పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, జులై 2012, మంగళవారం

వొరప్రసాద్||భూమి మనుషులు||


సూర్యుడు ఉదయపు వెలుగై
రోజూలానే మేల్కోలుపుతాడనుకున్నారు
కులం కుట్రగా మారి
తెల్లవారు జామునే కాటేస్తుందని ఊహించలేదు
లక్ష్మింపేట దళితపేట ఒక్కసారిగా
దుఃఖ సముద్రం అయ్యింది
ఉత్తరాంధ్రంటే అమాయకపు యాసతో
మాట్లాడే వెనుకబాటు తనమే అనుకున్నాం
కులం బలమై బరితెగించి
దాడవుతుందనుకోలేదు
- - -
నేలను గుప్పిట బిగించి
పెత్తనమై వాడు కులహంకారమయ్యాడు
విచక్షణ కోల్పోయి
అమానుషత్వంగా మారి
దళితపేటను వేటాడాడు
గొంతు నులిమాడు
కాళ్ళు విరిచాడు
బల్లెం పోటయ్యాడు
గొడ్డలి వేటయ్యాడు
తల్లి ముందు కొడుకును
భార్య ముందు భర్తను
శరీరమంతా కులాయుధంగా మార్చుకుని
మరీ హతమార్చాడు
లక్షింపేట ఇప్పుడు లక్ష్మింపేట కాదు
భూమిని హత్తుకున్నందుకు
దళితులను బలిచ్చిన నేలయ్యింది
శ్రీకాకుళం నుదుటిన
ఆరని రక్తపు మరకయ్యంది
భయోత్పాతపు దృశ్యాలను చూసిన
లక్ష్మింపేట దళిత నేత్రాలు
రెప్పవేయడానికి భయపడుతున్నాయి
- - -
పంచనామాల లాంఛనాలు
పశ్చాత్తాపాలు కాదు ఇప్పుడు చేయాల్సింది
రక్తతర్పణానికి కారణమయిన ఆ నేల చెక్కతోనే
వాళ్ళను ప్రాథేయపడాలి
కనీసం వాళ్ళను భూమి మనుషులను చేస్తేనే
కొన్నాళ్ళకు వాళ్ళు మనుషులను నమ్ముతారు!
*23.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి