||వరవర రావు||ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ||… అవి నేను వరంగల్ లో బి.ఎ. చదువుతున్న రోజులు. హనుమకొండ చౌరస్తాలో అశోకా ట్రేడర్స్ ముందరి సందులో మా కాలేజి స్నేహితుడు కిషన్ వాళ్ల పెద్దమ్మ ఇల్లు ఉండేది. నేనెక్కువగా అక్కడే గడిపేవాణ్ని. రాత్రిళ్లు అక్కడే పడుకునేవాణ్ని. వాళ్లింట్లో ఒక కుక్కపిల్ల ఉండేది. వాడ కుక్కల్లోనే ఒక కుక్కను మచ్చిక చేసుకొని పెంచుకున్నారు. దానితో ఆడుకోవడం, దానికి బిస్కెట్లు పెట్టడం, అది మా రాక కోసం ఎదురుచూడడం. అకస్మాత్తుగా ఒకరోజు ఆ కుక్కపిల్ల చచ్చిపోయింది. అంటే దాని చావును గానీ, చనిపోయిన ఆ కుక్కపిల్లను గానీ నేను చూడలేదు. ఆరోజు, ఆ తర్వాత ఆ ఇంట్లో అది కనిపించలేదు. పెద్దమ్మ కళ్లనీళ్లు పెట్టుకొని కుక్కపిల్ల చనిపోయిందని చెప్పింది. ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ. వెలితి. చేతులు ఏదో వెతుక్కున్నట్లు. వెతుకులాట మనసుకు. ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ కవిత ఆ వేదననుంచి వచ్చింది. అప్పటికే నాకు కవిగా కొంచెం గుర్తింపు వచ్చింది. 1950లలో ‘భారతి’లో కవిత్వం అచ్చయితే కవి. ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయితే ఆధునిక కవిగా గుర్తింపు వచ్చినట్లే. రష్యా రోదసిలోకి స్పుత్నిక్ లో లైకా అనే కుక్కపిల్లను పంపించినపుడు నేను రాసిన ‘సోషలిస్టు చంద్రుడు’ (1957) ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయింది. ఆ తర్వాత ‘భళ్లున తెల్లవారునింక భయం లేదు’, ‘శిశిరోషస్సు’. ‘హిమయవనిక’ అనే కవితలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన వచనకవిత్వ పోటీల్లో, ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో బహుమతులు వచ్చి సాహిత్య విద్యార్థులు మొదలు సి నారాయణరెడ్డి గారి దాకా అభిమానం చూరగొన్నవి. ‘భళ్లున తెల్లవారునింక భయం లేదు. కుళ్లు నల్లదని తెలుస్తుంది నయంగదా’, ‘ఇనుని అరుణ నయనాలు’ వంటి పాఠ్యపుస్తకాల ప్రభావం ఎక్కువే ఉన్నా, ‘వానిలో ఎన్నిపాళ్లు ఎర్రదనం, ఎన్నిపాళ్లు ఉడుకుదనం ఉందో రేపు కొలుస్తాను, రేపు మంచిరోజు ఎర్రని ఎండ కాస్తుంది, రేపు వసుధైక శాంతి ఎల్లెడల నిండుతుంది’ వంటి ఆశావహ ఆత్మవిశ్వాస ప్రకటనలతో నాకు ‘ఫ్రీవర్స్ కవులలో సామాజిక ప్రగతివాద’ ప్రతినిధిగా ఒక గుర్తింపు వచ్చింది. శకటరేఫాలు మొదలు ప్రబంధ కవిత్వ భాష, వర్ణనలు, ఊహలు, ఉత్ప్రేక్షలు, ఇమేజరీ ఉన్నా ప్రగతివాద భావజాలానికి చెందిన కవిగా నాకొక ఇమేజ్ ఈ కవితలతో ఏర్పడింది. రాత్రి, మంచు వంటి సంకేతాలతో స్తబ్దతను, భయాందోళనలను, సూర్యుడు, ఉషస్సు వంటి సంకేతాలతో భవిష్యదాశావహ ఆకాంక్షను వ్యక్తం చేసే కాల్పనిక ఆశావాదం అట్లా మొదలై 1968 తర్వాత ఒక విస్పష్ట ప్రాపంచిక దృక్పథంగా స్థిరపడింది. అట్లా చూసినప్పుడు కవితాసామగ్రి, భాష, వ్యక్తీకరణలకు సంబంధించినంతవరకు ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ ఒక డిపార్చర్. ఒక ప్రయోగం. పై నాలుగు కవితల్లో ఊహ, బుద్ధి, రచనా శక్తిసామర్థ్యాల ప్రదర్శన ఉంటే ఇందులో ఫీలింగ్స్ సాధారణ వ్యక్తీకరణ ఉంటుంది. ‘నా రెక్కల్లో ఆడుకునే కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?’ మనుషులు వెళిపోతారంటే నమ్మగలను. వాళ్లకోసం, అందులోనూ మగవాళ్ల కోసం ఒక స్వర్గలోకం ఉంది. అందుకని వాళ్లు ఇహంలో అన్ని అనుబంధాలూ వదులుకొని వెళ్లగలరు. ‘కాని కుక్కపిల్ల వెళిపోవడమేమిటి?’‘అంత నమ్మకమైన జీవం ఎక్కడికని వెళ్లగలదు? ‘ఎవడో స్వార్థంకై, నేను లేనపుడు ఏమిటో దొంగిలించడానికి వస్తే మొరుగుతూ తరమడానికి వెళ్లి ఉంటుంది. ప్రలోభాలు నిండిన వాళ్లను ఆ లోకందాకా తరిమి తెలవారేవరకు తెప్పలా ఇలు వాకిట్లో వాలుతుంది.’ ‘అయినా దానికా స్వర్గంలో ఏముంది గనుక అక్కడుంటుంది? స్వర్గంలోని వర్గకలహాలు రేపు దాని కళ్లల్లో చదువుకుంటాను’. నేను సికెఎం కాలేజిలో పనిచేస్తున్నపుడు 1969లో పి జి సెంటర్ లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా ఉన్న మిత్రుడు పార్థసారథి ఈ కవితను హిందీలోకి అనువదించగా, జ్ఞానపీఠ్ సాహిత్య పత్రికలో అచ్చయింది. నండూరి రామమోహనరావుగారు ‘మహాసంకల్పం’ కవితాసంకలనం వేసినపుడు ఈ కవిత ఇవ్వమని కోరాడు. ఏ కవిత ఇవ్వాలో నేను నిర్ణయించుకోవాలి గానీ, మీరు నిర్ణయిస్తే ఎట్లా అని నిరాకరించాను. సంపాదకునికి, సాహిత్య విమర్శకునికి కవి కవితల్లో తనకు ఇష్టమైనవి ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆలస్యంగా గుర్తించి ఆయనకు క్షమాపణలు చెప్పుకుంటూ ఉత్తరం రాసాను. అట్లని నేను 1964లో నెహ్రూ మీద రాసిందో, 65లో పాకిస్తాన్ తో యుద్ధం గురించి రాసిందో ఇపుడు ఆ భావాల ప్రచారానికి ఎవరైనా వాడుకుంటే అది మిస్చిఫ్ అవుతుంది. ఇప్పుడు అఫ్సర్ ‘సారంగ’లో నా కవితలను నేనే ఎంచుకుని పరిచయం చేయాలని కోరినపుడు నా ఇమేజ్ కు కొండగుర్తులుగా నిలిచిన కవితలు కాకుండా తాత్విక స్థాయిలో, కవి హృదయాన్ని పట్టి ఇవ్వగల కవితగా కూడ ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ నే ఎంచుకోవాలనిపించింది. - వరవరరావుhttp://ift.tt/1jhf4nC -ఏప్రిల్ 30, 2014http://magazine.saarangabooks.com/2014/05/07/
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itORgB
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itORgB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి