మూడు తరాల కవుల కవిసంగమం :సీరీస్ -11
...............................................................
వేదిక : 'గోల్డెన్ త్రెషోల్డ్',ఆబిడ్స్,నాంపల్లి స్టేషన్ రోడ్,హైదరాబాద్
సమయం : 9.11.2013
6pm- 'మిస్ మీనా' నాటక ప్రదర్శన
7pm-కవిసంగమం
.
నందిని సిధారెడ్డి
కవిసంగమం కవుల స్వ పరిచయం వారిమాటల్లోనే చూడండి
జాన్ హైడ్ కనుమూరి
తల్లిదండ్రులు
కనుమూరి సుందర్రావు, బి.ఎ. చదివారు రెవెన్యూలో పనిచేసి రిటైర్ అయ్యారు.(92 సం.)
అపరంజమ్మ, గృహిణి తనకాలాన్ని పూర్తిచేసారు
ఇద్దరు అన్నలు
ఇద్దరు అక్కలు
ఒక చెల్లి
ఒక తమ్ముడు
ప్రక్కటెముక : విజయ గ్రేస్
కుమార్తెలు ఇద్దరు : ప్రీతి అపరంజి, శౄతి అపరంజి
టీచర్లు నేపద్యం కలిగి సాహిత్యనేపద్యంలేని కుటుంబం.
చాలా యాదృశ్చికంగా సాహిత్యంలోకి రావడంజరిగింది (1998-2000మధ్య) మద్యం మానాలని
చేసిప్రయత్నాలలో కవిత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. అలా కవిత్వం
చదువుతున్నప్పుడు శ్రీ సి.వి.కృష్ణారావు గారు నిర్వహించే "నెలనెలావెన్నెల"
తారసపడింది. సమావేశానికి వస్తూ వస్తూ ఓ కవిత జేబులో వేసుకురండి అనేవారు.
అదీకాక ఎదురుపడగానే ఆయన మూడు ప్రశ్నలు అడిగేవారు
1. కొత్తవి ఏమైనా రాసారా?
2. కొత్తవి ఏమైనా చదివారా?
3. కొత్త పుస్తకం ఏమైనా సంపాదించారా?
అవి కవిత్వంపై మరింత ఆశక్తిని పెంచాయి. నెలనెలావెన్నెలలోనే చాలామంది కవులను
కలుసుకున్నాను నేను.
* * *
కవిత్వం పుస్తకాలుగా వచ్చినవి :
హృదయాంజలి 2003 కవిత్వం
హసీనా - దీర్ఘకవిత 2001
అలలపై కలలతీగ 2006
అముద్రితాలు :
ప్రేమాంతరంగం - లఘుకావ్యం
మోకరించిన వేకువ - కవిత్వం
దావీదు విజయం - కవిత్వం
ఇంకా కొంత కవిత్వం
***
2003సం.నికి ఎక్స్ రే వారు ఇచ్చిన అవార్డు
రాళ్ళలో పూసిన పువ్వు - కథ
ఆంధ్రప్రభ దీపావళి పోటీలో సాధారణ బహుమతి
***
నెలనెలావెన్నెల 5వ సంకలనానికి పచేయడం జరిగింది.
***
1999 సంవత్సరంలో కొన్ని మార్పులు ఒక్కసారే వచ్చాయి.
* నేను పనిచేస్తున్న కంపెనీలో కంప్యూటీకరణ వలన కంప్యూటరు నేర్చుకోవలసి రావడం
* మద్యపానంవలన కలిగిన మతిమరుపులవల్ల చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకోవలసిన అవసరం.
* మద్యపానం మానడంవల్ల కలిగిన శారీరక, మానసిక వత్తిడులను తట్టుకోవడం మూడు నాలుగు ఇన్సిస్టిట్యూట్‌లో నేర్చుకోవాలని ప్రయత్నించాను కాని వయస్సు సమస్యవల్ల నాకొచ్చే సందేహాలు క్లాసును అభ్యంతరపరుస్తున్నాయని బయటకు తోసేసారు. ఆఫీసులో మా బాస్‌కు మెయిల్సు చూస్తూ సాయంకాలం నెట్ సెంటర్స్‌లో ప్రాక్టిసుచేస్తూ కంప్యూటరు నేర్చుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఎక్కడా నేర్చుకోలేదు. విదేశీయులతో చాటింగుచేస్తున్నప్పుడు నా మాటలు పొయిట్‌గ్గా ఉన్నాయనడంతో కొంత కవిత్వంపై మక్కువపెరిగింది. ఈ నేపద్యంతో సుమారు మూడు సంవత్సరాలు గడిచాయి. చిత్రం ఏమిటంటే కంప్యూటరు నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటినుంచి ఏదోవిధంగా ఇంచుమించు ప్రతిరోజూ ఆన్‌లైను ఉండటం అంతర్జాల ప్రక్రియలలోకి తొంగిచూడటానికి కుదిరింది.
2007లో దార్ల వెంకటేశ్వరరావు(సెంట్రల్ యూనివర్సిటీ) పరిచయంతో బ్లాగులు పరిచయమయ్యాయి. అపట్లో బ్లాగులు 100మాత్రమే వుండేవి. బ్లాగుమిత్రుల తొలిసమావేసాల్లో పాల్గొనడం జరిగింది. అప్పుడే నేను బ్లాగు ప్రారంభించాను. చాలామంది మిత్రులకు బ్లాగును పరిచయంచేసాను.(క్రియేట్‌చేసిపెట్టాను) కొన్ని ఆన్‌లైన్ పత్రికలు పరిచయమయ్యాయి. క్యంప్యూటరు, అంతర్జాలంలో జరుగుతున్న మార్పులను సాహిత్యనికి అనుగుణంగా మాత్రమే నేను తెలుసుకున్నాను. సాంకేతిక పరమైన విషయాలపై దృష్టిపెట్టలేదు.
2011లో గుండె(బైపాస్) ఆపరేషన్ అయ్యాక మిత్రులద్వారా ఫేసుబుక్కు పరిచయం. మండే మొజాయిక్‌లో పాల్గొనడంకూడా ఎఫ్. బి. వల్లనే జరిగింది.
అంతర్జాలంలో తెలుగు, తెలుగు కవిత్వం అనే అంశం మొదటినుంచి చర్చలు, చాట్‌లు, బజ్జులు నేను వెలుబుచ్చిన అభిప్రాయాలకు, అదే అంశంపై నేను పిహెచ్.డి చేస్తే బాగుంటుందని మిత్రుల చేసే తరచూప్రోత్సాహంవల్ల నాకూ చేస్తే బాగుండు అనిపించింది. అనుకున్నదే తడువుగా ఎం.ఎ. తెలుగుకు అడ్మిషను తీసుకున్నాను. అయితే ఆప్రాజెక్టు ఇంకా కుంటినడక నడుస్తోంది.
రాజమండ్రినుంచి పుట్ల హేమలత గారు అంతర్జాలంలో తెలుగు అనే అంశంపై రీసెర్చి చేసారు నా ఫిజికల్ మార్పుల్లో అంతర్జాలం అంతర్గతంగా ఒక భాగమేచెప్పాలి. నా అలోచనా పరిథిని కొంత పెంచితే, కవిత్వము- అంతర్జాలము మిత్రుల పరిథిని పెంచాయి.
మోహన్ రావిపాటి
పూర్తి పేరు : వంశీమోహన్.రావిపాటి తండ్రి పేరు : వెంకట్రావు, ( ప్రధానోపాధ్యాయుడు) తల్లి పేరు ; రామ సీతమ్మ (ప్రధానోపాధ్యాయురాలు) సిబ్లింగ్ : ఉషశ్రీ ( అక్కయ్య) సాహిత్యం తో నాకు పరిచయం : ఫలానా సమయంలో జరిగింది అని నిర్ధుష్టంగా చెప్పలేను కాని, చిన్నప్పటి నుండి నాటకాలు అన్నా పుస్తకాలు అన్నా ప్రత్యేకమైన శ్రద్ద ఉండేది. రెండవతరగతిలోనే చందమామ, బాలజ్యోతి,లాంటి పుస్తకాలు చదివేవాడిని. మూడవతరగతిలో మా ఇంటి ఎదురుగా ఇన్న గ్రంధాలయంలో ఉన్న పుస్తకాలు చదవటం ప్రారంభించాను. మా నాన్నగారు ఉపాధ్యాయుడిగానే కాక, మంచి నటుడిగా కూడా బాగా పేరు ఉండేది. అలాముందుగా నాకు నాటకాలతో పరిచయం ఏర్పడింది, నాటకాల పుస్తకాలు బాగా చదివే వాడిని, వాటిని ప్రాక్టీస్ చేసేవాడిని, మొదటి సారిగా మూడవతరగతి లో ఉన్నప్పుడు మొదటి నాటక ప్రదర్శన ఇచ్చాను. అ తర్వాత నాన్నగారు, నాన్నగారి స్నేహితుడు యల్.కె.రావు ప్రోత్సాహంతో 6 వ తరగతి లో ఉన్నప్పుడు మొదటి సారిగా 'మార్పు ' అనే నాటిక రాశాను, ఆ తర్వాత ఏడవ తెరగతి లో ఉన్నప్పుడు 'నిరుద్యోగి" అనే ఏక పాత్ర రచించాను. అలా రచన అలవాటయ్యింది, ఆ తర్వాత ఇంటర్మిడియట్ , డిగ్రీ లో ఉన్నప్పుడు ఏవో ప్రేమ కవితలు రాస్తూ ఉండేవాడిని.
నాకు అన్ లైన్ సాహిత్యం తో పరిచయం అనుకోకుండా జరిగింది, మొదటి సారి నాకు ఆన్ లైన్ సాహిత్యం గురించి తెలియచెప్పింది కవిసంగమం గ్రూప్. నాకు స్వతహాగా సాహిత్యం మీదున్న ఆసక్తి తో ఈ గ్రూప్ లో చేరటం జరిగింది, ఇక్కడ జరుగుతున్న సాహిత్య చర్చలు, కవిత్వం చూసిన తర్వాత, ఒక దశాబ్దం పాటు పక్కన పెట్టిన నా కవిత్వానికి కొత్త ఊపిరులద్ది, తిరిగి రాయటం ప్రారంభించాను, ఇప్పుడు సాహిత్య చర్చలకు చాలా గ్రూప్ లు ఉన్నప్పటికీ కవిసంగమంతో నా అనుబంధం ప్రత్యేకమైనది
చిన్నప్పటి నుండి నాటకాల ప్రభావం వల్లనేమో, సినీ రంగం మీద మక్కువ ఉండేది. కాని కొన్ని కారణాల రీత్యా దాదాపు దశాబ్దం పాటు, హాస్పిటల్, బ్యాంకిగ్ రంగాలలో పని చేసి, చివరకు నాకిష్టమైన సినీరంగంలో కాలు పెట్టటం జరిగింది. మొదటిగా 'ఎడారి వర్షం' సినిమాకి ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నా సినీరంగ ప్రవేశం జరిగింది, తిలక్ రచించిన "ఊరి చివరి ఇల్లు" ఆధారంగా నిర్మించిన ఆ లఘు చిత్రానికి విమర్శకుల నుండి మంచి స్పందన లభించింది, అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శింఛబడింది. తర్వాత "కృతజ్ఞత" అనే లఘు చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశాను. ఆ తర్వాత "అంతర్ముఖం" అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇప్పుడు "రిపోర్టర్' అనే సినిమాకు ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఇది విడుదలకు సిద్దం అవుతుంది. త్వరలో నే నా దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవుతుంది, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది
కవితా చక్ర
పుట్టిపెరిగింది కామారెడ్డి నాన్నగారు పురుషోత్తమాచార్యులు, తెలుగు పండిట్ మరియు హిందుస్థానీ విద్వాంసులు
నేను గ్రాడ్యుయేషన్ చేసి, జర్నలిజం చేసాను
గతం లో
అక్షర భిక్ష పెట్టింది ఆంద్ర భూమి.
రచయిత్రి గా గురితింపు తెచ్చిందీ భూమే!
అందులో ఎన్నో కవితలు, వ్యాసాలూ, కథలు, అనుబంధ నవలలు
రాసాను
స్వాతి, జ్యోతి లలో కథలు వస్తుండేవి
2008 to 2011 వరకు
సాక్షి లో ఉపసంపాదకీయం చేసాను
ఆ పై
లోకల్ చానల్ లో ప్రోగ్రాం ప్ర్యూసర్, స్క్రిప్ట్ రైటర్ గా ఒక ఏడాది కొనసాగించాను
తొలి కవితా సంపుటి 'మధురిమ' ఈ మధ్యే రాళ్ళ బండి గారిచే ఆవిష్కరణ జరిగింది
ప్రతీ రోజు, మాస్తి. మేమిద్దరం ఇంచుకున్నాం సినిమాల్లో
పాటలు రాసి, పాడటం జరిగింది.
మా వారు 'చక్రధర్' క్యాడ్ ఇంజనీర్..
ఇద్దరు పిల్లలు(బాబు,పాప)
గుర్తింపు నిచ్చిన రంగాలు రెండు
కలం, గళం... ప్రస్తుతం నవల రాస్తున్నాను, మరియు సొంతగా మ్యూజిక్ కంపోసింగ్ చేస్తున్నాను...
బాలసుధాకర్ మౌళి
నా ఊరు: పోరాం, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా
నేను మా ఊరి గెడ్డలోని చేపలు పట్టుకుని, కొండల దగ్గర రేంబళ్లు ఏరుకుని , ఊరంతా తిరిగి తిరిగి బాల్యాన్ని గొప్పగా ఆనందించాను. మనందరిలాగే. తల్లిలాంటి ఊరుని గురించి ముందు చెప్పడం కనీస ధర్మమని నా ఉద్దేశం. అందుకే ఊరిని గురించి చెప్పుతన్నా.... మనందరి ఊళ్లలాగే నా ఊరు యిప్పుడు పరాయీకరణకు గురయ్యింది. రైతులు భూములమ్ముకుని వలసబోతున్నారు. అది యిప్పుడా ! .. పదిహేను, ఇరవై సంవత్సరాల కిందటే మొదలైంది. అన్ని వృత్తికారులూ ధ్వంసమైపోయారు. కొత్త దారిని ఈ వ్యవస్థ చూపించలేకపోయింది. మన దేశంలో ఇంచుమించు అన్ని ఊర్ల పరిస్థితీ ఇంతే కదా చాలా దుక్కం వేస్తుంది.
మా కుటుంబం పరిస్థితి చెప్పాలంటే.. మేము కంసాలి వ్రుత్తికారులం. నిజంగా చెప్పాలంటే వో రకంగా సంచారులమేనేమో. మా నాన్న పేరు గురుమూర్తి, అమ్మ పేరు కనకరత్నం. నేను నా తల్లిదండ్రులకు పదకొండో సంతానం. తండ్రి డ్రాయింగ్ టీచర్ గా, తెలుగు పండితునిగా పనిచేసి రిటయిరైనారు. డ్రామా ఆర్టిస్ట్, చిత్రకారుడు, హార్మోనిస్ట్, రెండు పద్యనాటకాలు, వొక సాంఘిక నాటకం రాసారు. మూడు శతకాలు రాసారు. మా అమ్మ చదువుకోకపోయినా.. గొప్ప జీవితానుభవం వున్నది. నిజంగా మన తల్లులకు మనం కోటి సార్లు దండం పెట్టుకోవాలి. ఇంకా చాలదు. వాళ్లకెంత ఓపికా !.సహనం ! గంపెడు మందిని సాకి, ఇంత వరకు వచ్చిన తల్లులకు ఏమని దండం పెడతామన్నా ? దండం చాలదు కదా..! కేవలం ఆడపిల్లల పెండ్లిల్ల కోసం ఊరొదిలి వచ్చేసాము. ఇది రాస్తుండగా కండ్ల నీళ్లు వస్తున్నయి. ఇంకా ఆ సముద్రంలోనే ఈదుతున్నాం. ఇప్పుడెందుకు మనలాంటి వాళ్లం కవిత్వాన్ని ఆయుధంగా ధరించకూడదో చెప్పండన్నా..!? ఖచ్చితంగా స్పష్టమైన గురితోనే కవిత్వాన్ని రాయాలి. ఈ వ్యవస్థను బర్త్ రఫ్ చేయాలి. మనకు ప్రాణం వొకటి ఊరు.. మళ్లీ వొకటి తల్లి కదా అన్నా.... నాకెదైనా కవిత్వం అబ్బి వొకటో రెండో కాసింత గాడంగా రాసాననుకున్నా.. రేపొద్దున్న రాద్దామనుకుంటున్నా.. అంతా అమ్మ చలవే. దుఃఖంలోనూ, సంతోసంలోనూ వొకలాగే వుండేది తల్లులే కదా ... నా తల్లి నుంచి నేను చాలా కవిత్వాన్ని తోడ్కుంటున్నాను. నా కసలు అమ్మే కవిత్వంగా కనిపిస్తాది. నిజంగా నేను కనుగొన్నాను .. సర్వ కవితా వస్తువులూ అమ్మలోనే నిక్షి ప్తమైయుంటాయని. అందుకే అమ్మే పెద్ద కవిత.
చిన్నప్పుడు నాన్న డ్రాయింగ్ వేస్తుంటే చూసేవాడిని. గొప్ప ఆనందం వేసేది. అలాగ స్కూల్ డ్రాయింగ్ కాంపిటీసన్స్ లో ఫస్టు వచ్చేవాడిని. వొకసారి రాష్ట్రస్థాయి డ్రాయింగ్ పోటీల్లో ప్రైజ్ వచ్చి , జిల్లాలో ప్రైజ్స్ వచ్చి కళలంటే అంటే బాగా మక్కువ ఏర్పడింది. ఇంటి దగ్గర నాన్న బీరువాలో రష్యన్ లిటరేచర్ (1990 ల్లో రష్యాలో సోషలిజం వున్నపుడే రష్యా సాహిత్యం చాలా చవకగా దొరికేది. విజయనగరం కోట దగ్గర అమ్మేవారట! ) వుండేది గానీ.. మహాప్రస్థానం లాంటి కవిత్వం వుండేది కాదు, అది చదవాలని మహా కోరిక. సాంప్రదాయ సాహిత్యమే వుండేది. విజయవిలాసం, ప్రభావతి ప్రద్యుమ్నం లాంటివి. తర్వాత నాన్నే.. హైస్కూల్ రోజుల్లో మహాప్రస్థానం కొని ఇచ్చారు. తర్వాత శివారెడ్డి కవిత్వం కవితా వస్తువు ఎంపికలో, చూసే కోణంలో కొత్త రహస్యాలను చెప్పింది. నిజంగా శివారెడ్డిగారు లాంటి వాళ్లు మనకున్నందుకు మనమ్ గొప్ప అద్రుష్టవంతులం. విజయనగరం సాహితీస్రవంతి మిత్రులు వొకాయన వలన ఐదు సంవత్సరాలుగా మార్కిస్ట్ సాహిత్యాన్ని బాగా ప్రేమిస్తున్నాను.
పుస్తకాలే గొప్ప సహచరులు.
ఆన్ లైన్ సాహిత్యమే లేకపోతే చాలామంది ఆత్మీయతను కోల్పోయేవాడిని. అసలు కవిత్వం రాయని రోజూ, కవిసంగమంలో మన మిత్రులను కలవని రోజూ చాలా బాధాకరంగా కూడా గడుస్తుంది నాకు. కవిత్వంలోకి వస్తేనే ప్రాణం వొచ్చినట్టు ఉంటుంది. ''యిందరు మన వాళ్లు ఉన్నారు కదా అనే ధైర్యం''- నేను కొన్ని కొన్ని విషయాలలో డీలా పడినప్పుడు బలంగా పనిచేస్తుంది. నిజంగా నాకంటూ కొందరు ఆత్మీయులు ఉన్నారు కదా అని. ఖచ్చితంగా చెప్పాలంటే కవిసంగమం అనే వొక కుటుంబం నాకు దొరికినట్టే భావిస్తున్నాను. నమ్ముతున్నాను. మన మధ్య అప్పుడప్పుడూ చిన్న చిన్న పొరపొచ్చలు వచ్చినా అవేమంత శాశ్వతం కాదు. స్వచ్ఛమైన కవిత్వం వాటినన్నింటినీ తుడిచేస్తుంది. మొత్తానికి మనం కవిత్వానికి రుణపడి వున్నాం. ఇంకా మనుసుల్లో ఆ తడి వుందంటే దానికి కవిత్వమే కారణమని నమ్ముతున్నాను.
ఇక పోతే నా స్కూల్ పిల్లలే పిల్లలు. వాళ్లలో నుంచి కళాకారులను వెలికి తీసే బాధ్యత బహుశా జీవితమంతా వుందనుకుంటా.. ......సైన్స్ టీచర్ని. కానీ తెలుగు ....
ఇన్నీ వివరాలు మీతో పంచుకోవడానికి కారణం.. మనిసి నగ్నంగా వ్యక్తం కావాలనే. వ్యక్తీకరించబడాలనే. ............ మీతో నన్ను ఇలా............... ఇదీ వొక అనుభవమే.
ముగింపులో ఒక మాట కవిసంగమం సిరీస్ 11 లో పాల్గొంటున్న కవుల నుంచి సమాచారం సేకరించి నిజానికి నేనే రిపోర్టు చేద్దామని మొదట్లో అనుకున్నాను. అటువంటి వ్యర్ధ ప్రయత్నం ఒకటి రెండు సార్లు చేసి డిలీట్ చేసేశాక (కొట్టేసేందుకిప్పుడు కాగితాలు వాడే అలవాటు పోయిందాయె) వారి మనసులోంచి ఉబికిన భావాలను మీకు సరాసరి అందజేయటమే న్యాయం అనిపించింది. ఇక దగ్గరి మిత్రులగా వారిగురించి, వారా కవిత్వం గురించి మీకు అదనంగా తెలిసిన సమాచారాన్ని తప్పకుండా పంచుకుందాం. ఎందుకంటే ఒక్కరోజు వేదికపై కుర్చీపై కూర్చోపెట్టినదానికంటే మన మనసుల్లో సాటి కవులను స్థానాన్నివ్వటం మరింత గొప్పవిషయంకదా.
- కవిసంగమం అడ్మిన్ ప్యానెల్ తరపున
శ్రీనివాస్.కట్టా
చాలా మంచి ఆలోచన శ్రీనివాస్ గారు,.ఆత్మీయంగా పరిచయం చేసుకున్న అందరికి అభినందనలు,.
రిప్లయితొలగించండిథాంక్యూ భాస్కర్ గారూ...
తొలగించండిKatta Srinivas garu .mi prayatnam chaala baaagundi.okarigurinchi okaru telusukovadam document rupam lo ,great one
రిప్లయితొలగించండిసత్యగారూ నెనర్లు..
తొలగించండి