31, అక్టోబర్ 2012, బుధవారం
కిరణ్ గాలి ||వన్ మోర్ ఛాన్స్||
మృత్యువే నీకెదుట నిలబడి
ఈ రోజే నీకు ఆఖరని
రేపన్నది లేదంటే ఏం చేస్తావు?
కకల వికలమై కన్నిరవుతావా,
కాలంపై కడసారి స్వేఛ్ఛగా స్వారి చేస్తావా?
నిరాశాతో నిస్సారంగా గడిపేస్తావా?
ఘడియ ఘడియను గుండెలకు హత్తుకొని గాఢంగా జీవిస్తావా?
***
దేన్ని లెక్కిస్తావు
పొందలేని సుఖాలనా, పంచుకున్న ప్రేమలనా?
దాచుకున్న ఆస్తులనా, పొదువుకున్న జ్ఞాపకాలనా?
నిన్ను చూసి గర్విస్తావా,
నిరర్ధకంగా బతికినందుకు ధుఖిస్తావా?
***
మృత్యువే నీకెదుట నిలబడి
ఒకే ఒక్క అనుభవాన్ని మరల
అనుభూతించే అవకాశం ఇస్తానంటుంది?
ఏ మధుర క్షణాలని మళ్ళీ జీవిస్తావు?
ఒకే ఒకరిని రోజంతా తోడిస్తానంటుంది
ఎవరిని కోరుతావు?
నీ కోసమా ... తన కోసమా?
ఒకే ఒక్క మార్పుకు అవకాశమిస్తానంటుంది
ఏ మార్పు చేస్తావు?
చేసిన తప్పునా, చేయని మంచినా.. దేన్ని సరిదిద్దుకుంటావు?
ఒకే ఒక్క కోరిక తీరుస్తానంటుంది,
ఏం కోరుతావు?
మరుజన్మ లేని మొక్షాన్నా?
మరల నీలాగే నిన్ను పుట్టించమనా?
దయతో మరింత ఆయుష్షును పోయమనా!!!
***
మృత్యువు నిన్ను చూసి జాలి పడి
ఇంకొక వారం అరువిస్తా నంటుంది ...ఏం చేస్తావు?
ఇంకొక నెల అరువిస్తా నంటుంది ...ఏం చేస్తావు?
ఇంకొక సంవత్సరం అరువిస్తా నంటుంది ...ఏం చేస్తావు?
ఇంకొక జీవితం అరువిస్తా నంటుంది ... సరిపోతుందా?
***
గమనించావా...
మ్రుత్యువు నువ్వు అడగకున్నా
ఆయువు అరువిస్తూనే వుంది
ఆఖరి గడువును పొడిగిస్తూనే వుంది
అయినా నువ్వు
విలువైన నీ "ఆఖరి రోజు"ను
నిన్నటిలానే నేడు నిశ్ప్రయోజనంగా గడిపేస్తునే వున్నావా?...
***
మిత్రమా
ప్రతి రాత్రి మరణమని గ్రహిస్తే
ప్రతి ఉదయం జన్మిస్తావు,
ప్రతి రోజు జీవిస్తావు
***
In life there is a second chance.
But there may not be a second chance to life
Every "second" in life is a second chance...
Date: 29-10-2012
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి