పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, అక్టోబర్ 2013, బుధవారం

ఉర్దూ కవిత్వ నజరానా






బక్రీద్ పండుగ హడావుడి ముగిసింది. ఈద్ ముబారక్ చెప్పుకోవడమూ, ముబారక్ లు స్వీకరించడంలోనే రెండు రోజులు గడిచిపోయాయి. అఫ్ కోర్స్ బిరియానీ ఉండనే ఉందనుకోండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది బిరియానీలో ఉగాది పచ్చడి కలుపుకు తింటే ఎలా ఉంటుందా అని, అలాంటి ఆలోచనలతో భుక్తాయాసం తీర్చుకోక ముందే తలుపు మీద టక టకా మని శుక్రవారం కొడుతుంది. ఆ వెనుకే ఫైజ్ గారు పాస్ రహో అంటున్నాడు. కవిసంగమం మిత్రులు ఎదురు చూస్తుంటామన్నారు కాబట్టి ఆయాసాలు, ఆలోచనలు పక్కన పెట్టి కంప్యూటర్ కీబోర్డు చేతిలోకి తీసుకున్నాను.

గత శుక్రవారం ఫైజ్ మీద రాసిన పంక్తులకు నేను ఊహించని స్పందన వచ్చింది. కవులను గండపెండేరాలతో ఘనంగా సన్మానించిన తెలుగు నేల మనదిరా అంటూ మనసు ఒక మొట్టికాయ వేసింది. ముఖపుస్తకంలో పరిచయమైన మిత్రుడు కృష్ణమోహన్ మోచర్ల గారు ఫైజ్ గురించి కొంత సమాచారం పంపించారు. నా కోసం శ్రమకోర్చి ఆయన సమాచారం సేకరించడం కొంత ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి. ఇలాంటి మిత్రులు లభించినందుకు గర్వంగాను ఉంది.
ఇక అసలు విషయానికి వస్తే, ఫైజ్ గురించి ఫైజ్ ఏమన్నారన్నది ఆసక్తికరమైన విషయం. తన గురించి ఆయన ఇలా చెప్పుకున్నాడు :
’’1920 నుంచి 1930 మధ్య కాలం సాహిత్యంలో అనేక జాతీయ, రాజకీయ ఉద్యమాల కాలం. కేవలం సీరియస్ సాహిత్యమే కాదు, సరదాగా నడిచే రచనలు కూడా వచ్చేవి. హస్రత్ మోహానీ, జోష్, హాఫీజ్ జలంధరీ, అక్తర్ షీరానీల పేర్లు కవిత్వంలో బలంగా వినిపించేవి. ఈ వాతావరణంలో నక్ష్ ఫరియాదీలోని కవితలు కొన్ని రాశాను.
1934లో కాలేజీ విడిచిపెట్టాను. 1935లో అమృతసర్ లోని ఎం.ఏ.ఓ. కాలేజీలో లెక్చరర్గా చేరాను. ఇక్కడే నాకు నా సమకాలీనుల్లో చాలా మందికి మానసికంగాను, భావావేశపరంగాను పరిణతి లభించింది. ఈ కాలంలోనే మేము సాహిబ్జాదా మహమూదుజ్జఫర్ ను ఆయన శ్రీమతి రాషిదా జీహాన్ ను కలిశాము. ఆ తర్వాత ప్రగతిశీల రచయితల ఉద్యమం మొదలైంది. దాంతో పాటే శ్రామిక ఉద్యమాలు కూడాను. ఈ క్రమంలో అనేక దృక్పథాల వేదికలు ఏర్పడ్డాయి. ఇక్కడ మేము నేర్చుకున్నదేమిటంటే ప్రపంచానికి దూరంగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఎందుకంటే మన చుట్టు ఉన్న వాతావరణం మనపై ఖచ్చితంగా ప్రభావం వేస్తుంది. వ్యక్తిగతంగా మనిషి అతనికి ఉన్న ప్రేమలు, సంతోషాలు, కష్టాలు, బాధలు వగైరా ఎన్ని ఉన్నా కాని, వ్యక్తిగతంగా మనిషి ఈ పూర్తి చట్రంలో చాలా చిన్నవాడు. జీవితం ఈ విశ్వమంత విస్తారమైనది. కాబట్టి ప్రేమబాధ, ప్రాపంచిక బాధ ఈ రెండు ఒకే అనుభవానికి చెందిన రెండు పార్శ్వాలు. ఈ భావం మనసులో చోటు చేసుకున్న తర్వాత రాసిన పద్యమే – మునుపటి ప్రేమను అడగవద్దు ప్రియా – అన్న కవిత. పూర్తి ప్రపంచంలోని దు:ఖం గురించి ఆలోచించవలసి ఉంది. ఆ తర్వాత కొంత కాలం సైన్యంలోను, జర్నలిజమ్ లోను, శ్రామిక సంఘాల్లోను గడిపిన తర్వాత నాలుగేళ్ళు జైలులో గడపవలసి వచ్చింది. దస్త్ సబా, జిందాన్ నామా కవితా సంకలనాలు జైలు అనుభవాల రికార్డులే. ప్రేమలానే జైలు జీవితం కూడా ఒక మౌలికమైన అనుభవం. ఈ అనుభవం కొత్త ఆలోచనలకు తలుపులు తెరుస్తుంది. తొలి ప్రేమ ఉదయించినప్పుడు ఉండే భావావేశాలు మళ్లీ మొగ్గ తొడిగాయి. ఉదయాస్తమయాల్లోని సౌందర్యం, ఆకాశంలోని నీలిమ, చిరుగాలి స్పర్శ అన్నీ జైలులోను అనుభూతికి వచ్చాయి. మరో విషయమేమంటే, బయటి ప్రపంచానికి సంబంధించిన కాలం దూరం అనేవి జైలులో ఉండవు. దూరం దగ్గర అనేది ఇక్కడ లేదు. ఒక్క క్షణం కూడా శతాబ్ధాల కాలంగా ఉండవచ్చు లేదా శతాబ్ధాలు కూడా నిన్నటి రోజులా కనిపించవచ్చు. మూడో ముఖ్యమైన విషయమేమంటే, అందరితోను వేరుపడిన భావం. ఒంటరితనం. ఇక్కడ చదవడానికి, ఆలోచించడానికి, సృజనాత్మక వధువును సింగారించడానికి కావలసిన సమయం ఉంటుంది.‘‘
ఫైజ్ తన గురించి తాను ఎక్కువగా చెప్పేవారు కాదు.. ఈ సంభాషణ అర్థాంతరంగానే ఆపేశారు.
భారత ఉపఖండం తీవ్రమైన మార్పులకు గురవుతున్న కాలంలో ఫైజ్ రాసిన పంక్తులు ఈ మార్పులపై తమ ప్రభావాన్ని వేశాయి. ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు. ఒక విప్లవకారుడు, ఉద్యమకారుడు. కేవలం కవితలు మాత్రమే రాయలేదు. పత్రికల్లో సంపాదకీయాలు, వ్యాసాలు, రాసేవారు. అనేక విషయాలపై ఆయన ఇంటర్వ్యులు చదివితే ఆనాటి రాజకీయ పరిస్థితులపై లోతయిన అవగాహన కలిగిన వ్యక్తిని చూస్తాం. భారత ఉపఖండంలో నేటికి ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు ఆయన అభిప్రాయాల్లో జవాబులు దొరుకుతాయంటే అతిశయోక్తి కాదు.
అణిచివేతలు, అన్యాయాలపై గళమెత్తిన కవి ఫైజ్. పాస్ రహో అంటూ ఆయన రాసిన కవిత ఈ వారం చూద్దాం:

పక్కనే ఉండు
నా హంతకీ, నా ప్రేయసి
పక్కనే ఉండు

రాత్రి నడుస్తున్నప్పుడు
ఆకాశంలో నెత్తురు తాగి రాత్రి నడుస్తున్నప్పుడు
కస్తూరీ లేపనం చేతబట్టి వజ్ర ఖడ్గం నడుస్తున్నప్పుడు
పాడుతూ నవ్వుతూ ఆర్తనాదాలు చేస్తూ నడుస్తున్నప్పడు
బాధల నీలిమువ్వలు అడుగడుగున మోగిస్తూ నడుస్తున్నప్పుడు

రొమ్ములో మునుగుతున్న గుండె
చొక్కా చేతుల్లో ముడచుకుంటున్న హస్తాలను చూస్తూ
ఆశ పడుతున్నప్పుడు

శిశువు రోదనలా మద్యం గలగలలు
ఎంత సముదాయించినా వ్యర్థమైనప్పుడు
అనుకున్నది ఏదీ జరగనప్పుడు
ఏదీ పనికిరానప్పుడు
రాత్రి నడుస్తున్నప్పుడు
విషాదం తొడుక్కుని నిర్మానుష్య రాత్రి నడుస్తున్నప్పుడు
పక్కనే ఉండు
నా హంతకి నా ప్రేయసి నా పక్కనే ఉండు
ఫైజ్ ఉర్దూలో రాసిన పంక్తులు ఇవి.

పాస్ రహో
మేరే ఖాతిల్ మేరే దిల్ దార్ మేరే పాస్ రహో
జిస్ ఘడీ రాత్ చలే

ఆస్మానోం కా లహూ పీకర్ సయా రాత్ చలే
మర్ హమ్ ముష్ఖ్ లియే నష్తర్ అల్మాస్ చలే
బైన్ కర్తీ హుయీ హస్తీ హుయీ గాతీ నికలే
దర్ద్ కా కాస్నీ పాజేబ్ బజాతీ నికలే

జిస్ ఘడీ సీనోం మేం డూబతే హువే దిల్
ఆస్తినోం మే నిహాం హాథోం కే రాహ్ తక్నే లగేం
ఆస్ లియే

ఔర్ బచ్చోంకే బిలఖ్నేకీ తరాహ్ ఖుల్ ఖులె మై
బహరె నాసూదగీ మచలే తో మనాయే నా మనే
జబ్ కోయీ బాత్ బనాయే నా బనే
జబ్ న కోయీ బాత్ చలే
జిస్ ఘడీ రాత్ చలే
జిస్ ఘడీ మాతమీ సున్ సాన్ సియా రాత్ చలే
పాస్ రహో
మేరే ఖాతిల్ మేరే దిల్ దార్ మేరే పాస్ రహో


                                                                                                       అబ్దుల్ వాహెద్ 

                                                                                                                                         October 18 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి