అక్షర మాంత్రికుడు Posted on: Sat 19 Apr 01:29:18.166833 2014 - మార్క్వెజ్ అస్తమయం మెక్సికో సిటీ : నోబెల్ బహుమతి గ్రహీత, విశ్వ విఖ్యాత నవలా రచయిత గాబ్రియెల్ గార్సియా మార్క్వెజ్ గురువారం ఇక్కడ తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 87సం||లు. మార్క్వేజ్‌కు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. ఆయన మృతి వార్తను రాండమ్ హౌస్‌లో ఆయన మాజీ ఎడిటర్ క్రిస్టోబాల్ పెరా ధృవీకరించారు. ''వన్ హండ్రడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్'' (వందేళ్ల ఏకాంత వాసం) నవల 20వ శతాబ్దపు సాహిత్యంలో ఆయనను అగ్ర పథాన నిలబెట్టింది. 'గాబో' గా అందరికీ చిరపరిచితులైన ఆయన సాహిత్య రంగంలో చేసిన కృషికి గానూ 1982లో నోబెల్ బహుమతి పొందారు. ఆయన పుస్తకాలు అనేక డజన్ల భాషల్లోకి అనువదించబడ్డాయి. తన రచనలతో డికెన్స్, టాల్‌స్టారు, హెమ్మింగ్‌వే, మార్క్ ట్వెయిన్ వంటి ప్రముఖ రచయితల సరసన చోటు సంపాదించుకున్న గాబ్రియెల్ అటు విమర్శకుల, ఇటు సామాన్య పాఠకుల మన్నన పొందారు. మాజికల్ రియలిజం(మార్మిక వాస్తవికత) అనే సాహిత్య శైలిలో ఆయన అద్భుతమైన ప్రతిభ కనపరిచి ప్రతీకగా నిలిచిపోయారు. అటు వాస్తవం, ఇటూ కాల్పనికత రెండూ జమిలిగా పెనవేసుకున్న అసాధారణ శైలి అది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలకే అనూహ్యమైన కాల్పనికపు హంగులు సమకూర్చడంతో అవి విలక్షణమైనవిగా రూపుదిద్దుకుంటాయి. ఆ శైలే ఆయనకు ప్రత్యేకతను సముపార్జించిపెట్టింది. ఆయన రచనల మూలాలు లాటిన్ అమెరికన్ పురాణగాధల్లోనివి. అయినా ఆయన రచనా శైలి, అందులోని విషయం అంతా కూడా సార్వజనీనంగా వుండేది. ఆయన నుంచి వెలువడే ప్రతి రచనకు కూడా మంచి విమర్శకులు, అలాగే పాఠకులు కూడా వుంటారని స్వీడిష్ అకాడమీ ఆఫ్ లెటర్స్ ఆయనకు నోబెల్ పురస్కారం అందచేస్తూ ప్రశంసించింది.నోబెల్ బహుమతిని స్వీకరిస్తూ మాట్లాడిన గాబ్రియల్ ''కవులు, యాచకులు, సంగీత కళాకారులు, ప్రవక్తలు, యుద్ధ వీరులు, పనికిమాలిన వాళ్ళు ఇలా అందరూ కూడా హద్దుల్లేని ఈ వాస్తవిక ప్రపంచంలోని జీవులే. కాస్త కాల్పనికతతో, ఊహాజనిత శక్తితో మేం పనిచేస్తాం. మాకున్న కీలకమైన సమస్య ఏంటంటే, మా జీవితాలు నమ్మదగ్గవిగా మార్చుకోవడానికి సాంప్రదాయ సిద్ధమైన మార్గాలు కొరవడడం.'' అని పేర్కొన్నారు. కేవలం 18 మాసాల్లో రాసిన 'వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆప్ సాలిట్యూడ్' పుస్తకం 2కోట్ల ప్రతులకు పైగా అమ్ముడుపోయింది. స్పానిష్ భాషలో అత్యుత్తమ రచనగా దీన్ని చిలీ కవి పాబ్లో నెరుడా అభివర్ణించారు. మొత్తం మానవాళి అంతా చదవదగిన పుస్తకమంటూ నవలా రచయిత విలియం కెన్నడీ ప్రశంసించారు. ఈ మార్మిక వాస్తవికత రచనా తీరును తాను కనిపెట్టానంటూ గాబ్రియెల్ ఏనాడూ గొప్పగా చెప్పుకోలేదు. దాని తాలుకూ ఆనవాళ్ళు అంతకుముందుకూడా లాటిన్ అమెరికా సాహిత్య చరిత్రలో వున్నాయని, కానీ తనకు ముందు ఎవరూ కూడా దానిని ఇంత కళాత్మకంగా ఉపయోగించలేదని పేర్కొన్నారు. ఇదే ఉత్తరోత్తరా అట్లాంటిక్ ఇరువైపులా గల రచయితలు అంటే చిలీకి చెందిన ఇసాబెల్ అలెండీ, బ్రిటన్‌కు చెందిన సల్మాన్ రష్దీ వంటివారికి స్ఫూర్తిగా నిలిచింది. 1927 మార్చి 6వ తేదిన కరేబియన్ తీర ప్రాంతంలోని చిన్న పట్టణమైన అరకాటకాలో జన్మించిన మార్క్వేజ్ 11మంది సంతానంలో పెద్దవాడు. 1947లో విద్యార్ధిగా వుండగానే తన మొట్టమొదటి రచనను వెలువరించిన ఆయన ఇక ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.చ చిలీలో పినోచెట్ నిరంకుశత్వ పాలనను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. అందుకు నిరనసగా రచనలు మానేశారు. అయితే ఆ విధంగా తను పొరబాటు చేశానని తర్వాత చెప్పుకున్నారు. క్యూబా వార్తా సంస్థ ప్రెన్సా లాటినాలో కరస్పాండెంట్‌గా చేశారు. క్యూబా విప్లవ యోధుడు ఫెడల్ కాస్ట్రోకు అత్యంత అభిమానపాత్రుడైన మార్క్వేజ్ తాను ముందుగా జర్నలిస్టునని, జర్నలిస్టుగానే వుండడానికి తాను ఇష్టపడతానని చెప్పుకునేవారు. ఎందుకంటే తాను జర్నలిస్టుగా వుండకపోతే ఇన్ని పుస్తకాలు రాసివుండేవాడిని కాదని అనేవారు. తన పుస్తకాలకు సంబంధించిన సమాచారమంతా కూడా వాస్తవిక జీవితం నుండి తీసుకున్నదేనని స్పష్టం చేశారు. లింఫు గ్రంథుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన చివరలో తన సమయంలో ఎక్కువ భాగం తన జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడానికే కేటాయించారు. 1999లోనే ఆయనకు ఈ వ్యాధి వున్నట్లు నిర్ధారించారు. కాగా, 2012 జులైలో గాబ్రియెల్ డిమెన్షియాతో బాధపడుతున్నారని, దాంతో రచనా వ్యాసంగాన్ని నిలుపుచేశారని ఆయన సోదరుడు జైమ్ వెల్లడించారు. http://ift.tt/1lgQxBY
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lgQxBY
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lgQxBY
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి