పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎

1, నవంబర్ 2012, గురువారం

Sailajaa kanuri


ఆశ్చర్యమే కదా
నిన్న మొన్నటి వరకూ
ఒకే మనశ్శరీరమయిన నువ్వూ నేనూ
ఇవాళ ఈ క్షణాన రెండు శత్రు సేనలం!


నిన్నమొన్నటి వరకూ
కలిపి వుంచిన కారణం
ఇవాళ విడిపోవడానికి కారణం కాకుండా పోయింది.

ఆశ్చర్యమే కదా
విడిపోవడానికి ఎన్ని కారణాలు కావలి?!

ఒకళ్ళ మీద ఒకళ్ళం
ఎన్ని అస్త్రాలు సంధించుకోవాలి?

ఆశ్చర్యంగా వుంటుంది
నువ్వు రాలే ఆకుల్లో హరివిల్లు రంగులు
వెతుక్కుంటున్నప్ప్పుడు!

నాకు రాలే ప్రతి ఆకు
ఒక కుప్ప కూలిన కల.

తిరిగిరాని వసంతాన్ని కల కంటూ
నిస్సహాయత్వంలోకి వాలిపోయే
ఒంటరి.

కట్టా శ్రీనివాస్ || అహల్యా పరితాపం ||


ఏమైందసలు నీకు? ఎటుపోయావిన్నాళ్లూ?
కవిత్వాపు రుచికూడా చూడటంలేదే ఈ మధ్య?
అలసత్వం ఆవరించిందా? ఆదమరిచావా? అజీర్తి గానీ చేసిందా?


నడిచినదారులే నలిగినపనులే ఎదురోస్తుంటే,
క్షీణోపాంతసిద్దాంతం పనిజేసిందా?
ఉరికే జీవితపు పరుగులలో
కునుకే కినుక చూపుతుంటే.
ఊహాతటాకాల తీరాలు ఊరించటం మనేశాయా?

తోచిందల్లా మనసుగదుల్లోకి తోసేస్తుంటే
తడిలేని పదాలెన్నో లోపలికి దిగినా అరుగుదల జరగక అజీర్తి చేసి
మరేకొంచెంకూడా లోనకి వేసుకుందామనిపించటంలేదా?

వాడి వాడి వేడి తగ్గి వాడిన వాడిలేని భావనలతో లోతులేమీ
తవ్వలేక ఊటచలమలే ఇంకిపోయాయా?

ఓ లకుముకిపిట్టా ఎడారిదారులలో లొట్టిపిట్టవై
ఎక్కడెక్కడతిరుగుతున్నావురా ఇన్నిరోజులూ?
కొయిలవే నీవైనా కూతేలేనపుడు చీకటితోసమానం.
చిగురాకులు రుచిచూస్తుంటేనే, చిగురాశలు వెలికొస్తాయి.
చిరాకుగా పరాకు చెందితే జరూరుగా పరాయివౌతావు.
ఊటలుగా వెలికొచ్చే బావనలే నీభాషైనప్పుడు
ఉలిపై శిలకోసం సుత్తిదెబ్బలెందుకు?


http://www.facebook.com/groups/kavisangamam/permalink/464011036984987/
♥ 30-10-2012




కెక్యూబ్ వర్మ ॥సముద్రానికెదురుగా॥


సముద్రానికెదురుగా నేను
నాకెదురుగా తను...


ఒక్కో అలా ఎగసిపడుతూ
తీరం దాటనితనంతో మరలుతూ...

మౌన ఘోష చుట్టూ ఆవరించుకున్న
తరగని ఇసుక తీరం...

లోలోతుల ఇంకని ఆశల నురుగు
అలల అంచుల తాకుతూ...

కదలుతూనే వున్నట్టున్న
జడభరితం...

తుఫానులెన్నొచ్చినా
తన పరిథి దాటనితనం...

ఆకాశన్నంటుతున్నా
అందని జాబిలి...

నాకెదురుగా తను
సముద్రానికెదురుగా నేను...
(31-10-12)

31, అక్టోబర్ 2012, బుధవారం

Yasaswi's || మనసుకి "key" whole||


చూస్తాం.. లోకం.. ఆ క్షణమంతా మనదే..
లోకమా! క్షణమా!! ఏమో.


నచ్చిన రంగులుంటాయ్.. మనల్ని కావాలంటాయ్
రంగవ్వాలా! నచ్చాలా!! ఏమో.

వెచ్చని ఆలోచనలుంటాయ్ లోనికి రమ్మంటాయ్
ఆలోచనలనా! వెచ్చదనాన్నా! ఏమో.

చిక్కని జవాబులుంటాయ్ కనుక్కోమంటాయ్
కనుక్కోవాలా! అడగాలా! ఏమో.

విప్పని ముడులుంటాయ్ చేయి చేసుకోమంటాయ్
ముడులనా .. వాటి జడలనా ఏమో.

కొన్ని కోరికలుంటాయ్
చూడాలని.. వినాలని .. ఆఘ్రాణించాలని.. స్పృశించాలని
రుచిచూడాలని.. ప్రేమించాలని ..
కోరాలా!! కోరపీకాలా ! ఏమో.

పుట్టినప్పుడు ప్రతీదీ అందంగానే ఉంటుంది.. పసిపాపలా.
ఆ క్షణం లో అదే లోకం..

లోకం లోకి అందమైన దాన్ని వదిలేయ్..
ఇంకేంకావాలి!

నీకు నచ్చినట్టు రంగరించు..
ఇచ్చేయ్..
నీ రంగులతో లోకం నింపు
ఇంకేంకావాలి!

లోనికి వచ్చిన ఆలోచనల వెచ్చదనాన్ని పంచు
జవాబు అడుగు..
దానికదే కనుక్కుంటుంది ప్రశ్నని

జడపట్టుకో
ముడి పట్టుబడిపోతుంది
తాడో-పేడో తేలిపోతుంది

కోరికలూ.. మీ మూలాలు వేరు
లోనికి చూస్తావా.. బయటదారులు కనిపిస్తాయి.

మనసుకి మార్గాలుంటాయి.. గొళ్ళాలుంటాయ్
తెరిస్తే బయటవాటిని లోపలే చూపిస్తాయి
బయటవెతికావో నిను లోపలపెట్టి చీకటి పాల్చేస్తాయి.

చీకటిని నీ వివేకంతో కాల్చేయ్..
మనసంతా నీ ప్రపంచమౌతుంది..
ఈ ప్రపంచానికే నీమీద మనసౌతుంది.
ఇంకేంకావాలి!!!!!!!!
==30.10.2012==

కిరణ్ గాలి ||వన్ మోర్ ఛాన్స్||


మృత్యువే నీకెదుట నిలబడి
ఈ రోజే నీకు ఆఖరని
రేపన్నది లేదంటే ఏం చేస్తావు?


కకల వికలమై కన్నిరవుతావా,
కాలంపై కడసారి స్వేఛ్ఛగా స్వారి చేస్తావా?

నిరాశాతో నిస్సారంగా గడిపేస్తావా?
ఘడియ ఘడియను గుండెలకు హత్తుకొని గాఢంగా జీవిస్తావా?

***

దేన్ని లెక్కిస్తావు
పొందలేని సుఖాలనా, పంచుకున్న ప్రేమలనా?
దాచుకున్న ఆస్తులనా, పొదువుకున్న జ్ఞాపకాలనా?

నిన్ను చూసి గర్విస్తావా,
నిరర్ధకంగా బతికినందుకు ధుఖిస్తావా?

***

మృత్యువే నీకెదుట నిలబడి

ఒకే ఒక్క అనుభవాన్ని మరల
అనుభూతించే అవకాశం ఇస్తానంటుంది?
ఏ మధుర క్షణాలని మళ్ళీ జీవిస్తావు?


ఒకే ఒకరిని రోజంతా తోడిస్తానంటుంది
ఎవరిని కోరుతావు?
నీ కోసమా ... తన కోసమా?


ఒకే ఒక్క మార్పుకు అవకాశమిస్తానంటుంది
ఏ మార్పు చేస్తావు?
చేసిన తప్పునా, చేయని మంచినా.. దేన్ని సరిదిద్దుకుంటావు?

ఒకే ఒక్క కోరిక తీరుస్తానంటుంది,
ఏం కోరుతావు?
మరుజన్మ లేని మొక్షాన్నా?
మరల నీలాగే నిన్ను పుట్టించమనా?

దయతో మరింత ఆయుష్షును పోయమనా!!!

***

మృత్యువు నిన్ను చూసి జాలి పడి


ఇంకొక వారం అరువిస్తా నంటుంది ...ఏం చేస్తావు?
ఇంకొక నెల అరువిస్తా నంటుంది ...ఏం చేస్తావు?
ఇంకొక సంవత్సరం అరువిస్తా నంటుంది ...ఏం చేస్తావు?
ఇంకొక జీవితం అరువిస్తా నంటుంది ... సరిపోతుందా?

***

గమనించావా...
మ్రుత్యువు నువ్వు అడగకున్నా
ఆయువు అరువిస్తూనే వుంది
ఆఖరి గడువును పొడిగిస్తూనే వుంది

అయినా నువ్వు
విలువైన నీ "ఆఖరి రోజు"ను
నిన్నటిలానే నేడు నిశ్ప్రయోజనంగా గడిపేస్తునే వున్నావా?...

***

మిత్రమా

ప్రతి రాత్రి మరణమని గ్రహిస్తే
ప్రతి ఉదయం జన్మిస్తావు,
ప్రతి రోజు జీవిస్తావు

***

In life there is a second chance.
But there may not be a second chance to life

Every "second" in life is a second chance...

Date: 29-10-2012

పద్మా శ్రీరామ్ || ఓడిపోతున్నా... హృదయమా... మన్నించు ....||


గుండెలో భావాలన్నీ ఒలికిపోతున్నాయి
శూన్యమైపోతుందో ఏమో ఎద పాత్ర...


ఆఁ ...ఇంకా ఎక్కడుందిలే ముక్కలైపోయిందిగా..
నువ్వు చేస్తున్న జ్ఞాపకాల గాయాలతో..

అవునూ నీకు గుర్తుందా...ఇవాళ నా పుట్టిన రోజు...
నా బ్రతుకు చెట్టుకు మరో రెమ్మేసింది కానీ

నవ్వుల పూవులిస్తుందో ....కన్నీరు గాలిస్తుందో....
ఇంకా తెలియనీయని ఏకాకి తనంలో...ఇదో ఇలా

ఎందుకంటే నువు నాలో పేర్చిన నిశ్శబ్దం ఇంకా పగలకుంది...
మనసు చాలా బరువుగా దాన్ని మోస్తూనే ఉంది...

ఒకప్పుడు నా ఖాళీతనంలో నువ్వున్నావ్....
నా భావాలను అక్షయం చేస్తూ....అక్షరబద్ధం చేయిస్తూ..

ఇప్పుడూ నువ్వున్నావ్.....
నా అక్షర ముగ్ధత్వాన్ని నిశ్సబ్దంగా హెచ్చవేసి శూన్యాన్ని శేషిస్తూ ...

ఆనాడు నా పలుకులకై వగలారబోసిన నీవే...
ఈనాడు చీకటి చీర చుడుతున్నావుగా నా కనుల కన్నెకు..

ఏదేమైనా నువ్ గొప్ప కళాకారుడివే..

అరిటాకు వాక్యాల వంటి నా అనుభూతులన్నిట్నీ
నీ పలుకుల ముల్లుతో కకావికల కావ్యం చేసేసావుగా

కనుల వాకిళ్ళలో కన్నీటి అలల కళ్ళాపి చల్లుతున్నావు...
పైగా అవి నా సాంత్వనకొరకని సముదాయిస్తావు

ఏంటో ...ఈ ఎద తడిలో నీ జ్ఞాపకాల గాలి కలిసినట్లుంది..
మది మళ్ళీ వేడెక్కిపోతోంది...బ్రతుకు కల కనమంటూ

మళ్ళీ జన్మంటూ ఉంటే ఒంటరితనాన్ని సైతం
ఏకత్వమైన ఏకాంతంగా మలచమని ఆ భగవంతుణ్ణి (మళ్ళీ పురుషుడే..) ప్రార్ధిస్తూ....

31.10.12

కామేశ్వరరావు డి //యవ్వన పరిమళం//


అప్పటి దాకా ఎక్కడుందో
చెప్పా పెట్టకుండా చప్పున వచ్చేస్తుంది వసంతం...
గుప్పుమంటుంది కొత్త ప్రపంచం...

అమ్మాయిల కళాశాలలా కళకళలాడుతూ పూలతోట.
మనసంతా మెత్తని రంగుల గుబాళింపు
యవ్వన పరిమళం కొత్త పరిచయమౌతుంది...

ప్రేమకు అర్థం వెతుక్కుంటుంది గుండె...

గుబులుగా దిగులుగా మూగపోయిన పాట
గుబురుల్లోంచి గుండె మీదకొచ్చి వాలుతుంది..
'కుహూ' అన్న అరుపు,
'రావా' అన్న పిలుపవుతుంది...
రెండుగా ఎదిగిన ఒకటి,
ఒక్కటిగా ఒదిగి కరిగిపోతుంది...

ప్రపంచానికి దూరంగా మత్తెక్కి ప్రవహిస్తాయి ఊహలు...
ఎండా వాన వణుకు వెన్నెల
అన్నీ కంటి రెప్పల అంచుల మీద నించి జారిపోతాయి....

స్వప్నించిన క్షణాలు - కళ్ళు తెరిచిన క్షణం...
ఎదురుగా
రాలిన ఆకులు పరిచిన వాస్తవం...

ప్రతి ఆకు కిందా ఎన్నో నిట్టూర్పులు, ఎన్నో నిశ్శబ్దాలు,
ఆనంద విషాదాల తూర్పు పడమరలు...

తలెత్తి చూస్తే...,
ఒళ్ళంతా తొడిమలు విడిచిన గాయాల గుర్తులతో
నిశ్చల సమాధిలో నిలబడ్డ యోగిలా చెట్టు..!
మళ్ళీ వచ్చే వసంతం కోసం,
అది తెచ్చే మధుర వేదన కోసం..

అవును....
కాలం
తీయని గాయాల ఆగని గేయం....!!


29-10-2012

30, అక్టోబర్ 2012, మంగళవారం

బహుదూరపు బాటసారి ॥ తల్లా ! పెళ్ళామా !***



వేసానండి మొత్తానికి మూడు ముళ్ళు
అమ్మ కళ్ళల్లో ఆనందం
బిడ్డ ఓ ఇంటివాడయ్యాడని..!

తాళి కట్టిన నా ఇంతి కళ్ళల్లో ఆనందం
నాకో తోడూ దొరికిందని,

ఎంత దాయాలన్న దాగని నా కనురెప్పలపై గర్వం
నచ్చిన చిన్నది అలైనందుకు
నాకంటూ ఒకరు
మనసు పంచుకునే తోడూ దొరికినందుకు ..!

పేరు పెట్టి పిలుస్తోందిరా నీ పెళ్ళాం నిన్ను
నలుగురు వింటే ఏమవ్తుంది మన గౌరవం
అంటూ కోపంగా అమ్మ ,

నిన్నే అత్తయ్య చెప్పింది
పేరుపెట్టి పిలవకోడదంట
ఈ కాలపు ఆడదాన్ని
పాతచింతకాయ్ పచ్చడిని కానంటూ పెదవి విరుస్తూ తను
మధ్య నలుగుతూ నేను ..!

జీతం వచ్చిన మొదటి రోజు
మూరమల్లెలతో పడగ్గదిలోకి వడివడిగా నేను
వయ్యారం ఒలకబోస్తూ సింగారపు చీరకట్టి
నా కోసం తను..!

ఇంతకాలం మాటేమోగాని
మిమ్మల్నే నమ్మి మీ వెంట వచ్చినందుకు
జీతమంతా నాకే కావాలంటూ చెవిలోసన్నగా ...!
మనసులోనే నవ్వుకున్నా
అమ్మ కడుపు చూస్తే ఆలి జేబు చూస్తుందని..!

భాద్యతలంటే
బంధాలతో కూడిన అనుబంధాల ముడులే కదా
నా కోసం వచ్చిన తనకోసం
నా కోసమే బ్రతుకుతున్న అమ్మకి చెప్పగలనా ఈ నిజం...!

దుప్పడి కప్పుతూ నేను , జీతం లెక్కల్లో తను ... 26-10-12

కెక్యూబ్ వర్మ ॥పెళుసుతనం॥


కనుగుడ్డు పగిలిపోయేట్టు రోదిస్తున్నా
తీరని ధుఃఖ హృదయం...


దేహమంతా అలముకున్న
కమురు చాయలు...

రేయంత చీకటి కమ్ముకున్న
హృదయాకాశం...

ఒక్కసారిగా తెరచాప చినిగి
నడి సంద్రంలో నిట్ట నిలువునా కూలిపోయినట్టు...

రాకడ లేని గుమ్మం
వెల వెలబోయిన పసుపుతనంతో....

చిగురు వేయని మొక్క
ఎండి బీటలు వారిన నేల...

చినుకు పడని మేఘం
ఆవిర్లుగా సుళ్ళు తిరుగుతూ....

జబ్బ సత్తువ కొద్దీ విసిరినా
వొట్టి బోయిన వలలా....

గదినిండా నిట్టూర్పుల
జ్వర పీడనం...

ఈ ఖాళీతనం గుల్లతనం
పెళుసు బారుతూ రాలిపోతూ...
(27-10-2012)

27, అక్టోబర్ 2012, శనివారం

క్రాంతి శ్రీనివాసరావు ||కాలుతున్న పసితనం||


అయ్యా నాతో చదివే
జానెడు బెత్తెడు లేని పోరగాడు
నీకు బాబుగారా?


ననుగన్న నీవు
వాడికి ఏరా పోరా గాడివా?

నాకొద్దీ పైసల బడి
అక్కడన్నీ అబద్దాలే

మా అందరి
చొక్కా గుడ్డలే ఒకటి
లోన మనుషులంతా వేరు

వాళ్ళ బ్యాగుల నిండా
గొప్పతనాలు
మోసుకు తిరుగుతున్నారు

పూసుకొన్న సెంటు
రాసుకొనే పెన్ను
వాళ్ళకు వేరే వుంటాయు

రోజుకో రుచి మరిగిన
లంచ్ బాక్స్ వాళ్ళది
నాదేమో
రోజూ తిన్నదే తింటుంది

సత్తిగాడు స్కూటర్ మీదా
భరత్ గాడు బెంజికార్లో
నాది రోజూ రెండు కాళ్ళ బండేగా

ఇక్కడి పాఠాల్లోనూ పెద్దోళ్ళే
మన్ని గురించి
ఎవరూ చెప్పరిక్కడ

ఆల్లందరూ వేరయ్యా
నాకొద్దీ పైసల బడి
ఆకలయునప్పుడల్లా
అరచేతిలో
అమ్మిచ్చే ముద్దులు చాలయ్యా

- కరిముల్లా ఘంటసాల ||ఒక గీతం!||

మధుర గీతానివి నువ్వు!
ఓ పట్టాన అర్ధమే కావు,

మెహదీ హసన్ గజల్లాగ!

తెల్లారు
మంచు పొగలో ఎగిరే పిట్ట-
కన్ను చిదుముకున్నా కనిపించవు,
విపిస్తావు!

నీరెండన మెరిసే చినుకు-
ఎడారి మేను తడిపెయ్యవు,
ఉడికిస్తావు!

ఐనా...
గోధూళి వేళ
గుండె తెర పై
ఒక ఇంద్ర చాపాన్ని
విడిచి పోతావు!

* * *

అందమైన ఒర,
కరుకైన కత్తి-
నరికెయ్యవు,
నరకంలోంచి తోసేస్తావు!

ఒక మబ్బు తునక-
మెరుపై వస్తావు,
కానీ ఉరిమి భయ పెడతావు!

ఒక చల్లని గాలి తెమ్మెర-
అల్లనల్లన వీచి
జీవితేచ్ఛను ఎగసనదోస్తావు,
ఐనా అంతలోనే
ఎటో కనిపించక పోతావు!

తెలతెల్లని మల్లెపూవు-
మనసు గదిలో
తియ్యని పరిమళాన్ని పరిచి
మరు నిమిషం కరిగిపోతావు!

అరుదైన పక్షీ!
కనిపించీ కనిపించక
కనువిందు చేస్తావు,
రెక్కలు చాచి
రివురివ్వున మనోలోకాల్లో విహరిస్తూ
విశ్రాంతి సంగతే మర్చిపోతావు!

* * *

దిగులు పురుగు
గుండెను తొలుస్తున్నపుడు
చల్లని చిరునవ్వై వచ్చి సేదదీరుస్తావు

నీ అడుగుల సవ్వడి విని
వేచి చూస్తున్నపుడు,
పాటల పూదోటలో
మైమరచి ఆడుకుంటూ-
తుమ్మెద రెక్కలపై వినిపించే
తియ్యని రాగమై మూర్ఛనలు పోతావు!

* * *

ఓహ్!
సంగీతం నీ దేహం
స్వేచ్ఛ నీ హృదయం
ఎందుకు దూరావీ గూటిలోకి?
నీ రంగస్థలి కదా ఆ గగనం!


30-06-2012

శైలజా కానూరి// దూరంలో నువ్వు


నీ మోహంలో నిండా మునిగాక
అంత దుఃఖాన్నే కాదు
చింతాకంత సంతోషాన్నీ ఇవ్వు.


నా ఒంటరి గది గోడ మీద నీడలాగా
నడిచివెళ్తున్నప్పుడు
అంత చీకటినే కాదు
నువ్వుగింజంత నవ్వు కూడా ఒకటి రువ్వు.

ఆకాశం మీద నా కలల్ని ఆరేస్తున్నప్పుడు
కొన్ని దిగులు మేఘాల్నే కాదు
కాసిన్ని వానవిల్లుల్ని కూడా విరబూయనీ.

ఒక అందమయిన విరోధాభాస నువ్వు.
నీ మోహంలో నేను
ఎన్ని దూరాలు నడిచానో
అన్ని తీరాలకూ దగ్గిరయ్యా.

ఆ మాటకొస్తే
నాకు నేనే మరీ దగ్గిరయ్యా.

అర్థాంగికి//బూర్ల వెంకటేశ్వర్లు//


ఎన్నిసార్లు అడిగి ఉంటావు
నీ గురించి కవితరాయమని?
నా జీవన ప్రపంచపటానివైన
నిన్ను చుట్టి రావడానికి
అనుభూతులు తప్ప
అక్షరాలు ప్రయాణిస్తాయా?
ఇదిగో ఇప్పుడు విను
నేన్నీ మొదటి చూపులో
పునీతమయ్యానని చెప్తూ
నా హృదయం చుట్టూ
జలజలపారే నదివి నీవని రాస్తున్నాను
పెళ్ళి అనే ఒకే ఒక్క సూత్రంపై
కోటానుకోట్ల తంత్రీస్వనాలు మోగించావని
మోకరిల్లుతున్నాను
ఇదిగో విను
నిత్య చైతన్య శిల్పానివైన నిన్ను
ఇరుకుమాటల్లో కీర్తించడమెందుకు!
అర్థాలకాంతిపై అక్షరాలు ప్రకాశించినట్టు
అర్థమై నువ్వు వెలుగుతుంటే
అక్షరమై కన్పించేది నేను
నువ్వు అలంకరించడం వల్ల ఈ సంసారమొక
ఉత్తమోత్తమ కావ్యం.

26, అక్టోబర్ 2012, శుక్రవారం

క్రాంతి శ్రీనివాసరావు ||పేచీ ||


చీకటి కప్పిన
తెలిసిన దారిలో వాడు


వెలుగులు చుట్టిన
తెలియనిదారిలో నేను

ఎదురుపడ్డప్పుడు
ఉలిక్కిపడి
వెనక్కుతిరిగి పరుగెత్తుతుంటాం

వాడికీ నాకు మధ్య దూరం
రబ్బరు దారాల్లా
తెగిపోకుండా సాగి
తిరిగి కలిపి
పరాయుదై పారిపోతుంది

ఒక స్వప్నం
బద్దలయ్యుందో
భారమయ్యుందో
అర్ధం అయ్యేలోపే
నిద్దుర గీతం ఆగిపోతుంది

వాడు నేనూ
మళ్ళీ ఒకే శరీరం తొడుక్కొని
జీవన రంగస్థలం పై
వేషాలేస్తూ వుంటాం


26-10-2012

కరిముల్లా ఘంటసాల ॥ ఒక గీతం!


======

మధుర గీతానివి నువ్వు!
ఓ పట్టాన అర్ధమే కావు,
మెహదీ హసన్ గజల్లాగ!

తెల్లారు
మంచు పొగలో ఎగిరే పిట్ట-
కన్ను చిదుముకున్నా కనిపించవు,
విపిస్తావు!

నీరెండన మెరిసే చినుకు-
ఎడారి మేను తడిపెయ్యవు,
ఉడికిస్తావు!

ఐనా...
గోధూళి వేళ
గుండె తెర పై
ఒక ఇంద్ర చాపాన్ని
విడిచి పోతావు!

* * *

అందమైన ఒర,
కరుకైన కత్తి-
నరికెయ్యవు,
నరకంలోంచి తోసేస్తావు!

ఒక మబ్బు తునక-
మెరుపై వస్తావు,
కానీ ఉరిమి భయ పెడతావు!

ఒక చల్లని గాలి తెమ్మెర-
అల్లనల్లన వీచి
జీవితేచ్ఛను ఎగసనదోస్తావు,
ఐనా అంతలోనే
ఎటో కనిపించక పోతావు!

తెలతెల్లని మల్లెపూవు-
మనసు గదిలో
తియ్యని పరిమళాన్ని పరిచి
మరు నిమిషం కరిగిపోతావు!

అరుదైన పక్షీ!
కనిపించీ కనిపించక
కనువిందు చేస్తావు,
రెక్కలు చాచి
రివురివ్వున మనోలోకాల్లో విహరిస్తూ
విశ్రాంతి సంగతే మర్చిపోతావు!

* * *

దిగులు పురుగు
గుండెను తొలుస్తున్నపుడు
చల్లని చిరునవ్వై వచ్చి సేదదీరుస్తావు

నీ అడుగుల సవ్వడి విని
వేచి చూస్తున్నపుడు,
పాటల పూదోటలో
మైమరచి ఆడుకుంటూ-
తుమ్మెద రెక్కలపై వినిపించే
తియ్యని రాగమై మూర్ఛనలు పోతావు!

* * *

ఓహ్!
సంగీతం నీ దేహం
స్వేచ్ఛ నీ హృదయం
ఎందుకు దూరావీ గూటిలోకి?
నీ రంగస్థలి కదా ఆ గగనం!

-
30-06-2012

25, అక్టోబర్ 2012, గురువారం

పి.రామకృష్ణ //పులిగారి స్వర్ణకంకణం


పండగొస్తేనే నాకు
వాక్యూంక్లీనర్ గుర్తుకొస్తుంది.


నవరంధ్రాల్లో పూడుకుపోయిన
చెత్తాచెదారం వూడ్చుకోడానికి,
చీపురొకటి
దశమిరోజే అక్కరకొస్తుంది.

నిన్నరాత్రే
పడుకున్న పక్కమీదికీ,
పాత చాయాచిత్రాల వెనుక-
అల్లుకున్న సాలెగూళ్ళ మీదికీ,
ఎయిర్ బ్లోయర్ తన మిస్సైల్
ఎక్కుపెడ్తుంది.

ఇప్పుడు
పులుముకున్న రంగుల్తో-
ముఖం దాచుకోవడం
కొత్తగా వుంటుంది.

జమ్మిచెట్టుపై దాచుకున్న
క్షమాబిక్ష కరవాలం
కసబ్ కసాయితనంపై
కనికరం చూపిస్తుంది.

నైవేధ్యం పెట్టిన పిండివంటకం-
ఉపవాసంతో ఎండబెట్టిన,
ఊబకాయాన్ని ఊస్సురుమనిపిస్తుంది.

పాతబడ్డ పెళ్ళాం-
ఒంటిమీది చీర
కొంగొత్త వర్ణాల్తో పళ్ళికిలిస్తుంది.

ప్రతి తలతోనూ పైశాచికత్వం
ప్రతిధ్వనించే రావణభక్తి-
రణరంగం మధ్య నిలబడి,
గీతాభోద చేస్తుంది.

చేస్తూన్న పాపాన్ని
చూసీ చూడనట్టు వదిలెయ్యమంటూ-
చేతులు జోడించిన పిల్లి
భక్తిగా కళ్ళు మూసుకుంటుంది.

పండగ పదిరోజులూ
పల్లకిపై వూరేగే మహాతాయి
పదకొండోనాటికి
ఒట్టిరాయి గా మిగిలివుంటుంది.

యాకూబ్ ॥ స్మృతిశకలం||


అప్పుడప్పుడు
ఏదోఒక స్వరం వెంటాడుతున్నట్లు ఉంటుంది.

అపరిచితంగా ధ్వనించే
ఆ గొంతు తెల్లని సముద్రపునురగలా
కొండవాలులా దూసుకుపోతున్న పిల్లగాలిలా ఉంటుంది.

చుట్టూతా పరికిస్తాను
పరిచితులెవరూ అగుపించరు

లోలోకి తొంగిచూస్తాను
సముద్రపు నురగ,దూసుకుపోతున్న గాలి...!

ఏమిటీ పోలిక-
పోలికను విడమరిచి అర్థం వెతుక్కునేందుకు
ప్రయత్నిస్తాను.

ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలిపోతుంది
బహుశా
అది నన్నో స్మృతిశకలంగా మిగిల్చిన
జ్ణాపకం కాబోలు !

డా|| కాసుల లింగారెడ్డి









1

స్థలాలు వేరు కావొచ్చు
భాషలు మారుతూ వుండొచ్చు
జెండాలు వేరు కావొచ్చు
రంగులు మారుతూ వుండొచ్చు
చరిత్రకు సింగారించిన చీర విప్పితే కదా తెలిసేది
మత ఛాందస నఖక్షతాల పచ్చి పచ్చి గాయాలు-
మౌఢ్యం పారించిన నెత్తుటి నదాలు-
2
నీ తోటలో కోకిల
ఏ రాగంలో పాడాలో వాడే నిర్దేశిస్తాడు
పురి విప్పిన నెమలి
ఏ భంగిమలో ఆడాలో వాడే నిర్ణయిస్తాడు
విశాల సముద్రంలో చేప పిల్ల
ఏ దిక్కు ఈదాలో వాడే రచిస్తాడు
టెన్నిస్‌ కోర్టులో ఎగిరే బంతులపై
ఆంక్షల బంధనాలు విధిస్తాడు
3
ఫత్వాలు జారీ చేయడానికి
ఏ మానవతా విలువలూ అడ్డురాకపోవచ్చు
లజ్జారహితంగా దేశభహిష్కరణ విధించడానికి
మతలబులు మరేమైనా వుండవచ్చు
మతమంటే రాజ్యం చేతిలోని దట్టించిన మరఫిరంగంటే
బ్లాస్ఫెమియర్‌లంటూ బందూకులు ఎక్కు పెట్టవచ్చు
సూర్యుడే కేంద్రకమన్నందుకో
ప్రజలే చరిత్ర నిర్మాతలన్నందుకో
నిన్ను నడివీధిలో ఉరితీయనూవచ్చు
సంస్కృతి చిటారు కొమ్మన కాసిన తీయని ఫలాలు
వేళ్ళు చేసిన త్యాగాల ఫలితమన్నందుకు
దొంగ ఎదురు కాల్పులల్ల ఉసురు తీయనూవచ్చు
హృదయరహిత అనాత్మలోకంలో
మానవత ముసుగు వేసుకున్న మత్తుమందు గుట్టు విప్పుతానంటే
విషమిచ్చి చంపనూ వచ్చు
4
కాలాన్ని మెడకు కట్టుకొని
వెనక్కి నడిపించాలనుకునే వాడు
చరిత్ర ఉరికొయ్యలమీద వేలాడుతాడు
చీకట్లని చీల్చే కొవ్వొత్తులను
జేబులో దాచాలనుకునే వాడు
దగ్ధశరీర శకలాలుగా మిగులుతాడు
తూర్పున ఉదయించే సూర్యుళ్ళని
దోసిట పట్టి పడమరలో పాతేయాలనుకునేవాడు
దిగంతాలావలి అగాథాల్లో అదృశ్యమవుతాడు
5
సథలాలేవైనా,భాషలేవైనా
కత్తుల వంతెనలెన్ని కట్టినా
ఎన్ని అగాథాల సుడిగుండాల సృష్టించినా
కాలం ముందుకు సాగుతూనే వుంటుంది
కొవ్వొత్తులు వొలుగులు చిమ్ముతూనే వుంటాయి
తూర్పు సూర్యుళ్ళని ప్రసవిస్తూనే వుంటుంది
తలకట్ల తకరారుల శిశుపాలుల చేత
అనేకసార్లు ఇంపోజిషన్‌ రాయిస్తూనే వుంటుంది.

Yasaswi's ||చతుర్ధ చంద్రోదయం||


=1=
చిన్ననాడెప్పుడో చంద్రుడ్ని చేరువుగా చూసిన జ్ఞాపకం…
బహుశా అమ్మ చూపుడి వేలి చివర వేలాడుతూ అనుకుంటా.
అప్పట్లో ఎంత అందంగా ఉండేవాడు !

పంచదార కలిపిన పెరుగన్నం ముద్దలా.

అదేంటో నే ఏడుపు ఆపేలోపు అమ్మ గోటిపై చేరేవాడు…
చల్లగ నా కడుపులోకి జారేవాడు..
నే నిద్దరోయాక నాన్న వచ్చేవాడు..
నింగికి.. నేలకు నడి మబ్బులా ..

ఎక్కువగా గర్జించేవాడు .. అప్పుడప్పుడూ వర్షించే వాడు ..
అమ్మ వెన్నెలంతా నాన్నకే సొంతం.
ఏ అమృత సాగర మధన ఫలితమో..
మా ఇంట శశి వదన ఉదయం ..

=2=
చిన్నప్పుడేప్పుడొ చంద్రుణ్ణి ఏడుస్తూ చూసిన జ్ఞాపకం
బహుశా అమ్మ అడ్దాల నడుమ ననుకుంటా..
అచ్చంనాలానే ఉండేవాడు ..
నోట్లో పాలపీకతో నా చిన్ననాటి ఫోటోలో లా …

అల్లరి నాలానే చేసేవాడు ..
పెద్దయ్యాక నాకు తొడొచ్చేవాడు.. నాన్న చేతికి అందొచ్చేవాడు
జ్ఞాపకాల దొంతరలో నలగని నిజం,
తమ్ముడైనా అన్న లాంటి వాడి నైజం .

=3=
మునుపెన్నడో చంద్రుడు నను చూసి నవ్విన జ్ఞాపకం ..
నను ముస్తాబించి కూర్చోపెట్టాక ..
అదేంటో నే తలెత్తి చూసేలోగా తెరమరుగయ్యాడు..
తెలిమంచు కరిగేలోగా తలపు లెన్నో రేపాడు..

అప్పటి వరకు తెలియలేదు ..
ఉదయ చంద్రిక కూడా ఉంటుందని నులివెచ్చగా
ఎన్ని జన్మలు బంధమో .. ఆ సప్తపద బంధం ..
ఆ చలువ రాయిపై అరిగే చందం .. నా జీవన గంధం .

ఇది కృష్ణ పక్షపు అష్టమి లోపు మరో చంద్రునితో నా అనుబంధం .
అష్టమి అమావాస్య తెలియకుండా రసరాజ్య యుద్ధం ..
ఫలితంగా పాడ్యమి పాపడు సిద్ధం .
ఇదీ ప్రతీ స్త్రీ కోరుకునే.. చతుర్ధ చంద్రోదయం …….
=4=

అమ్మలందరికీ.. ప్రేమతో..

డా కాసుల లింగారెడ్డి ||ఇంపోజిషన్‌||


1
స్థలాలు వేరు కావొచ్చు

భాషలు మారుతూ వుండొచ్చు
జెండాలు వేరు కావొచ్చు
రంగులు మారుతూ వుండొచ్చు
చరిత్రకు సింగారించిన చీర విప్పితే కదా తెలిసేది
మత ఛాందస నఖక్షతాల పచ్చి పచ్చి గాయాలు-
మౌఢ్యం పారించిన నెత్తుటి నదాలు-
2
నీ తోటలో కోకిల
ఏ రాగంలో పాడాలో వాడే నిర్దేశిస్తాడు
పురి విప్పిన నెమలి
ఏ భంగిమలో ఆడాలో వాడే నిర్ణయిస్తాడు
విశాల సముద్రంలో చేప పిల్ల
ఏ దిక్కు ఈదాలో వాడే రచిస్తాడు
టెన్నిస్‌ కోర్టులో ఎగిరే బంతులపై
ఆంక్షల బంధనాలు విధిస్తాడు
3
ఫత్వాలు జారీ చేయడానికి
ఏ మానవతా విలువలూ అడ్డురాకపోవచ్చు
లజ్జారహితంగా దేశభహిష్కరణ విధించడానికి
మతలబులు మరేమైనా వుండవచ్చు
మతమంటే రాజ్యం చేతిలోని దట్టించిన మరఫిరంగంటే
బ్లాస్ఫెమియర్‌లంటూ బందూకులు ఎక్కు పెట్టవచ్చు
సూర్యుడే కేంద్రకమన్నందుకో
ప్రజలే చరిత్ర నిర్మాతలన్నందుకో
నిన్ను నడివీధిలో ఉరితీయనూవచ్చు
సంస్కృతి చిటారు కొమ్మన కాసిన తీయని ఫలాలు
వేళ్ళు చేసిన త్యాగాల ఫలితమన్నందుకు
దొంగ ఎదురు కాల్పులల్ల ఉసురు తీయనూవచ్చు
హృదయరహిత అనాత్మలోకంలో
మానవత ముసుగు వేసుకున్న మత్తుమందు గుట్టు విప్పుతానంటే
విషమిచ్చి చంపనూ వచ్చు
4
కాలాన్ని మెడకు కట్టుకొని
వెనక్కి నడిపించాలనుకునే వాడు
చరిత్ర ఉరికొయ్యలమీద వేలాడుతాడు
చీకట్లని చీల్చే కొవ్వొత్తులను
జేబులో దాచాలనుకునే వాడు
దగ్ధశరీర శకలాలుగా మిగులుతాడు
తూర్పున ఉదయించే సూర్యుళ్ళని
దోసిట పట్టి పడమరలో పాతేయాలనుకునేవాడు
దిగంతాలావలి అగాథాల్లో అదృశ్యమవుతాడు
5
సథలాలేవైనా,భాషలేవైనా
కత్తుల వంతెనలెన్ని కట్టినా
ఎన్ని అగాథాల సుడిగుండాల సృష్టించినా
కాలం ముందుకు సాగుతూనే వుంటుంది
కొవ్వొత్తులు వొలుగులు చిమ్ముతూనే వుంటాయి
తూర్పు సూర్యుళ్ళని ప్రసవిస్తూనే వుంటుంది
తలకట్ల తకరారుల శిశుపాలుల చేత
అనేకసార్లు ఇంపోజిషన్‌ రాయిస్తూనే వుంటుంది.