కాలం ఒక మహాచలనం
మార్పును కిరీటంగా ధరించి
మనిషుల్ని దాటుకుని పోతుంటుంది
కాలం ఒక యధాలాప ప్రయాణం
కొన్ని సార్లు రెక్కలు వస్తాయి
అప్పుడప్పుడు గడ్డకట్టుకుపోతుంది
అంతిమంగా ముందుకే ప్రవాహం
మానవ సమూహపు గెలుపోటములతో సంబంధంలేని నిరంతర గమనశీలి
బంతిపువ్వులాంటి చంద్రున్ని
కౌగలించుకుని కాలానికి వన్నెతెచ్చింది
మనిషే !
అద్భుత అక్టోబర్ విప్లవాన్ని
నిజం చేసిన కాలాన్ని ఆవిష్కరించింది మనిషే!
కాలాన్ని పండించిన
విజ్ఞానపు కాంతులు
కాలచరిత్రలో మరెన్నో...
ఆ కాలాన్ని కౌగిలించుకోవాలి
కాలాన్ని మహోన్నతం చేసినా
కాలానికి అపకీర్తి కట్టబెట్టినా
మనిషే !!
పనికి రానివాటిని
నిర్ధాక్షిణ్యంగా తోసివేస్తూ
నిజాల్ని గుప్పిటపట్టి
ముందుకు సాగేదే కాలం
కాలం కదలిక
మనిషికి చైతన్యం
గతం పోతూ
వర్తమానాన్ని ఆవిష్కరించటం
ఒక అద్భుత సన్నివేశం
గడిచిన కాలపు అనుభవ సంపదను పోగేసుకుని
వర్తమానపు ఆశారేఖలతో
భవిష్యత్తుని నిర్మించుకోవటానికి
ఓ మహత్తర వేదిక
కాలం తనను తాను
ఆవిష్కరించుకుంటుంది
చైతన్యాన్ని అద్దినప్పుడు
కాలం పండుతుంది
కాలం కాన్వాసుపై
సంతకం చేసే తరమే
చరిత్రకు ఉత్తేజం
ప్రవహించే కాలాన్ని
ఒడుపుగా పట్టుకుని
మానవత్వపు చిహ్నాలను
చిత్రించిన వారే చిరస్మరణీయులు
కాలానికి మైలురాళ్ళని తగిలించి
మళ్ళించాలి
మానవాళి నిత్యం వికసించేలా
కాలం ఒక స్ఫూర్తి
కాలం మార్గదర్శి
*24.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి