ప్రతి కవికీ తనకు తానో, ఇతరులకో సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి లేక సందర్భం వస్తుంది అసలు తన కవిత్వ కృషి ఎందుకో. (ఇప్పుడే కాదు ఇకముందెప్పుడు కవి అని వాడినా,అందులో కవయిత్రులు కూడా ఉన్నారని మనవి. ఆమాటంలో లింగ వివక్ష లేదు.)
ఈ కవిత్వంతో ప్రయాణం ప్రారంభించే ముందే మన ప్రయత్నం అసలెందుకో చెప్పుకుంటే బాగుంటుందని అనిపించింది. అందుకు డిలన్ థామస్ కవిత మీ ముందుంచుతున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. దీన్ని Disclaimerగా తీసుకోవచ్చు. ఇక్కడ చెప్పేవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు. వాటికి ఏ ప్రామాణికతా విలువా లేవు. నేను చదువుకున్నవీ, విన్నవీ, నా ఊహకి తట్టినవీ ఇక్కడ విన్నవించుకుంటున్నాను. సాధ్యమైనంతవరకు మూలాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను. అంతమాత్రంచేత దానికి సాధికారత సిద్ధించదు. కారణం ఇందులో ఏ పరిశోధనా లేదు.
కవిత్వం ఒక ఆవేశం. ఒక రకంగా చెప్పాలంటే Aberration of Emotion. మనుషులందరికీ నచ్చినవి కవికి నచ్చకపోవచ్చు. ఎవరూ పెద్దగా పట్టించుకోని విషయాలని, పనికిమాలినవిగా వదిలేసినవి చిన్నపిల్లాడిలా కవి పట్టించుకోవచ్చు. అసలు కవిత్వం మనలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుందోకూడా తెలీదు. అదొక వైరస్ లాంటిది. అదిపట్టిందంటే అమ్మవారు పూనినట్టుంటుంది. అది వదుల్చుకునేదాకా, కాగితమ్మీద ఆ కవితావేశాన్ని ఒలికించేదాకా ఈతరానివాడు ఒక సుడిగుండంలో చిక్కుకుని బయటపడడానికి చేసే ప్రయత్నంలా ఉంటుంది. ఇది సహజ స్థితి. కాని కొంత అలవాటైన తర్వాత, ఈతవచ్చినవాడు నూతిలోనో, చెరువులోనో చేసే విన్యాసంలా ఉంటుంది కవిత్వం. అంటే కేవల ఆవేశం నుండి కొంత సమర్థతలోకి వస్తుంది. ఇరవై ఏళ్ళవయసు వచ్చిన తర్వాత జీవితానికి అర్థం ఏమిటి? అన్న ప్రశ్న ఉదయించినట్టు, ఇప్పుడు ఈ కవిత్వం ఎందుకు రాస్తున్నట్టు అని కవికి అనిపించవచ్చు. (ఈ సందర్భం వారి వారి వ్యక్తిగత సంస్కారాన్ని బట్టీ, పరిస్థితుల అనుకూనలతనుబట్టి మారుతుంటుంది).
ఒక రకంగా కవిత్వం ఎందుకు రాస్తున్నట్టు అన్నదానికి సమాధానమే కవి మేనిఫెస్టో. మన సానుభూతిని బట్టి మనకు కొందరు కవులు నచ్చుతారు కొందరు నచ్చరు. కాని, మనం అలవరచుకోవలసినది, మన ఇష్టాయిస్టాలతో సంబంధంలేకుండా, ఎక్కడ కవిత్వాంశ ఉందో దాన్ని పట్టుకోవడం. అంటే వోల్టేర్ చెప్పినట్టు " I do not agree with what you say, but I defend to death that you have every right to say it అన్న Democratic స్ఫూర్తి అలవరచుకోవడం. పంకంలోంచి పంకజం వచ్చినట్టు వ్యక్తిత్వంలేని కవిలోంచికూడా మంచికవిత్వం రావొచ్చు అన్నసత్యం మనం గుర్తుంచుకోవాలి. కవీ కవిత్వమూ ఒకటిగా జీవిస్తే, జీవించగలిగితే అది ఆదర్శం. అవి చాలా అరుదైన వస్తువులు.
అలాంటి ఒక పంకజం ఈ Dylan Thomas కవిత.
In my craft or sullen art
.
In my craft or sullen art
Exercised in the still night
When only the moon rages
And the lovers lie abed
With all their griefs in their arms,
I labour by singing light
Not for ambition or bread
Or the strut and trade of charms
On the ivory stages
But for the common wages
Of their most secret heart.
Not for the proud man apart
From the raging moon I write
On these spindrift pages
Not for the towering dead
With their nightingales and psalms
But for the lovers, their arms
Round the griefs of the ages,
Who pay no praise or wages
Nor heed my craft or art.
.
Dylan Thomas
(27 October 1914 – 9 November 1953)
Welsh Poet
నా నైపుణి లేక కళ...
.
ఈ నిశ్శబ్ద నిశీధిని, ప్రేమికులు
తమ దుఃఖాలని కాగలించుకు నిద్రించేవేళ
బయట స్వచ్ఛంగా వెన్నెల విరజిమ్ముతుంటే
లోపల రెపరెపలాడుతున్న దీపం ప్రక్కన
నేను సాధనచేస్తున్న ఈ నైపుణ్యమూ,ఈ కళా
పేరుప్రఖ్యాతులకోసమో, జీవికకో
బ్రహ్మాండమైన వేదికలపై వాటిని
దర్పంతో ప్రదర్శించడానికో కాదు;
వాటి అంతరాంతర రహస్యాలు ఇచ్చే
అతి సహజమైన ఆనందంకోసం.
గాలికి రెపరెపలాడుతున్న కాగితాలపై
అందమైన వెన్నెలనుండి దూరంగా బ్రతికే
అహంభావి మనిషికోసం కాదు నేను రాస్తున్నది;
వాళ్ళ కోయిలలతోనూ, వాళ్ల స్తుతిగీతాలతోనూ
అమరులైన కవిశ్రేష్ఠులకోసమూ కాదు;
ఏ ప్రశంసలూ, ఏ పారితోషికాలూ ఇవ్వలేక
అసలు నా కౌశలంతో, కళతో నిమిత్తంలేకుండా
అనాదిగా వస్తున్న బాధల భుజాలపై
చెయ్యివేసి నడిచే కవిత్వ ప్రేమికులకి.
డిలన్ థామస్
(27 October 1914 – 9 November 1953)
వెల్ష్ కవి
______నౌడూరి మూర్తి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి