పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

బాలసుధాకర్ మౌళి కవిత

నదిపాట అలల గొంతుతో నది పాడుతుంటుంది ఏ సుదూరాన్నుంచో పక్షులు నదిపాట విని కచేరీ ముందు వీక్షకులు చేరినట్టు నది వొడ్డున చేరుతుంటాయి నది గొంతెత్తి మరింత మార్దవంగా ఆర్ధ్రంగా లాలిత్యంతో పాడుతుంది నదిది సమూహపు పాట సర్వదుఃఖాలనూ, దుఃఖావశేషాలనూ కడిగేసే జోలపాట జలపాట ఈ నది పుట్టి ఎన్నాళ్లయ్యిందో ఏ ఆదిమకాలపు వీరుడో నదిని నిలువునా ఛేదించి ఆవలి తీరానికి తొలి దారి వేసాడో ఎందరి మబ్బు బట్టిన కన్నుల్లో వేకువ సూరీణ్ణి నాటిందో నది గత వర్తమాన చరిత్రకు నిలువుటద్దంలా ఈ నది 2 నది దుఃఖాన్ని ప్రేమిస్తుంటుంది నురగల పరవళ్ల పాటలాగే దుఃఖాన్నీ గొంతు నిండుగా నింపుకుని దిక్కుల గుండెల్లో ధ్వనించేట్టు మహా ఆవేశంతో ఆలపిస్తుంది నది పాటంటే గాయాల పాటేనేమో ఏ ఆదివాసీ తల్లో పరమ ఆవేదనతో కార్చిన కన్నీరు ఎండి జ్ఞాపకంలా మిగిలిన కన్నీటి చారికేనేమో ఈ నది - కౄర అరణ్యమృగం దాడికి ఎముకలు బయల్పడిన లేత జింక దేహంలా నిండా తేలిన రాళ్లతో చుక్క నీరు లేని ఈ నది - 3 ఈ రోజు తెల్లారి కలలో నది కనిపించింది పడవేసుకుని నది మీదికి బయలుదేరాను లయబద్ధంగా తంత్రుల్లా కదలాడాల్సిన అలలు మూగగా రోదిస్తూ.. ఏవో కొన్ని పక్షులు నది మీది ఆకాశాన్ని రెక్కల కింద బరువుగా మోస్తూ మహా గుంభనంగా.. నది చనిపోయిందా ? ఏఏ అరణ్యాలనో, ఏఏ పర్వతాలనో దాటుకుంటూ తరాల మధ్య వంతెనలా అనంత జీవకోటి దేహాంతర రక్తప్రసరణలా ఎన్నెన్ని ఊళ్లనూ ఎన్నెన్ని పొలాలనూ వొరుసుకుంటూ ప్రవహించిందో ! నది మీద నాలుగు కన్నీటి బిందువులు రాల్చాను నదిని దగ్గరకు చేరదీసాను చేతులారా తడిమాను మూగబోయిన నదికి మళ్లీ తన రెక్కల పాటను గుర్తుచేయాలనుకున్నాను యిలా అనుకోవడమే అనుకోవడమే నది పాటయ్యింది పాటే నది అయ్యింది 4 విష పుష్పావృతచేతులతో నదిని దహనం చెయ్యొచ్చు వికశిత పుష్పాలంకారిక మాంత్రిక హస్తంతో నదిని మహానదిని చెయ్యొచ్చు నది ప్రజల అరచేతుల్లో నిండా మొలిచిన తడి మొలక నది - నది పురివిప్పుతుంది నది పురివిప్పుతుంది ( 'చంపావతి నది'ని చూసి దుఃఖంగా.. ) రచనా కాలం : 1 ఏప్రిల్ 2014 3.4.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hETAjf

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి