ఆ సాయంత్రం
గుబులు నీడలు గుండెను కమ్మిన
ఆ సాయంత్రం
ఆశలన్నీ ఉడిగి నిస్త్రాణమైన ప్రాణంతో
పడని అడుగులను ఈడ్చుకుంటూ ...
ఆ వేసవి సాయంత్రం నీటి చుక్క కరువై
కన్నీరు కూడా చిందలేని ఆర్చుకుపోయిన కళ్ళతో
చెలిమి చెలమలింకిపోయిన ఆ సాయంత్రం
అసహాయంగా ఆకాశం వైపు చూస్తూన్న రైతులా
వర్షాధారిత పంటల కోసం వాన కోసం ఎదురు చూస్తూ
జీవితపు కోర్కేలన్నిటికీ తాళం పెట్టి ....
జీవికకోసం వెదికి వెదికి వేసారి
ఉసూరంటూ ఎడ్వలేని బ్రతుకిక ఈడ్వలేనని
రుజువైపోయిన ఆ సాయంత్రం
గమ్యం లేని నడకతో బతుకు మీది కసితో
అడవుల వైపు అడుగులేసిన ఆ సాయంత్రం
ఆ చీకట్లలో దారీ తెన్నూ లేక నడక సాగిస్తూనే
అర్ధం లేని అర్ధం కాని గుండె ధైర్యమేదో అవహించినట్టు
అవగతం కాని మొండి తనమేదో
కాలం పై కసి తీర్చుకోమన్నట్టు ఆ సాయంత్రం
అలా మొదలైంది నా నడక
గమ్యం అందక పోయినా కనీసం నడిచిన దారిని
ఆస్వాదించే వైపుగా నా పాదాలు ఆ సాయంత్రం
ఇన్నేళ్ళకి ఒక స్వతంత్ర నిర్ణయం
తీసుకున్న ఆ సాయంత్రం ....
నిర్భీతిగా , నిశ్చలంగా ,సంధ్య కెంజాయలో కలిసి
నీరవ నిశీధిలోనికి
ఒక వెలుగు రేఖ కోసం పయనించిన ఆ సాయంత్రం ...!!!
*23.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి