పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, అక్టోబర్ 2012, గురువారం

Yasaswi's ||చతుర్ధ చంద్రోదయం||


=1=
చిన్ననాడెప్పుడో చంద్రుడ్ని చేరువుగా చూసిన జ్ఞాపకం…
బహుశా అమ్మ చూపుడి వేలి చివర వేలాడుతూ అనుకుంటా.
అప్పట్లో ఎంత అందంగా ఉండేవాడు !

పంచదార కలిపిన పెరుగన్నం ముద్దలా.

అదేంటో నే ఏడుపు ఆపేలోపు అమ్మ గోటిపై చేరేవాడు…
చల్లగ నా కడుపులోకి జారేవాడు..
నే నిద్దరోయాక నాన్న వచ్చేవాడు..
నింగికి.. నేలకు నడి మబ్బులా ..

ఎక్కువగా గర్జించేవాడు .. అప్పుడప్పుడూ వర్షించే వాడు ..
అమ్మ వెన్నెలంతా నాన్నకే సొంతం.
ఏ అమృత సాగర మధన ఫలితమో..
మా ఇంట శశి వదన ఉదయం ..

=2=
చిన్నప్పుడేప్పుడొ చంద్రుణ్ణి ఏడుస్తూ చూసిన జ్ఞాపకం
బహుశా అమ్మ అడ్దాల నడుమ ననుకుంటా..
అచ్చంనాలానే ఉండేవాడు ..
నోట్లో పాలపీకతో నా చిన్ననాటి ఫోటోలో లా …

అల్లరి నాలానే చేసేవాడు ..
పెద్దయ్యాక నాకు తొడొచ్చేవాడు.. నాన్న చేతికి అందొచ్చేవాడు
జ్ఞాపకాల దొంతరలో నలగని నిజం,
తమ్ముడైనా అన్న లాంటి వాడి నైజం .

=3=
మునుపెన్నడో చంద్రుడు నను చూసి నవ్విన జ్ఞాపకం ..
నను ముస్తాబించి కూర్చోపెట్టాక ..
అదేంటో నే తలెత్తి చూసేలోగా తెరమరుగయ్యాడు..
తెలిమంచు కరిగేలోగా తలపు లెన్నో రేపాడు..

అప్పటి వరకు తెలియలేదు ..
ఉదయ చంద్రిక కూడా ఉంటుందని నులివెచ్చగా
ఎన్ని జన్మలు బంధమో .. ఆ సప్తపద బంధం ..
ఆ చలువ రాయిపై అరిగే చందం .. నా జీవన గంధం .

ఇది కృష్ణ పక్షపు అష్టమి లోపు మరో చంద్రునితో నా అనుబంధం .
అష్టమి అమావాస్య తెలియకుండా రసరాజ్య యుద్ధం ..
ఫలితంగా పాడ్యమి పాపడు సిద్ధం .
ఇదీ ప్రతీ స్త్రీ కోరుకునే.. చతుర్ధ చంద్రోదయం …….
=4=

అమ్మలందరికీ.. ప్రేమతో..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి