ll మా పల్లె లోగిళ్ళు ll తొలిపొద్దు పొడుపులోని బాలభానుని అరుణ కిరణాల అలికిడితో హొయలొలుకుతూ కరిగిపోయే తెలి మంచుపరదాల మాటున మా పల్లె అందాలు తెలతెలవారే వేకువలో గాలిపాడే సంగతులకు పులకరించే తరువులు చిగురుటాకులపై అలవోకగా జారిపోతూ మంచుముత్యాల సోయగాలతో మెరిసిపోయే పత్రాలు సుప్రభాతవేదికపై కువకువల మేల్కొలుపులు ముసిముసి నగవులనే విరులుగా అలంకరించుకునే సుమలతల పరిమళాలు పులకింతల గమకాలతో విచ్చుకుంటూ ముద్దు పూబాలలు పచ్చదనాల పానుపుపై ముత్యాల కూర్పులతో మురిసిపోతూ గరికపూల సోయగాలు స్వాతిచినుకుల చిరుజల్లులను హత్తుకుంటూ ధరణి మురిపాలు తూరుపుకనుమలనుండి తొంగిచూస్తూ దినకరుని దోబూచులు మంగళవచనాలతో శుభాలు పలుకుతూ గణగణ స్వరాలతో మ్రోగే కోవెలగంటలు మెళ్ళో గంటల రవళులతో పరుగులుతీసే బసవయ్యలు తెల్లారకముందే తట్టిలేపుతూ మా పల్లె తల్లి ఆత్మీయతలు అభిమానం, అనురాగం చిగురిస్తూ చిరునవ్వుల హేమంతాలు బంగారు పంటలతో తులతూగే హృదయాలు నిండైన హేమంతాలు మా పల్లెలోని ప్రతి ఇల్లు నిత్య వసంతాలు వచ్చీ పోయే అతిధులే మా పల్లెకు కదిలే ఆనందాలు ఝుమ్మంటూ యెదను మీటుతూ అల్లరి భ్రమరాలు కొలను నిండుగా పొంగి పూస్తూ చెంగలువ కుసుమాలు నీటి ముత్యాలతో సయ్యాటలాడుతూ తామరాకుల పరవశాలు చూరులవెంట జారిపోతూ వడివడిగా సాగిపోయే వాననీటి వయారాలు వానజాన కురులజాలువారే చినుకు ధారలను వడిసిపడుతూ మా ఇంటి మండువాలోగిళ్ళు తుళ్ళుతూ ముంగిట రంగవల్లులకు హరివింటి వర్ణాలను అద్దే మా పల్లె పడతులు ఆడుతూ పడుతూ వరి మడులను నాటుతూ మా పల్లె పాడే జానపదాలు ఆదమరచి నాగలి దున్నే రైతన్నలు, అలుపెరుగక చెమటోడ్చే కూలన్నలు పాడిపశువుల గుమ్మపాలు పంచుతూ గోపన్నలు మా పల్లె పడుచులాడే చింతపిక్కలు, సీతాదేవి వామనకుంటలు పచ్చని తోరణాలతో మా పల్లె పలికే మమతల స్వాగతాలు పసుపుగడపల శోభలతో మా పల్లె సీమలు పలికే ఆహ్వానాలు దేశ సౌభాగ్యానికే పట్టుగొమ్మలు పసిపాపల మారాలు, పల్లె తల్లుల అనునయాలు అంబరాన్ని అంటే పండుగల సంబరాలతో ఏకమయ్యే మా పల్లె మనసులు హైలెస్సా అంటూనే అలల పై సాగిపోతూ మా జాలరుల నావలు నవ వధువులను మెట్టినింటికి సాగనంపుతూ కనుమరుగైపోయే గూడుపడవల జాడలు తీయని జలాలతో ఊరి ఉరికి పొంగి పోయే బావి గట్టులు గ్రీష్మ తాపాన్ని చల్లబరుస్తూ ముంజెలు, కొబ్బరి బొండాలు అదృశ్య మైపోతూ మల్లె లాంటి స్వచ్చమైన పల్లెటూరి మమతలు కధలుగానే మిగిలిపోయే మా ఊరి ఏరువాకలు జ్ఞాపకాలై తడుముతూ గ్రామదేవతల జాతరలు నవసమాజానికి కనుమరుగై పోతూ పల్లెల సోయగాలు చరిత్రలోనైనా పాఠాలుగా మిగిలిపోయేనా పల్లెటూరి అందాలు? వీడిపోని బంధాలుగా మిగిలేనా మా పల్లెవాసుల మమతల కోవెలలు? ll సిరి వడ్డే ll 02-06-2014 ll
by సిరి వడ్డే
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RYDMOw
Posted by Katta
by సిరి వడ్డే
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RYDMOw
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి