పుగా కదుపుకుంటూ
మృదువుగా ముల్లును బైటకి నెట్టడం తెలుసా

ఈ ప్రయత్నంలో
నొప్పి అనివార్యమే కానీ
అధికారికం కాదు సుమా

ఆగ్రహ ప్రకటన అంటావ్
ఎవరి మీద?
ముల్లు మీదా? దేహం మీదా?
కలుపు మొక్క మొలిచిందని పొలం తగలబెడతావా?
ముల్లు బాధ పెడుతోందని కాలు నరుక్కుంటావా?

మానవీయ విలువల్ని తుంగలో తొక్కి
ఉద్యమించటం అంటే మరో ముల్లుగా దిగబడటమే

అన్నా...
ఇప్పుడు చెబుతున్నా
ఇదే ఉద్యమమంటూ
ఇష్టమొచ్చినట్టు నువ్వు గుచ్చుకుపోతుంటే,
సమాజం కదా, నా దేహం కదా
చూస్తూ వూరుకోలేను
కష్టంలో కష్టం
నొప్పిలో నొప్పి
రెండు ముళ్ళు దిగాయంటూ
నిన్ను కూడా వదిలించుకుంటా

9.3.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి