పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

chintam praveen ||కాకతీయ కీర్తితోరణం||

తలెత్తకుండా ఉండలేం
తలేత్తితేగాని చూడలేం

ఆత్మగౌరవానికి వెయ్యేండ్ల సజీవసాక్ష్యం
ఈ మట్టి పోరాటానికి శిలారూపం
కాకతీయ కీర్తితోరణం

రాజులు రాజ్యాలు
మట్టిపొరల్లో సమాధి చేయబడ్డా
తలొంచుకున్నోడికి
తలెత్తడం నేర్పే గంభీరత్వం తాను

ఒక్కరా ఇద్దరా
వేలమంది నియంతలు మతోన్మాదులు
వీరచరిత్రను కాలగర్భంలో కలిపేయాలని కలలుగన్నరు
ఒక్కడైనా మిగిలిండా
కాకతీయ కీర్తితోరణం తప్ప

నిలువెత్తు రాజ్యాన్ని కబలించాలనీ
ఎంతమంది
దండయాత్రల దండుతో మీసం దువ్వారో_

తీరా నిన్నుచూసాకా_

ఎంతమందికి వెన్నులో వణుకు పుట్టిందో
ఇంకెంతమంది నిలువెళ్ళా కంపించిపోయారో
రొమ్మువిరిచి నిలిచిన నీ రాజసాన్ని చూసి_

వంగీ సాగిలపడీ మోకరిల్లీ శరణుజొచ్చారే గాని
సవాల్ విసిరి నిన్నుదాటిన శత్రువొక్కడు లేడు

మహోజ్వల సామ్రాజ్యానికి శిలాఫలక
ఓరుగల్లు కీర్తిపతాక

ఉద్యమకారులకు పిడికిలెత్తడం నేర్పింది
వీరులెందరికో పౌరుషాన్ని పురుడు పోసింది
నువ్వే కదా_

ఇప్పటికి నీవు మాకు పిడికిలిబిగి భరోసావే!
మానుకోట రాళ్ళు
రాయినిగూడెం మట్టీ
నువ్విచ్చిన ఆయుదాలే కదా

కాకతీయ కీర్తితోరణం
పోరుగల్లు కీర్తిశిఖరం

12.09.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి