కవిత్వంతో ఏడడుగులు 29: 1975 ప్రాంతాల్లో The Hindu పేపరులో మొదటిసారి ఈ కవిత చదివాను. అది ఎంత మనసుకి నచ్చిందంటే, దాన్ని నా డైరీలో రాసుకున్నాను. (Later, I could not trace my diary). అప్పటినుండీ ఇది నా మనసులో నాటుకు పోయింది. అప్పట్లో అంత సాహిత్యవ్యాసంగం లేకపోవడంవల్ల కవి పేరు గుర్తు పెట్టుకోలేదు, కవితశీర్షికా గుర్తులేదు. ఆఫ్రికన్ కవి అని మాత్రం తెలుసు. అందులో "సందర్భానికి తగ్గ ముఖాలు" అన్న విషయం లీలామాత్రంగా గుర్తుంది. నెట్ లో దీన్ని వెతకగా వెతకగా కొన్నాళ్ళక్రిందట దొరికింది. ఎంత ఆనందం వేసిందో. మీకు కూడా నచ్చుతుందనే నా నమ్మకం. గమ్మత్తుగా ఈ మధ్యనే కువైటీ కవయిత్రి ఫతిమా అల్ మతార్ కవిత కూడా 'భిన్నమైన ముఖాలు' గురించే చదివేను. ఈ ఇద్దరు కవులూ మనలోని ఆత్మవంచనాగుణం జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటున్నప్పుడు ఎలా బాధిస్తుందో చాలా గొప్పగా చిత్రించేరు. మళ్ళీవారం ఆ కవిత చూద్దాం. మనకు తెలియకుండానే మనం పరిస్థితులకి ఎలా బానిసలం అయిపోతామో తెలియజేస్తాయి ఈ కవితలు. ఇందులో భాషా, భావనా, శైలీ చాల మంది తర్వాత అనుకరించారు. ఇప్పుడు దీని ఔచిత్యం ఏమిటంటే, ఎన్నికలలో మీ దగ్గరకి ఓటు అభ్యర్థిస్తూ ఎన్నో ముఖాలు వస్తాయి. దేశభక్తులమనీ, సెక్క్యులరిస్టులమనీ, అవినీతి అంతం చేస్తామనీ, అరచేతిలోకి వైకుంఠాన్ని తీసుకువస్తామనీ, అభ్యుదయవాదులమనీ, మీ కులంవాడిమనీ, మీ వాడవాడిననీ, మీ ఊరివాడిననీ, ఒకటేమిటి ఓట్లుదండుకోడానికి ఎన్ని ముఖాలు కావలస్తే అన్ని ముఖాలు సందర్భానికి తగ్గట్టు తగిలించుకుని వస్తారు. ఒక్కసారి వాళ్లలో ఎంత నిజాయితీ ఉందో గమనించండి. మీరుకూడా, వోటువేసేటప్పుడు ఒక్కముఖాన్నే పెట్టుకోండి... మీ వోటు దేశానికి మంచిచేస్తుందా చెయ్యదా అనేది. ఆ వ్యక్తితో మీకుగల ఇతరేతర (ఊహామాత్రపు) సంబంధాలకు విలువ ఇవ్వకండి. మీ పిల్లల్నీ, మీ మనవల్నీ మనసులో తలుచుకుని వాళ్లకి ఎటువంటి భవిష్యత్తు, ఎటువంటి వారసత్వం, ఎటువంటి వాతావరణాన్ని వదలిపోదామనుకున్నారో యోచించి మరీ ఓటు వెయ్యండి.. . అనగా అనగా ఒకప్పుడు ... . ఒరే నాన్నా! ఒకప్పుడు మనుషులు మనసారా నవ్వేవారు, వాళ్ళ కళ్ళలో నవ్వు కనిపించేది; ఇప్పుడు కేవలం పలువరసతోనే నవ్వుతున్నారు. మంచుగడ్డలా ఏ భావమూలేని చూపులు చూస్తూ అంతలోనే నా నీడవెనక ఏముందా అని వెతుకుతూ... ఒకప్పుడు నిజంగా హృదయపూర్వకంగా చేతులు కలిపే వారు; నాన్నా! ఆ రోజులు వెళ్ళిపోయాయిరా. ఇప్పుడు ఒకపక్క అయిష్టంగానే చేతులు కలుపుతూ, మరొక పక్క నా ఖాళీ జేబులో ఏముందా అని తణువుతుంటారు. "ఇది మీ ఇల్లే అనుకొండి" "మరోసారి తీరికచేసుకుని రండి" అని చెప్పి మొహమాటానికి ఒక సారో, రెండు సార్లో వెళితే ఇక మూడోసారి ఉండదు. నాముఖం మీదే భళ్ళున తలుపేసుకుంటారు. అందుకని నేను చాలా విషయాలు నేర్చుకున్నానురా, నాన్నా! సందర్భానికి తగ్గ బట్టలు తొడుక్కుంటున్నట్లు, నేను కూడా ముఖాలు తొడుక్కోడం నేర్చుకున్నాను... ఇంట్లో ఒక ముఖం, ఆఫీసుకొకటీ, వీధికోసం ఇంకొకటీ, గృహస్థుగా మరొకటీ, పార్టీలకొకటీ; వాటితో పాటే, ఫొటోలోని చెదరని నవ్వులా సందర్భానికి తగ్గ నవ్వుని కూడా అతికించుకోడం నేర్చుకున్నా. నేను కూడా నేర్చుకున్నాను... నా దంతాలతో నవ్వడమూ, మనస్కరించకపోయినా చేతులు కలపడమూను. నేను కూడ "పీడవదిలింది" అనుకున్నప్పుడు "సంతోషం, తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం" అనడం; ఏమాత్రం సంతోషం లేకపోయినా, "మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది" అనడం; బాగా విసుగెత్తిపోయినా,"మీతో మాటాడ్డం ఎంతో బాగుంది" అనడం. కానీ, నను నమ్మరా తండ్రీ! నాకు కూడ నీలా ఉన్నప్పుడు నేనెలా ఉండేవాడినో అలాగే ఉండాలని ఉంది. నాకు ఈ బోలుమాటలు మరిచిపోవాలని ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను మనసారా నవ్వడం తిరిగి నేర్చుకోవాలి. నవ్వుతుంటే అద్దంలో నా పళ్ళు పాముకోరల్లా కనిపిస్తున్నాయి. నాన్నా! నాకు ఎలా నవ్వాలో చూపించరా! ఒకప్పుడు, నేను నీలా ఉండే రోజుల్లో ఎలా ముసిముసి నవ్వులు నవ్వేవాడినో అలా నవ్వడం చూపించు. . గాబ్రియేల్ ఒకారా, నైజీరియన్ కవి. . Once Upon a Time . Once upon a time, son, they used to laugh with their hearts and laugh with their eyes: but now they only laugh with their teeth, while their ice-block-cold eyes search behind my shadow. There was a time indeed they used to shake hands with their hearts: but that’s gone, son. Now they shake hands without hearts while their left hands search my empty pockets. ‘Feel at home!’ ‘Come again’: they say, and when I come again and feel at home, once, twice, there will be no thrice... for then I find doors shut on me. So I have learned many things, son. I have learned to wear many faces like dresses – homeface, office-face, street-face, host-face, cocktail-face, with all their conforming smiles like a fixed portrait smile. And I have learned too to laugh with only my teeth and shake hands without my heart. I have also learned to say,’Goodbye’, when I mean ‘Good-riddance’: to say ‘Glad to meet you’, without being glad; and to say ‘It’s been nice talking to you’, after being bored. But believe me, son. I want to be what I used to be when I was like you. I want to unlearn all these muting things. Most of all, I want to relearn how to laugh, for my laugh in the mirror shows only my teeth like a snake’s bare fangs! So show me, son, how to laugh; show me how I used to laugh and smile once upon a time when I was like you. . Gabriel Okara. Nigerian Poet
by Nauduri Murty
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1glyEtN
Posted by Katta
by Nauduri Murty
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1glyEtN
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి