పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

శ్రీ మోదుగు కవిత-మరికొన్ని నూకలు




కవులచుట్టూ కొన్నిస్వభావాలు అల్లుకొని ఉంటాయి.వీటన్నిటి ప్రభావంకవిపై ఉంటుంది.అది ప్రాంతం,విద్యార్హతలు.వృత్తి ప్రవృత్తి ఇవిఏవైనా కావొచ్చు.కవి తీసుకునే వస్తువులే కాదు.నిర్మాణపరికరాలుకూడా ఆయా స్వభావాలనానుకునే ఉంటాయి.రకరకాల వృత్తులలో ఉన్నవారు సాహిత్యంలోకి రావడంవల్ల వస్తువులు,నిర్మాణపరికరాలు మొదలైన వాటి వైశాల్యం పెరుగుతుంది.అనేక కొత్తవిషయాలు చర్చకు వస్తాయి.


శ్రీమోదుగు గారు వైద్య పరిభాషతో,ఆ వాతావరణంలోని అంశాలనేతీసుకుని స్పందిస్తూ "మరికొన్ని నూకలు"రాసారు.గుండెల్లో నెప్పి మొదలై అదిస్థిమిత పడక కొంత ప్రయత్నంతరువాత స్వాంతన చేరడందాక ఈకవిత సాగుతుంది.ఇందులోని అంశాలని మానసికోద్వేగంతో చిత్రించారు.

ఇందులో శ్రీమోదుగు గారు చిత్రించిన పద్దతి,అందుకు ఉపయోగించిన పదాలు,పరిభాష గమనించదగింది.గతంలోనూ సాహిత్యంలో ఇలాంటిశైలి డా.ధేనువకొండ శ్రీరామ్మూర్తి కథలు"మోహతిమిరం"లో,ఈ మధ్య వచ్చిననవల"డా.సుందర్ రావు.ఎం.డి."లలో కనిపిస్తుంది.

ఇందులో వైద్య శాస్త్రానికి సంబంధించికొన్ని పదాలు కనిపిస్తాయి.

"యాస్ప్రిన్ హెపారిన్ లు చేతులెత్తేసి సిగ్గుపడుతున్నాయ్"
"thrombolytics రక్తం తో వీర పోరాటం మొదలెట్టినట్లుంది"

యాస్ప్రిన్,హెపారిన్-ఈ రెండూమెడిసిన్స్ హెపారిన్ రక్తం గడ్దకట్టకుండ ఆపేందుకు ఇస్తారు.ఇది గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది కూడా.యాస్ప్రిన్ బ్లీడింగ్ కాకుండా ఉండడంకోసం ఉపయోగిస్తారు,..thrombo lytics..థ్రాంబస్ రక్తం గడ్దకట్టటం ..lytics కరిగించే ప్రక్రియ.నిజానికి ఇవి సామాన్య పాఠకుడినించి ఎక్కువ ఙ్ఞానాన్ని అపేక్షిస్తాయి.

వీటిని చాలా సమర్థవంతంగాకవితలో ప్రయోగించారు.ఒక నెప్పి కలగడం నుండి మళ్లీ సానుకూల పడేదాకా ప్రతి అంశాన్ని కవిత్వం చేయడంలో దర్శనం,దాని వెనుక ఉన్న ఙ్ఞానం స్ఫుటంగా కనిపిస్తాయి.

"కలుక్కు మంది గుండెలో ఎప్పటిలా నీవేనేమో అని సరిపుచ్చు కున్నా
కాని మంట క్రమ క్రమంగా పెద్దదవుతుంది "

"నిను తలుచుకుంటూ బతుకును సాగాతీస్తుంటే
గుండె ఒక్కొక్క దారిని మూస్తోందని ఇప్పుడే తెలుస్తుంది"

"నెమ్మదిగా నా మనోఫలకం విడివడి కన్నులు తెరిచిన వేళ
జీవితం నాకిచ్చిన బహుమతి మరికొన్ని నూకలు "

హృదయంగల వైద్యులు రోగిని ఎన్ని దశల్లో ,ఎంత మానవీయ దృష్టితో పరిశీలిస్తారో ఇందులో అర్థమవుతుంది.మొదటి వాక్యంలో నెప్పి ప్రారంభాన్ని,రెండవ వాక్యంలో రోగి మానసిక సంఘర్షణని,మూడులో స్వాంతన పడిన స్థితిని చిత్రించారు.అన్నిటికీ మించి ఒక తండ్రి-కూతురు మధ్య ఉండే సంబంధాన్నొకదాన్ని స్పర్శించారు.

"నీళ్ళు కొమ్మరించినట్లు తడిచి ముద్దవుతున్నా నీ జ్ఞాపకాల వర్షంలా
బయట అదే వర్షం అదే చిరుజల్లు"
"నా చిట్టి తల్లి మోముని చూసి 'నేను కూడా ఉండకపోతే నీకు ఎలా తల్లీ అనుకున్న క్షణం '
జీవితం నాకిచ్చిన బహుమతి మరికొన్ని నూకలు ........."

సాధారణంగా వినిపించే "నూకలు చెల్లటం"అనే జాతీయంలోని అంతరార్థాన్ని వాడుకున్నా ఈకవిత ద్వారా సాధించిన నిర్మాణం చాలాగొప్పది.ఇది కేవలం చక్కని కవితేకాదు..చిక్కని కవితకూడా.మంచి కవిత అందించినందుకు శ్రీమోదుగు గారికి అభినందనలు.


                                                                                                                             ______ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

రాళ్లబండి శశిశ్రీ గారి కవిత






సృజనకారులు,లేదా కవులు ఎప్పుడు పుడతారు అనే ప్రశ్నకి మనోవైఙ్ఞానిక వేత్తలు ప్రకృతికి,సమాజానికి మనిషికి మధ్యన ఉండే ఆకర్షణ,సంఘర్షణనుంచి అనితేల్చేసారు.దానికి కారణం భౌతికంగా ,మానసికంగా ఈ అంశాలమధ్య ఉండటం కావొచ్చు.దీనికి కాస్తా ముందుకు వెళ్లాక ఒకే వ్యక్తి ఈ రెండు స్థానాలనుంచికూడా భిన్న కాలాలలో మాట్లడవచ్చుననేదీ వినిపిస్తుంది.

శశిశ్రీ గారు ఇలాంటి సంఘర్షణ నుండే కవితని రాసారు.ప్రతి వ్యక్తికి సమాజంలో తనను పోలిన ప్రతిబింబాలు ఉంటాయి.ఈ ప్రతిబింబాల వల్ల సామూహిక చేతన ఒకటి కలుగుతుంది.చాల మందిలో సామూహికత ధ్వనించడానికి అది ఒక కారణం.ఈ కవితలోనూ ఈఅంశం కనిపిస్తుంది.


శశిశ్రీ గారు ప్రస్తావించిన అంశం "వ్యక్తిత్వం"రూపు దిద్దు కొనటం గురించి.మొదటి భాగం"స్థితి"నించి సాగుతుంది.ఇది సాధరణ ఉద్వేగం.


"సాంప్రదాయపు మూఢభావాల/అడ్డుగోడలు చేధించలేక
కట్టుబాట్ల ఇరుకు వీధుల్లోనే/తిరిగా తిరిగి అవే దారులవెంట"

ఈ ఉద్వేగం క్రమంలో తాత్వికతని ధ్వనిస్తుంది.సమాజంలోని లక్షాలు సామూహికాలు .కాని ప్రయాణాలు కాదు.ప్రయాణాలు వైయ్యక్తికమే.కాని వీటికి సామూహిక చేతన ఉంటుంది.ఈ అంశం కవిత్వీకరించడం కనిపిస్తుంది.


"క్షణకాలం ఆగా/అలసిన మనసుతో/చుట్టూ చూస్తే తెలిసింది
నిశ్శబ్ద గీతాన్ని ఆలపిస్తూ/ఒంటరిగా నిలబడిపోయానని"

"ఒంటరితనం కాదేమో అది/చుట్టూ ఉన్నవారి భావాలతో
ఏకీభవించలేని జడత్వమది"

"నిశ్శబ్దం కాదేమో అది/అభిప్రాయాన్ని వ్యక్తపరచలేని
నైరాశ్యమది"

ఒంటరిగా వెళుతున్నానన్న బాధ,తనవైన వ్యక్తిగత ఆలోచనలు,ఇతరుల ప్రవర్తన పట్ల ఉండే నైరాశ్యం ఇవన్నీ ఈ వాక్యాల్లో కనిపిస్తాయి.ఈ సంఘర్షణ తరువాత అంతర్మథనంలోంచి వ్యక్తిత్వం రూపు దిద్దుకున్న అంశాన్ని చెబుతారు.

"ఆనిరాశలో ఆవిర్భవించిన/అంతర్మధనం
పరిణతి చెందిన/ఆలోచనకు ప్రాణం పోస్తే
నావ్యక్తిత్వం స్థిరత్వం దాల్చి/కాంతికిరణమై భాసిస్తోంది"

శశిశ్రీ గారికి ఊహకు తగ్గట్టుగా వాక్యాలని తీర్చిదిద్దటం తెలిసింది.మరిన్ని మంచి కవితలు అందిస్తారని ఆశిద్దాం.అభినందనలు శశిశ్రీ గారు.


సాధరణంగా తొలిదశల్లో పదాల పునరుక్తి ఎక్కువ.అది ఉద్వేగాన్ని కలిగించేదయితే అవసరమే.కాకుంటే అనుభవం దాన్ని దూరం చేస్తుంది.ఇప్పుడువస్తున్న కవిత్వపు వస్తువును,భాషని కొత్తగా రాస్తున్న వాళ్లు
మరికొంత ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం ఉంది.



                                                                                                                               ______ఎం.నారాయణ శర్మ



కవిత్వ విశ్లేషణ

స్వాతీ శ్రీపాద గారి కవిత: నదులూ,స్వప్నాలూ




ఒక అంశాన్నో,సందర్భాన్నో ఎన్నుకుని దాన్ని వర్ణిస్తూ రాసే కవిత్వాన్ని వర్ణనాత్మక కవిత్వం(Discriptiv poetry)అంటారు.వర్ణన అత్యంత ప్రధానంగా ఇందులో కనిపిస్తుంది.

స్వాతీ శ్రీపాద అలాంటి వర్ణనతో రెండురూపాలని తీసుకుని రాసిన కవిత"నదులూ..స్వప్నాలు".రెంటిలో ప్రవాహదిశని వర్ణిస్తూ రాసిన కవిత ఇది.ఒకటి ఆరోపభావం అనేది అర్థమయ్యేదే.కాని వర్ణనతో సమర్థనీయమైన గమనాన్ని సాధించారు.

స్వాతీ శ్రీపాదగారి కవితలో గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.వాక్యాలు చాలా పెద్దగా సుమారు ఒక యూనిట్ అంతానిండిపోయేవిగా ఉంటాయి.అయితే ఇవి కొన్ని పొట్టి వాక్యాల సమూహం

"కనురెప్పల తలుపులు మూసినా, తెరిచినా,
ఆల్లి బిల్లిగా అటునుండి ఇటూ, ఇటునుండటూ
ఎగిరే తూనీగల్లా పరుగులు తీసే నదులు
మనసు లోలోపలి పొరల నుండి
మౌన శూన్యాలను దాటి
పరిచిత పలకరింపుల నును వెచ్చని
హృదయసీమ కనుమలలోకి
కాస్త అలవోక గా రాత్రి భుజాలపై వాలే
వెన్నెల రెక్కలా కదలి వెళ్తుంటాయి "-ఇలాంటి వాక్యాలని సాధక వాక్యాలు(Praacteesed sentences)అంటారు.క్రమాన్ని కొంత మార్చి రాయటం.ఇందులో ఒక వాక్యం రెండు వాక్యాల మధ్య సంధాయక సంబంధాన్ని కుదురుస్తుంది.

ఇందులో ఒక వాక్యాన్ని గమనిద్దాం.
"మనసు లోలోపలి పొరల నుండి/మౌన శూన్యాలను దాటి"
ఇది అలాంటి వాక్యమే.ఒక క్రమాన్ని దీన్నుండి అర్థం చేసుకోవచ్చు.
"మనసు లోలోపలి పొరల నుండి/మౌన శూన్యాలను దాటి
కనురెప్పల తలుపులు మూసినా, తెరిచినా,
ఆల్లి బిల్లిగా అటునుండి ఇటూ, ఇటునుండటూ
ఎగిరే తూనీగల్లా పరుగులు తీసే నదులు"
పై వాక్యం మరో వాక్యంతోనూ సంబంధాన్ని కలిగివుంది.

"మనసు లోలోపలి పొరల నుండి
మౌన శూన్యాలను దాటి
పరిచిత పలకరింపుల నును వెచ్చని
హృదయసీమ కనుమలలోకి
కాస్త అలవోక గా రాత్రి భుజాలపై వాలే
వెన్నెల రెక్కలా కదలి వెళ్తుంటాయి "

ఈక్రమంలో మొదటివాక్యం "నదులు"అనే పదం వల్ల నదుల్ని,రెండో భాగం "రాత్రి,పరిచిత పలకరింపులు,"వంటివాటివల్ల వెన్నలరెక్క స్వప్నానికి ప్రతీకగ కనిపిస్తుంది.ఇలాంటి వాక్య నిర్మాణాలను వర్ణాత్మక కవితనుంచి ఎన్నిటినైనా సాధించవచ్చు.

అదేస్థాయిలో కళాత్మక అంశాలుకూడా కనిపిస్తాయి.స్వాతీ శ్రీపాద లోనూ ఇలాంటివి అనేకంగా ఉన్నాయి.

"ఋతువులు గొర్రెపిల్లలై అడుగులో అడుగేసుకుంటూ
దారి తప్పే యోచనే చెయ్యవని?"

"సుతి మెత్తని పాదాలకాలి వేలి కొసలపై జారే
వెండి మట్టెల మెరుపు"

"ఎక్కడినుండో ఏ చిత్ర కారుడి చేజారిపడిన
రంగుల సమూహంలా ఉన్నట్టుండి
మొలుచుకొచ్చే సుమసమూహాల వసంతహేలా "

ఇలాంటి మార్దవమైన వాక్యాలు చాలా ఉన్నాయి ఈ కవితలో.'వెండిమట్టెల మెరుపు""ఋతువుల గొర్రెపిల్లలు"కొత్త ప్రయోగాలు.ప్రకృతి సంబంధమైన అంశాలని చెబుతున్నప్పుడు కవుల్లోని ప్రతిభ ఇలాంటికవితల్లో కనిపిస్తుంది.మంచి కవితనందించిన స్వాతీ శ్రీపాద గారికి అభినందనలు.


______ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

రాజేందర్ జింబో కవిత-'బిట్స్ అండ్ క్లిక్స్' 




తెలుగులో 1990కాలనికి కాస్త అటు ఇటుగా ఎక్కువ వినిపించేపదం ప్రపంచీకరణ(Globalisetion).అనేక అంశాలతో పాటు సాహిత్యాన్ని కూడా ఒక కుదుపు కుదిపిన అంశం.అనేకమంది బుద్దిజీవులు ముక్త కంఠంతో వ్యతిరేకించిన అంశం.

80వ దశకంలో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభాలు తలెత్తటంతో అప్పటివరకూ ఆచరణలో ఉన్న కీన్స్ ఆర్థిక సూత్రాలు దాన్ని పరిష్కరించ లేకపోవడంతో అప్పటి అమేరికా అధ్యక్షుడు రీగన్,బ్రిటీష్ ప్రధాని మార్గరేట్ థాచర్ "వాషింగ్టన్ కాన్సెన్సస్ పేరిట కొత్త ఆర్థిక విధానాలు తెచ్చారని నిపుణుల వివరణ.అందులో భాగంగా బహుళ జాతి సంస్థలు,ఐ.ఎం.ఎఫ్,ప్రపంచ బాంక్ సర్దుబాటు విధానాలను ప్రపంచ దేశాలపై ప్రయోగించాయి.ఇది భారత దేశ ఆర్థిక వ్యవస్థనుకూడా ఇబ్బందిలో పడేసింది.

తెలుగులో ప్రపంచీకరణ ప్రభావం సాహిత్యంలో కనిపిస్తుంది."ఇండియా ప్రైవేట్ లిమిటెడ్"పేరుతో జూకంటి జగన్నాథం.కవితా సంపుటిని తెచ్చారు.గుడిపాటి"గ్లోబలైజేషన్"పేరుతో పుస్తకాన్ని తెచ్చారు.ఈ మార్గంలోనే"గ్లోబల్ ఖడ్గం"సంకలనం వెలువడింది.కవుల వ్యక్తిగత సంపుటాలు కూడా అనేకంగా వచ్చాయి.

"The liberal virus"(samir amin),"Under standing globaliseation"(Tony sachirato),"The world is flat"(Thomas friedman)మొదలైన పుస్తకాలు.ఈ అంశాన్ని సమర్థించాయి.అంతో ఇంతో తెలుగులోనూ ఇలాంటి సందర్భాలు లేక పోలేదు.కల్లూరి భాస్కరం గారు "వార్త" ఎడిట్ పేజీలో"ప్రపంచీకరణ తెలుగు సాహిత్య స్పందన"పేరుతో వ్యాసాలు రాసారు(27.2/3.3/10.3.2006).

ప్రపంచీకరణ ప్రభావాలని చిత్రిస్తున్న సందర్భంలోనూకవిత్వంలో కొన్ని దశలని గమనించవచ్చు.
1.తొలిదశలో కమ్యూనిస్ట్,మార్క్సిస్ట్ సిద్దాంత భూమిక తో తిరస్కరించడం.2.పల్లెల విధ్వంసం3.సంస్కృతి సంప్రదాయాల క్షీణత.కొత్త సంప్రదాయాల ప్రవేశం.4.కులవృత్తుల విధ్వంసం5.వలసలతో ప్రపంచమంతా ఒక్క నీడకి రావడం.మానవీయ సంబంధాల విధ్వంసం.

రాజేందర్ జింబో గారికవిత వీటన్నిటికి భిన్నంగా క్షణాల్లో జరుగుతున్న అనేక మార్పులను కవిత్వీకరించింది.ఆయన కొత్త సంపుటి "చూస్తుండగానే.."లో ఇలాంటివి కనిపిస్తాయి.ఈ కవితలోనూ మానీటర్,క్లిక్ లతో ప్రపంచం నడుస్తున్న అంశాన్ని వివరించారు.

"అంతా ఆన్‌లైన్ ఈ మెయిల్, ఈ గవర్నెన్స్
ఈ ఫైలింగ్ అఫ్గనిస్తాన్ నుంచి లాడెన్ వరకు అంతా మానిటరే
అమ్మను చూడాలన్నా అమ్మాయితో మాట్లాడాలన్నా మానిటరే
ఆటలు ఆనందాలు అన్నీ మానిటర్‌లోనే "

రాజకీయం.తీవ్రవాదం,కుటుంబ సంబంధాలు అన్నీ ఈ అధునిక కాలంలో దేనిపై ఆధార పడుతున్నాయనే అంశం పైవాక్యంలో కనిపిస్తుంది.తొలిదశలో టి.వి.ని వ్యతిరేకించడంకనిపించేది,ఇప్పుడు ఆస్థానాన్ని "కంప్యుటర్" ఆక్రమించింది.
మనిషి తనకుతాను దూరమవుతూ,మనిషితనం వ్యర్థమౌతున్న అనేక సందర్భాలుకూడా ఇందులో కనిపిస్తాయి.

"ఇక, మట్టికి, సున్నానికి స్థానం లేదట మాంసానికి రక్తానికి విలువ లేదట"

"అంతా ఆన్‌లైన్ మనిషి మౌస్ అయి
కుంచించుకుపోయినట్టు మౌస్ మనిషై శాసిస్తున్నట్టు
మౌసే మనిషిని కాటేస్తున్నట్టు ఫీలింగ్ "

భాషా పరంగా గానీ,ఊహపరంగా కానీ,వ్యక్తీకరణ విషయంలో గానీ పెద్దగా పాఠకుడినుండి ఙ్ఞానాన్ని కోరకుండా అనేక విషయాలని మనసుకందించే శైలి రాజేందర్ జింబో గారిది."హాజిర్ హై"నుండి ఇప్పటి వరకు ఆయన కవితలో ఒక బలమైన మానవీయ స్పృహ,జీవితేచ్చ కనిపిస్తాయి.ఆయన కవిత్వాన్ని చదవడం వల్ల ఇలాంటి అనేక విషయాలు అర్థం చేసుకో వచ్చు.మంచికవితని పంచుకున్నందుకు మితృలకు కృతఙ్ఞతలు.


                                                                                                                            ______ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ


వినోద్ కుమార్  కవిత :నువ్వు కల్లోకొచ్చాక



"యఃపూరయం కీచక రంద్రభాగాత్ దరీముఖోత్తేణ సమీరణేన
ఉద్గాస్యతామిచ్ఛతి కిన్నెరాణాం తానప్రదాయిత్వ మివోపగంతుం"

(అడవిలో వెదుళ్లరంధ్రభాగాలలో నిండుకున్న గాలి ఆ వనంలో సంచరించే కిన్నెరల గానానికి తానాన్ని పాడుతున్నట్టుగా ఉంది)-అడవిలో గాలివీచినప్పుడు వినిపించే పిల్లగాలి ఈలను కాళిదాసు ఇలా చిత్రించాడు.ప్రాచీన కావ్యాలల్లో ఇలాంటివి అనేకంగా కనిపిస్తాయి.

నిజానికిదీన్నిభావకవిత్వంలానో,అనుభూతిలానో,కళాసౌందర్యభావనలనించో విశ్లేషించుకోవచ్చు.వీటిలో వెంట్రుకవసి భేదాలున్నాయి.ప్రాచీనులు ఇలాంటిదాన్ని "ఆత్మకళ"(Artistic sole)అన్నారు.ఇంద్రియాలకు కలిగే అనుభూతి ఆత్మానుభూతి.

వినోద్ గారి కవితలో ఈఅందమైన సౌందార్యాన్వేషణకి స్వప్నం, ఆస్వప్నంలో చూచిన వ్యక్తి కారణాలు.ఆ స్పర్శ నుంచి తాననుభవించిన సౌందర్యం రెండు కళాత్మక వాక్యాలను నిర్మించేలా చేసింది.

"నువ్వు కల్లోకొచ్చాక" కవితలో మొదటి రెండు వాక్యాల్లో తాను తన కఠినత్వాన్నించి సున్నితత్వంవైపు మరలుతున్న అంశాన్ని చెబుతారు.ఆతరువాత రెండు వాక్యాలు తానుపొందిన సౌందర్యానుభూతిని చిత్రిస్తాయి.చివరి భాగాలుకూడా భౌతికమైనవే.

కళాసౌందర్య సృజనలో ప్రాథమిక దశలో ప్రవేశ,నిష్క్రమణాలను సృజిస్తారు.ఈ కవితలో ఆ సంప్రదాయం కనిపిస్తుంది.

"పక్షుల కిచకిచలధ్వనులు
గుళ్ళో సుప్రభాతానికి సంగీతాన్ని కూర్చుతూ,
వింతగా నా మనసును కదిలిస్తున్నాయి" !

"ఇప్పుడే రేయి తెరను తొలగిస్తున్న రవి;
మొదట నన్నే చుంబించినట్లు,
తొలి వేకువ కిరణాల స్పర్శ నాలో మార్పుకు తెరతీస్తోంది !"

ఈరెండు వాక్యాలు మంచి కళాధర్మాన్ని కలిగిన వాక్యాలు.చివరి,మొదటి రెండు భాగాలు తన దర్శనానికి ఆధారాన్ని తెచ్చాయి.పూర్వంలో వచ్చిన స్వప్న కావ్యాలు ఇలాంటి చిత్రణనిచేసాయి.

ఇలాంటి చిత్రణలవల్ల కల,అందులోనివ్యక్తి ప్రాతిపదికంగా దర్శనానికి వాహికలాగా ఉపయోగ పడతారు.రామయణంలోనూ త్రిజట వృత్తాంతం ఇలాంటిదే.స్వప్నం భౌతిక మార్పుని ఉద్దేశిస్తోంది.

"నా హృదయాన్ని మార్చిన
ఈ ఉదయం నా జీవితంలో ప్రత్యేకమైనది !"
"రాత్రి యే కలలో నువు గుర్తొచ్చావో తెలియదు గానీ అదెంతో పవిత్రమైనది !"

వచనంలో వ్యక్తి ప్రాధాన్యత ఉందికాని,అన్వయంలో చిత్తమే ప్రధానం.కళాత్మక మైన ఊహలని చేజిక్కించుకున్న వచనం వినోద్ గారిది.మరింత కళాసాధనతో మరిన్ని మంచి కవితలు ఈకవినించి రావడానికి ఎంతోకాలం పట్టదు.అభినందనలు వినోద్ గారు.

                                                                                                                  _______ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ



జాన్ హైడ్ కనుమూరి-జీవన గమనం




ప్రపంచీకరణ తరువాత జీవన గమనంలో మార్పు వచ్చింది.ఈ మార్పుతో బాటు ఆధునికావసరాలు కొత్తగా జీవితంలో చేరిన పరికరాలు.వీటన్నిటికి కావలసిన ఆదాయపు వేట.ఇందులో మనిషి సామజిక దశనికోల్పోయి ఆర్థిక పశువుగా మిగిలాడు. ఈ క్రమంలో యాంత్రిక జీవనానికి అలవాటు పడి పోయాడు.

ఈ ఆధునిక,ఆధునికానాంతర స్థితిలో మనిషి జీవితాన్ని నిర్వచించే ప్రయత్నం జాన్ హైడ్ కనుమూరి కవిత"జీవన గమనం"చేసింది.

"ఉదయమైనట్లు అలారంచెప్పింది
వడివడిగా పలకరింపుల ఎస్ఎంస్సులు
అల్పాహారా సమయం
చానళ్ళలోనో, ఆన్‌లైన్‌లోనో కొన్నివార్తలు కళ్ళముందు స్క్రోరింగులు "

ఉదయం నించి ప్రతి అంశం యాంత్రికమైన తీరు మనిషితన మారిపోయి ప్రతీ అవసరానికి యంత్రం మీద ఆధార పడి తన ఉనికిని మార్చుకున్నాడు.

"ఇప్పుడు సమయంలేదు
రావాలంటే ఎన్ని ఆంక్షలో, ఎంతకర్చో తెలుసా నీకు
బాల్యం అందమయినదే
అదే తలపోస్తూ దాటివచ్చిన ఖండాతరాలలో మనలేను!"

"మీటింగులు, అప్పాయింట్‌మెంట్సుతో
డైరీ ఎప్పుడో నిండిపోయింది."
తన జీవితానికి ఙ్ఞాపకానికి ,ఊరికి,బాల్యానికి తానుగా దూరమవు తున్న అంశం.రోజూవారి జీవితం ఇరుకుగా మారుతున్న స్థితి ఇవన్ని ఈకవిత లో కనిపిస్తాయి.ఆత్మీయతలు కూడ యాంత్రికంగా మారిన స్థితితో కవిత ముగుస్తుంది.

జాన్ గారి వచనం ఎక్కువగా వస్తువు పైనే ఆధార పడింది.ఎలాంటి ఆర్భాటాలు లేని ఈ తరహా కవితని "సరళ కవిత(plain poem)అంటారు.అత్యంత సూక్ష్మంగా జీవితాన్ని పరిశీలించిన నేపథ్యం ఇందులో ఉంది.

ప్రపంచీకరణ తరువాతజీవితం అనే వస్తువు సాహిత్యంలో మరింత విస్తృతమయింది.ఈ క్రమంలో జీవితంలోని ఒక రోజుని గడుపుతున్న క్రమాన్ని కవితగా అందించారు.అభినందనలు జాన్ హైడ్ కనుమూరి గారు.

                                                                                                                                                                           _______ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ



ఏ.నాగరాజు కవిత:ఖాళీ




మృత్యువుగురించి భారతీయసాహిత్య,పురాణ,వైదిక మార్గాలన్ని అనేకకోణాలలో చర్చించాయి.ఇది వేదాంతం,తాత్వికత,ఆధ్యాత్మికం,యోగ మొదలైన వివిధ మార్గాలలో కనిపిస్తుంది.

1920 కాస్త అటూ,ఇటుగా ఫ్రాన్స్ లో డాడాయిజం,సర్రియలిజం వచ్చాక సాహిత్యంలో శూన్యవాదం ఒకటి మొదలయింది.డాడాయిజం ఆత్మ హత్యని ఒక కళగా కూడాప్రచారం చేసింది.నెరూడా"Residence of earth"నిరాశవాదాన్ని మోసిందని విశ్లేషకుల మాట.

జీవితంలో గ్లూమీనెస్ ని నిరాశావాదంతేలిగ్గ ఉపయోగించు కుంది.సిల్వయా పాత్,అన్నే సెక్స్ టన్,హార్ట్ క్రేన్,మయ్ కో విస్కీ,జాన్ బెర్రీమాన్,మొదలైనవారు మృత్యువును ప్రేమించారు.కొందరి ఆత్మ హత్యలూ తెలియనివి కావు.

బోదలేర్ "మృత్యువుని"దేవతగా కీర్తించాడు.తెలుగులో ఇలాంటి కవిత్వానికి బైరాగిని ఆద్యుడుగా చెబుతారు.అజంతా"చీకటి చిత్రశాల"లాంటి కొన్ని కవితలు ఇలాంటి విషాదాన్ని చెప్పాయి.అజంతా "మృత్యువు"అంటే మరో జన్మకి తెరుచుకున్న ద్వారం అన్నాడు.వాడ్రేవు చిన వీర భద్రుడు"నిర్వికల్ప సంగీతం",సీతారం "ఇదిగో.. ఇక్కడిదాకే..."ఇలాంటివే.ఈ మధ్యన మోడేపల్లి శ్రీలతా కోటపాటి "మృత్యుమోహనం "దీర్ఘ కవిత రాసారు.

నాగరాజు కవిత"ఖాళీ"మృత్యువు సందర్భం నుండి ఒక మానసికావేశాన్ని చిత్రించారు.జీవితానికి మిగిల్చేది ఏది ఉండదనే తాత్వికమైన ఆలోచన ఇందులో కనిపిస్తుంది.నాలుగు యూనిట్లలోనూ ఏది మిగలదనే వేదాంతాన్ని పరోక్షంగా వల్లిస్తుంది.

"దేహపు గూడు నుండి కొన్నాళ్ళకు పక్షులు ఎగిరిపోతాయి
ఇక అప్పుడు ఎందుకు దుఃఖించిందీ అడిగేందుకు ఎవ్వరూఉండరు"

"గడిచిన కాలపు పద్దుల నుండి
క్షణాల లెక్కన ఒక్కొక్కటిగా అన్నీ తుడిచి పెట్టుక పోతాయి"

జీవితంలో ఒక యావ ఉంటుంది.అది బతకటంకొరకు అనేక దుఃఖాలననుభవిస్తుంది.మరణం తరువాత జీవిత సంబంధమైన దుఃఖాన్ని గురించి అడిగేందుకు ఎవరూ ఉండరు,పెంచుకున్న బంధాలన్నీ ఒక్కటొక్కటిగా తొలగి పోతాయి.నడుస్తున్నపుడు ఎవరూ భౌతికజిఙ్ఞాసతో చూడరు.జీవితాన్ని తీర్చిదిద్దుదామనుకున్న వాడు ఆఖరిపేజీ చివరి అఖరిపంక్తిని కూడా చెరిపి ఏమిలేకుండా వెళ్లి పోతాడు.

భాషాపరాంగ ఎటువంటిక్లిష్టతలేకుండా సరళమైనవాక్యాలున్నాయి ఈకవితలో.వాక్యల్లో గాంభీర్యత కూడా కనిపిస్తుంది.

"బతికినందుకు ఏదైనా ఒక దానిని గుర్తుగా ఎందుకు మిగిల్చి పోవాలనే సందిగ్ధతలో/రాసి చించేస్తూ పోగా మిగిలిన/ఒకేఒక్క ఆఖరి పేజీలో/కొట్టకొస పంక్తిని కొట్టేస్తూ-"

మంచి నిమగ్నతతో మరణానికి ఈవలి సందర్భాన్నిచిత్రిస్తూ వచ్చిన కవిత ఇది.మంచి కవిత రందించిన నాగరాజు గారికి అభినందనలు.
                                                                                                     
                                                                                                                        _______ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ




హరీశ్ బాబు కవిత:ఏమని వ్రాయమంటవ్




గురువంటే,మితృడంటేఉన్న సామన్యార్థాలు తత్వ శాస్త్రం మార్చేసింది.ఇలా అనటంకంటే వైశల్యాన్నిపెంచి ఉద్దీపితం చేసింది అంటం సబబేమో.దానికి కారణం జీవితం,ప్రపంచం ఈ బాధ్యతను నిర్వర్తించడం.నేర్చుకోవడం అనేదానికి నిజమైన అర్థాన్ని ఇచ్చిన ఎవరైనా ఈ సంభోదనకి తగిన వారే.

హరీశ్ బాబు(Harish Babu)అలాంటి కవితనే రాసారు.సమాజాన్ని ,వర్గాన్ని ఉద్దీపితం చేసిన మహానుభావులు కొందరుంటారు.అణగారిన వర్గాల ఉన్నతికి ప్రేరణ నిచ్చిన మహానుభావుడిని పరోక్షంగా స్పర్శిస్తూ ఈ కవిత సాగింది.ఒక సాధారణ సందర్భాన్ని ఒక దృక్పథం నుంచి ఎలా చూడవచ్చనేది.అనేక సార్లు కొత్తగా వస్తున్న కవిత్వం నిరూపించింది.ఇదీ ఆ కోవ లోనిదే.

వ్యక్తుల్ని,పరిసరాలని ప్రత్యక్షంగా పేర్కొన కుండావారుస్ఫురించే వాక్యాలని రాయడాన్ని పరోక్షప్రస్తావన(allusion)
అంటారు.పదచిత్రాలు,భావచిత్రాలు,ప్రతీకల ఉపయోగంలో ఈ లక్షణం ఉంటుంది.ఇవి జీవితాన్ని సారవంతంగా వర్ణించడానికి ఉపయోగ పడతాయి.ఒకవాక్యం ,చిత్రణ లో ఒకటికి మించి స్ఫురిస్తే "అనిర్దిష్ట పరోక్షప్రస్తావన"(Indefinet Allusion)అంటారు.

రమేశ్ వచనంలో భీం,అంబేడ్కర్,పూలే లాంటీ మహనుభావులంతా స్ఫురిస్తారు.దానికి అకారణం వీరిలో ఆ దార్శనికత ఉండటమే .

"నన్నో మనిషిగానే చుసిన/ఓనా మార్గదర్శకుడా/నీ గురించి..,
ఏమని వ్రాయమంటావ్/ఎలా వ్రాయమఒటావ్

"బడివెళ్ళే దారిలో/ఎక్కిరించిన వీధులు
నేనో అంటరానినొడిని/అటువైపు రావటమే నేను చేసిన
నేరమని ఎగతాళి చేసే మనసులు/చినిగిన నా చడ్డినీలాగే నా ఈడోళ్ళు "

ఓ చైతన్యం పొందడానికి ప్రేరణగానిలిచిన మూర్తుల్ని స్మరించినా ఈకవిత సామాజిక అణచివేతని,వెనకబాటు తనాన్ని ప్రశ్నించింది.దళిత వస్తువునించి"గురువు/మార్గ దర్శకుడనే"పదానికి కొత్తదనాన్ని అన్వేషిచింది.

"పార పట్టే చేతికి బలపం ఇచ్చి/అక్షరం అనే ఆయుధం నేర్పిన
ఓనా గురువా.../నా పోరాటంలో ప్రతి క్షణం నిన్నే/తలుసుకుంటూ..,
నన్ను వెక్కిరించిన విధుల్ని/ఈ సమాజాన్ని.., ఈ మనుషుల్ని
నేను చేసిన నేరం ఏంటని/నీలదిస్తున్నా...!"

వ్యక్తీకరణలో కొనసాగింపుగురించి ఒక మాట మాట్లాడుకోవాలి. Allusion లో వాతావరణం స్థూల లక్షణానికి దూరంగా వెళ్లటం వల్ల అవగాహన కష్టం.అందులోనూ Allusion ని కవితలోని వస్తురూపంగా వాడుకున్నప్పుడు.

"నా భుజం తట్టి..,చేతిలో ఒక/బన్ ముక్క పెట్టి..,నా కన్నీళ్ళను
తుడిచిన ఓనా తండ్రి ...!"

ఇందులో "బన్ ముక్క"ఇలాంటి అవకాశం ఇస్తుంది.దానికి బన్ పదపు అర్థ ఉపయోగ క్షేత్రాలు కారణం.Ramesh Babu గారి లోమంచి దళిత స్వరం ఉంది.ఇది ఆతాత్వికతని కేవలం నినాద ప్రాయంగా కాకుండా తాత్వికంగా అర్థంచేసుకుంది.మరిన్ని సారవంతమన కవితలు ఆశించడం అత్యాశకాదు.
                                                            ________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ



                                                                                                                                                                


 భాస్కర్ కొండ్రెడ్డి  కవిత-పురాసత్యం




"ఏకం సత్ విప్రాః బహుధా వదంతి"అని ప్రాచీనుల వేదాంతం..ఎన్నిరకాలుగా,ఎన్ని మార్గాల్లో చెప్పినా సత్యం ఒకటి ఉంటుంది..సినారే"మనకు మిగులును గతములోపలి మంచి అదియె సంప్రదాయము"-అన్నారు.గతమెప్పటికి కొంత మిగిలేవుంటుంది.నిజానికి సత్యాన్ని గురించి ప్రాచీనుల్లో చాలాచర్చే వుంది.

భాస్కర్ కొండా రెడ్ది కవిత్వాన్ని ఆస్వాదించే అంశాన్ని పురా సత్యం గాచెబుతున్నారు.(నిజానికి ఇది ఏ అంశానికైనా సరిపోతుంది.ఇందులో ఉపయోగించిన అస్పష్టతలాంటి పదాలు కవిత్వమనే స్పష్టం చేస్తున్నాయి)పరిణత దశ అనేది దేనిలో నైనా కనిపిస్తుంది.కొన్ని సార్లు మనం గమనిస్తాం కొన్నిసార్లు గమనించం.

"ఒక్కడుంటాడు/వేసిన ప్రతి అడుగును/
మెత్తని చేతుల్తో పువ్వుల్లో ముంచి/
పైకెత్తి చూపించగలిగే నేర్పుగలిగిన వాడు/
అస్పష్టతలలోని అద్భుతాలను/అర్థవంతంగా విప్పి చెప్పగలిగిన వాడు"-

సాహిత్యంలో ఇలాంటి మహానుభావులు కొంతమంది ఎదురౌతారు..కాలంలో ఏది కవిత్వం అనేదానికి రకరకాలుగా ఆయాకాలాలు నిర్వచిస్తాయి.ఇవి మరో కాలానికి-లేదా ఆకాలంలోనే మరో దృష్టిగల వాళ్లకి నచ్చవు.ఇప్పుడు "ఆదర్శ మూర్తులు"గా మనం కీర్తిస్తున్నవారు ఒకప్పుడు ఇలాంటివి ఎదుర్కున్నవారే.నిజానికి ఏప్రపంచమైనా అనేక పాయలుగా ప్రవహిస్తుంటుంది.

కవికి ఎప్పుడూ ముందుచూపుండాలి(సత్యానికి దూరంగాపోకుండానే)కొత్తదనాన్ని అన్వేషించాలి.మొల్లనించి శ్రీశ్రీ,పటాభి దాక ఇలానే జరిగింది.

"కుబుసాన్ని/బండలకు రుద్దుకుంటూ వదిలించుకోకపోతే/పట్తని పాత చర్మం తాలూకు బాధ/నిన్నెప్పటికీ నిలువనీయలేదు/కొత్తపుంతని ఎలాగు ఆపనూలేదు"

కొత్తదనం ఏదైనా దాన్ని అర్థంచేసుకునేదాక అలవాటుపడి అభినందించం."కొత్తొక వింత పాతొక రోత"కదా.సత్యావిష్కరణకు వాదం చాలదు వాహిక కూడా కావాలి.అలాంటి వాక్యాలున్నాయి."పాత చర్మం లాంటి""కుబుసం" మేఘాల్లా రూపాలు మార్చు కుంటు"ఇలాంటివి అందుకు నిదర్శనం.

సంభాషణలా కనిపించే ఒక గంభీర స్వరం ఇందులో ఉంది.గతంలోనూ భాస్కర్ కొండా రెడ్డి గారి కవిత్వం తో ఉన్న కొద్దిపాటి పరిచయంతో కొన్ని అంశాలని అర్థం చేసుకోవచ్చు.శైలీ సంబంధంగా చూసినా కవిత ప్రాణాల ఉనికి తెలిసిన కవిత్వం..కావలసిన ఉపమానాలని.ప్రతీకలని.వాక్య ,కవితా నిర్మాణాలని పట్టుకున్న కవిత్వం.

15.08.2013

కవిత్వ విశ్లేషణ

క్రాంతి శ్రీనివాస రావు కవిత: సిOహావలోకనం




అభివ్యక్తి సారళ్యత(flexibility of expression)అనేది ఒకటి కవితానిర్మాణంలో మార్పుతెచ్చింది.వాక్యాలుగా,యూనిట్లుగా కవిత్వాన్ని రాయడం అక్కడినుంచే.నిజానికి ఈ పద్ధతి సంస్కృత కాలంలోనూ,ఆతరువాత తెలుగు పద్యకవితలోనూ ఉన్నదే.వృత్తాలు,పద్యాలకుండే పరిది సహజంగానే ఈ విభాగాన్ని చేసేది.

భావభివ్యక్త్రికి ఊహలు,మనస్సు.బుద్ధి,అలంకారంలాంటివి కాకుండా ఆత్మనుండి ఆవిష్కృతమయ్యేదే అసలైన కవిత్వమని అరవిందులు అభిప్రాయపడ్డారు.
the true creator of poetry
the true hearer of the soul-అన్నారయన.ఈక్రమంలోనే దివ్య జీవన ప్రస్థానాన్ని(the path of devine life)ఆవిష్కరించారు.

సూక్ష్మ భౌతిక స్పృహ(micro phisical disire)జీవితానికిసంబంధించి ప్రధానభౌతికంశంద్వారా కాకుండా ఓ సూక్ష్మాశం ద్వారా జీవితాన్ని సౌందర్యాత్మకంగ ఆవిష్కరించడం.భౌతికమైన అంశం కవితలో తక్కువగా ఉండి ఆపాదు నుండి ఓ విశ్వవిరాడ్రూపం బయటికి రావడం.

క్రాంతి శ్రీనివాస రావు గారి కవితలో ఓక చిన్న అంశాన్ని తనకుండే కవితాశక్తితో కళాత్మకంగా వ్యక్తం చేయడం కనిపిస్తుంది.పదం నుండి పదచిత్రాలని ,భావ చిత్రాలని రూపొందించడానికి తగినంత కవిత్వానుభవం కావాలి.అన్నిటికి మించి ఆ అంశాన్ని వ్యక్తం చేయగల నిర్మాణరూపం కావాలి.

భారతీయ సాహిత్య దర్శనాలో ఆత్మప్రేరిత అంతర్దర్శనానికి ప్రాధాన్యత ఉంది.అరవిందులు అతీత మానసిక స్థాయిదాకా కొన్ని అంశాలు చెప్పారు.

భౌతికం(physical)అంతర్మానసం(the inner mind)ఉదాత్తమానసం(the higher mind)విశదమానసం(illumineated mind)పేరణాత్మక మానసం(intutive mind)వీటన్నిటిపైన ovarmindగురించి ప్రస్తావించారు.ఈ పరిశీలనా,విశ్లేషణ అంతా సమాధి అభ్యాసంలోనించే సాగింది.ఆత్మానందాన్నుంచి కవితాకళానుభవం పెరుగుతుందని దానికి సమాధ్యవస్థే అవసరమని అరవిందుల భావన.

శ్రీనివాసరావు వాక్యాల్లో ఇలాంటి అనుభవమొకటి కనిపిస్తుంది.ఒక స్థాయినుండి సూక్ష్మపు విశ్వాత్మ దర్శనాన్ని కళాత్మకంగా అన్వేషిస్తారు.

"దృశ్యపు వెలుగు శ్వాసలను
బింబ ప్రతిబింబాల బిందు స్వరాలను
వినిపించగలిగేవి
ఆలోచనల అంచులు దాటని చిత్రకారుని కుంచెలే"

ఒక సౌందర్యాన్ని అనుభవించేవిషయంలో ఒకపరిధిని ,అందులోంచి అన్వేషణని అనుసరిస్తున్నారు శ్వాసలను,స్వరాలను కుంచె వినిపించడం అతీత మానసిక స్పృహ.
మరో వాక్యాన్ని చూస్తే.. ..

"రాతి ముసుగేసుకున్న అందాలముడి
విప్పగలిగేది/ శిల్పి పిలుపు వినగలిగే ఉలిమొనలే"

అంతరాత్మలోని సౌందర్యాన్ని బాహ్యావస్థనించి అన్వేషించడం ఇక్కడ కనిపించేది.ఇక్కడ ఉలిమొనలకు,కుంచెకు సారూప్యత ఉంది.గమనిస్తే వాక్య సంబంధంగా అతీత మానసంలోఉంటే.రెండవది భౌతికం.ఎందుకంటే "వెలుగు శ్వాస,స్వరం,కుంచె"ఒక అర్థ క్షేత్రం లోనివి కాదు.కాని.."రాయి,ఉలిమొన,శిల్పం"ఒక అర్థ క్షేత్రంలోనివి ఈ నిర్మాణాభివ్యక్తి ద్వారా గాఢమైన అభివ్యక్తి మార్గాన్ని ప్రదర్శిస్తున్నాడు."సాయంత్రాన్ని చాపలా చుట్టటం,సమయాన్ని వొలవటం"అందుకు ఉదాహరణలు

"మనసు అంతరార్థాన్ని అధ్యయనం చేస్తేనే లక్షణంగా పేర్చగలవు"
"మనిషి మాత్రమే మోగించగలిగే వీణ జీవితం"

జీవితాన్ని తీర్చిదిద్దుకునే క్రమంలో తానుగా సౌందర్యాన్ని వెదుక్కోటంగురించి మాట్లాడటం వల్ల ఇది ప్రేరణాత్మకంగా కనిపిస్తుంది.శ్రీనివాస రావుగారిలో ఓ ఆత్మావిష్కరముంది.అందులోని అభివ్యక్తే ఆయన కవితని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

________________________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

మెర్సీ మార్గరేట్-కవిత : కళ్ళతో చూడలేనివి                   

సాహిత్యంలో తాదాత్మ్యం(empathy)అనే పదాన్నొకదాన్ని ఉపయోగిస్తారు.నిజానికి ఇది రెండు,మూడు సందర్భాల్లో ఉపయోగించడంకనిపిస్తుంది.

1.రచనలోని పాత్రలతోగాని,రచనతో గాని మమేకమైపోవటం 2.జీవం ఉన్న,జీవంలేని వస్తువులు,ప్రాణిప్రపంచం రెంటిలోనూ మనల్ని మనంపోల్చుకుని,ఊహించుకుని ఆపాదించుకోవటం.మన ప్రమేయం లేకుండానే దానిపట్ల స్పందించటం.3.చదువుతున్నవాటిలోని ఉత్కంఠతని అనుభవిస్తూ అందులో లీనమై ఉద్రేకపడటం.పాతకాలం సినిమాల్లో "నాటకాల్రాయుడు"లో నాగభూషణంగారికి ఈఅలవాటు ఉండేది..

ఈ మార్గంలోనే తాత్విక కవిత(philosophical poetry),తాదాత్మ్య స్థితి(catharsis)గురించి చెప్పుకోవాలి.

సాధారణంగా తాదాత్మ్య స్థితిని సత్యాన్వేషణకోసం, తప్పుచేసాననే బాధను తొలగించడంలో వాడతారు.నిజానికి నాటక సంబంధంగా క్రీ.పు.4 శతాబ్దంలో సోక్రటీసు దీన్ని ఉపయోగించారని చెబుతారు

తను(నాయకుడు)చేసిన తప్పు ఎంత వినాశకరమైనదో గమనించి-అలాంటిది మళ్లీ జరగకూడదనే నిర్ణయాన్ని ప్రకటించడం.2.నాయకుడి నుండి ప్రేరణ పొంది(పాఠకుడు)తనను తాను గమనించుకుని తను కూడా సత్యాన్ని వెదుక్కోడం.ఇవి గురువో,మరొకరో చెప్పినపుడు ఉపదేశాత్మకంగాకూడా కనిపిస్తాయి.
బైబిల్లోని వచనం ఇలాంటి తాదాత్మ్య స్థితిలో ఉంటుందని,అందువల్లే జీవితానికి సంబంధించిన అనేకవిషయాలను గుర్తుకు తెస్తాయని విమర్శకుల అభిప్రాయం

ఈ క్రమంలోనే ఈ తాదాత్మ్య స్థితి కవిత్వంలోనూ తాత్విక కవితలో కనిపిస్తుంది.ప్రకృతి,జీవితం,మనిషి ఉనికి తత్సంబంధంగా ఆధ్యాత్మిక దృష్టి,సత్య నిర్దిష్టతల గూర్చి మాట్లాడటం తాత్విక లక్షణాలు.

మెర్సీ మార్గరేట్..ధ్యానాత్మక స్థితి లోంచి రాసిన కవిత"కళ్లతో చూడలేనివి"ఈ కవితకు భారమైన వచనం కూడా తోడయ్యింది.1. సత్య దృష్టిని,సానుభూతిని ప్ర్రేరేపించడం 2.తాత్వికంగా,సుషుప్తిలో ఉన్న మానవీయతని మేల్కొల్పడం ఈకవిత చేస్తుంది.

"కళ్లతో చూడలేనివి/కన్నీళ్లే చూడగలవు"-ఈ వాక్యంలో సత్య దృష్టి సాంద్రమైన ప్రేరణ ఉన్నాయి.ఈ అంశం కవిత్వ మవ్వడానికి రెండవ వాక్యం నిలుస్తుంది.

"బల్లపరుపుగా ఉన్న మాటలమట్టి పై /పరుచుకుని /లోలోతుల పొరలకు ఇంకి పోతూ చేరగలవు"-హృదయధర్మాన్ని తెలిసి వాక్యాన్ని తీర్చిదిద్దే క్రమం మెర్సీగారికి అబ్బింది.మాటల మట్టి '-బల్ల పరుపు లాంటివి ఈ వాక్యానికి బలాన్నిస్తాయి.తాత్విక కవిత లో కనిపించే సత్య సంబంధమైన అన్వేషణ చివరివాక్యాల్లో కనిపిస్తుంది.

"అబద్ధాలాడే కళ్ల అంచులలో తడిలేని కళ్లున్నాయేమో చూపించు"
"కన్నీటి పరదాల్ని కదిలించే క్షణాల్ని ఆపకుండా అడుపెట్టే చేతుల్నికూడా/మాట్లాడించే హృదయం అందరికీ ఒక్కలాగే ఉంటుందో లేదో చెప్పే సాఫ్ట్ వేర్ ఉంటే చెప్పు"

సత్య దృష్టిని అనుభవించడం,తాదాత్మ్యంగా ధ్యానంలో అన్వేషించడం,అనిర్దిష్టంగానైనా సంభాషణాత్మకంగా ప్రేరేపించడం.హృదయాన్నికదిలించే కళాత్మకతని ప్రదర్శించడం ఈకవిత చేసింది.మెర్సీగారి కవిత తో ఉన్న కొద్దిపాటి పరిచయంతో చూస్తే ఈ మధ్య కాలంలో ఒక పరిణతి కని పిస్తుంది.మరింత కొత్తచూపుతో కవితల్ని అందించాలని ఆశిద్దాం.*

________________ఎం.నారాయణ శర్మ-30.07.2013