శుక్రవారం మరీ ఇలా పరుగెత్తుకు వచ్చేయాలా? మొన్ననే కదా వెళ్ళింది. మరీ అంత తొందరేం వచ్చిందని ఉరుకులు పరుగుల మీద రావడం...అనుకుంటూ మొదలు పెట్టాను ఈ పంక్తులు. అసలు ఈ వారం రోజులు ఎలా గడిచాయో, ఎప్పుడు గడిచాయో తెలియడం లేదు. దానిక్కారణమేమిటంటే, పాతకోటలోకి సరదాగా వెళితే చేతికి వజ్రాల లంకెబిందెలు దొరికినట్లు, నేనేదో ఉర్దూ కవితలు నాలుగు పరిచయం చేద్దామని రాసిన రాతలకు వజ్రవైఢూర్యాలను మించిన ప్రశంసలు దొరికాయి. కామెంట్లు భుజం మీద చరుస్తుంటే నా మనసు సప్తాకాశాలు దాటేసి విహరించడం మొదలెట్టింది. నన్ను నేనే మరిచిపోయిన స్థితిలో వారం రోజులేంటి, ఏళ్ళు గడిచినా తెలుస్తుందా? ఈ ప్రోత్సాహానికి నేను అర్హుణ్ణి అవునో కాదో తెలియదు కానీ ఆ అర్హత సంపాదించడానికి తప్పకుండా కష్టపడతాను. ఇంతగా అభిమానిస్తూ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతఙ్ఙతలు
ఇక అసలు విషయానికి వచ్చేద్దాం
మొన్న శుక్రవారం ఫైజ్ గురించి నాలుగు ముచ్చట్లు చెప్పుకున్నాం. ఈ రోజు మరో రెండు ముచ్చట్లు చెప్పుకుని మరో కవిత చదువుకుందాం.
చాలా మంది కవుల్లాగే ఫైజ్ కూడా ప్రేమకవితలతోనే మొదలెట్టాడు. నెమ్మదిగా సామ్యవాదం వైపు మొగ్గు చూపడంతో ఫైజ్ లోని ప్రగతిశీల భావాలు ఆయన కవితల్లోను ప్రతిఫలించడం మొదలయ్యింది. ఒక విప్లవకవిగా ఆయన ఉర్దూ సాహిత్యంలో పేరు సంపాదించుకున్నాడు. ఇరవయ్యో శతాబ్ధంలో ముఖ్యమైన కవుల్లో ఒకడిగా ప్రసిద్ధి చెందాడు. ఫైజ్ కవితల్లో ఒక అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తుంది. ఆయనకు సంతృప్తి ఎన్నడూ లేదు. ప్రేమ కవితల్లో కూడా ఈ అసంతృప్తి కనిపిస్తుంది. ఒక ప్రేమకవితలో – పూలలో రంగులు నింపేద్దాం, వసంత గాలి వీస్తుంది. రారాదూ ఉద్యానవనానికి పనిలేదు, స్తబ్ధత వదిలింది, పదండి గాలితో మాట్లాడదాం, ఎక్కడో ఒక చోట ప్రేయసి కబుర్ల చెప్పుకుందాం.. అంటూ కొనసాగే కవిత చివర – ఐతే ప్రేయసి ఇంట్లో లేదా ఉరికంబం పైన తప్ప మధ్యదారిలో తానెక్కడా ఉండేది లేదంటాడు.
నా చేతిలో పెన్ను, ఇంకు లాక్కుంటే లాక్కోనీ... నా గుండె నెత్తుటిలో వేళ్ళు ఎప్పుడో ముంచాను- అని రాశాడు మరో చోట.
1951లో కుట్ర కేసులో జైలుకెళ్ళినప్పడు ఫైజ్ తన బ్రిటీషు భార్య అలీస్ కు అనేక ఉత్తరాలు రాశాడు. తర్వాత ఆ ఉత్తరాలను ప్రచురించాలని కొందరు మిత్రులు ఆయన్ను కోరారు. తన భార్యకు ఇంగ్లీషులో రాసిన ఉత్తరాలన్నీ స్వయంగా ఫైజ్ తిరిగి ఉర్దూలోకి అనువదించాడు. ఆ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాస్తూ, ఈ ఉత్తరాలు వ్యక్తిగతమైనవే అయినా, వీటిని ప్రచురించడం వల్ల రాజకీయ ఖైదీల మనోస్థితి, ముఖ్యంగా సామ్యవాద సిద్దాంతాల కోసం పోరాడేవారు జైళ్ళలో ఉన్నప్పుడు ఎంత మానసిక సంఘర్షణకు గురవుతారో తెలుసుకోవాలనుకునే వారికి ఉపయోగపడతాయని, అందుకే ప్రచురిస్తున్నానని చెప్పాడు.
ఫైజ్ ఉత్తరాల గురించి, ఫైజ్ జీవితం గురించి వచ్చేవారం మరికొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఇప్పడు ఫైజ్ రాసిన – ఇంకా కొన్ని రోజులు మాత్రమే, ప్రియా (చంద్ రోజ్ ఔర్ మేరీ జాన్) కవిత చూద్దాం:
కొన్ని రోజులు మాత్రమే, ప్రియా, కేవలం గుప్పెడు రోజులు మాత్రమే
దౌర్జన్యం నీడలో ఊపిరి పీల్చే నిస్పహాయత ఇంకొన్ని రోజులే...
ఇంకాస్త సమయం ఈ వేధింపులు సహిద్దాం, అలమటిద్దాం, రోదిద్దాం...
ఇది మన పూర్వికుల వారసత్వం ... మన అంగవైకల్యం...
శరీరానికి ఖైదు, భావావేశాలకు సంకెళ్ళున్నాయి
ఆలోచనలకు దాస్యబంధాలు, మాటలపై కట్టడులు
అయినా ధైర్యంగా బతుకుతూ పోతున్నాం
జీవితం, బిచ్చగాడి చిరుగుల పంచేనా
ప్రతిక్షణం దానిపై బాధల మాసికలు పడుతుండాలా
ఫర్వాలేదు, దౌర్జన్యం కొన్ని రోజులు మాత్రమే
కాస్త ఓపికపట్టు, అణిచివేతల రోజులు కొన్నే
ఈ నిర్జన, ఎడారి, బీడు లోకంలో
మనం ఉండాలి, కాని ఇలాగే ఉండడం కాదు.
అపరిచిత హస్తాల అనామక వేధింపుల భారం
నేడు భరించాలి, ఎల్లప్పుడు కాదు...
నీ అందాన్ని కప్పేస్తున్న అమానుషాల ధూళి
మన మూన్నాళ్ళ యవ్వనంలోని నిరాశలతో సమానం
వెన్నెల రాత్రుల్లో వ్యర్థంగా ప్రజ్వరిల్లే బాధ
ఆలకించబడని గుండె నిట్టూర్పులు, వినబడలేని శరీర ఆర్తనాదాలు
కొన్ని రోజులే, ప్రియా, కొన్ని రోజులు మాత్రమే...
ఉర్దూలో ఫైజ్ భావాలను సాధ్యమైనంత వరకు తెలుగులో తీసుకువచ్చే ప్రయత్నం చేశాను. కవిత చివరి పంక్తులు – చాందినీ రాతోంకా బేకార్ దహకతా హువా దర్ద్... భావాన్ని తెలుగులో రాసినా.... ఆ అనుభూతిని రాయడం కష్టమే. అలాగే – జిందగీ క్యా కిసీ ముఫ్ లిస్ కీ ఖబా హై జిస్ మేం, హర్ ఘడీ దర్ద్ కే పైవంద్ లగే జాతే హైం – అన్న పంక్తుల్లోధ్వనించే బలమైన నిరసన, ఆగ్రహం, ఆవేదన, తిరుగుబాటు తదితర భావాలు తెలుగులో వచ్చాయా? అనుమానమే... ఉర్దూలో కవిత మీరే చదవండి. నా అనువాదం అసలు కవితకు ఒక ఆమడ దూరంలో ఉందని చెప్పినా, ఫర్వాలేదు కనీసం ఆమడ దూరం వరకు వచ్చాను కదా?
చంద్ రోజ్ ఔర్ మేరీ జాన్, ఫక్త్ చంద్ హీ రోజ్,
జుల్మ్ కీ ఛావూం మేం దమ్ లేనే పర్ మజబూర్ హై హమ్
ఔర్ కుఛ్ దేర్ సితమ్ సహ్ లేం, తడప్ లేం, రో లేం,
అప్నే అజ్ దాబ్ కీ మీరాస్ హై, మాజూర్ హైం హమ్
జిస్మ్ పర్ ఖైద్ హై, జజ్బాత్ పే జంజీరేం హైం
ఫిక్ర్ మహ్బూస్ హై, గుఫ్తార్ పే తాజీరేం హైం
అప్నీ హిమ్మత్ హై కే హమ్ ఫిర్ భీ జియే జాతే హైం
జిందగీ క్యా కిసీ ముఫ్ లిస్ కి ఖబా హై జిస్ మేం
హర్ ఘడీ దర్ద్ కే పైవంద్ లగే జాతే హైం
లేకిన్ అబ్ జుల్మ్ కీ మాయాద్ కే దిన్ థోడే హైం
ఇక్ జరా సబ్ర్, కే ఫరియాద్ కే దిన్ థోడే హైం
అర్స యే దహ్ర్ కీ ఝుల్సీ హుయీ వీరానీ మేం
హమ్ కో రహ్నా హై, పర్ యుం హీ తో నహీ రహ్నా
అజ్నబీ హాతోంకే బేనామ్ గారన్ బార్ సితమ్
ఆజ్ సహ్నా హై, హమేషాతో నహీ సహ్నా హై
యహ్ తేరే హుస్న్ సే లిపటీ హుయీ ఆలమ్ కీ గర్ద్
అప్నీ దో రోజా జవానీ కీ షికస్తోం కా షుమార్
చాందినీ రాతోంకా బేకార్ దహక్తా హువా దర్ద్
దిల్ కీ బేసూద్ తడప్, జిస్మ్ కీ మాయూస్ పుకార్
చంద్ రోజ్ ఔర్, మేరీ జాన్, ఫకత్ చంద్ హీ రోజ్ ....
మళ్లీ శుక్రవారం కలుద్దాం.. అంత వరకు సెలవు..
అక్టోబర్ 10, 2013
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి