|| నా చిన్నప్పుడు - 1 || నవీన్ కుమార్ గాదరి || తేది : 29-మార్చి- 2014 1) నేను చిన్నగున్నప్పుడు అరికట్నం కట్టుకొని పొద్దుగాల నాలుగ్గంటలకే లేశి నరేష్ గాన్ని, దస్తగిరి గాన్ని, ఎడ్డి రాజు గాన్నీ లేపుకొచ్చి సాయిలు మామ బర్రె కాడి గడ్డాం (గడ్డి వాము) ల నుంచి గింత గడ్డి గుంజుకచ్చి, ఆ పుల్ల ఈపుల్లా పోగేసి, పొగేసి, మంటపెట్టుకొని సలి కాగుకుంట తెల్లారెదాక కూసునేది..!! 2) తెల్లారగట్ల ఆరుగంట్లకు దస్తగిరిగాడు పటేండ్లిల్లకు పాలు తేనీకి పోయేటోడు వాడు పోంగనే, వాని పోరి గురించో లేక వాని పొలం గురించో మాట్లాడుకునేది...!! 3) ఏడుగంట్లకల్లా మంట కాంచి లేశి ఎడ్డి రాజు గానొల్ల యాప చెట్టెక్కి పండ్ల పుల్లలు ఇరుసుకొనేది పది గంట్ల దాకా పండ్లు తోముకొనేది ఎవని పుల్ల ఎక్కువ అరిగితే వాడు గొప్ప..!! 4) అట్ల పండ్లు తోముకుంట మా ఊరి రాం శెర్వుకో లేక చెరువు పక్కనే ఉన్న కర్ణాల బాయిలకో ఈతకు బోయేది నాకు ఈత రాదంటే, నేను నేర్పిస్తానని నరేష్ గాడు నన్నెత్తుకొని కండల వీరునిలా ఫోజిస్తూ బాయిలకు దుమికేటోడు..!! అప్పుడు మాకు ఆ కర్ణాల బాయే ఓ 'బాత్ టబ్ ' ఆ బాయి పక్కనే ఉన్న పొలాలల్లున్న బంకమన్నే మాకు 'డవ్ సోపు '...!! 5) అక్కన్నుంచి సక్కగ గౌండ్ల శీనన్న దగ్గరికి పోయి సల్లగ రొండు బుడ్ల తాటి కల్లు తాగి నాలుగు తాటి ముంజలు తిని సక్కగ ఇంటి బాట పట్టేది..!! 6) ఒస్తొస్త నారాయణ రెడ్డి పటేల్ మామిడి తోట్ల పడి మా చేతికందిన మామిడి కాయలు తెంపుకొని ఎవలు సూడక ముందే దబ్బదబ్బ ఉరుక్కుంటచ్చి ఊరి పొలిమేర్ల ఉన్న తాతమ్మ గుడిసెలకు పోయి ఆ కాయలు కోసి.. ఉప్పూ, కారం తెచ్చి, వాటికి అద్దుకొని తినేది... అబ్బబ్బ.. ఆ రుచే వేరు..!! ఖతం.. మా బ్రేక్ ఫాస్ట్ అయిపోయేది...!!!
by Naveen Kumar Gadari
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f4sbX7
Posted by Katta
by Naveen Kumar Gadari
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f4sbX7
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి