పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, అక్టోబర్ 2013, బుధవారం

ఉర్దూ కవిత్వ నజరానా

    




ఉర్దూ కవిత్వ నజరానా. పేరు బాగుంది. కాని, ఏం రాయాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నాకు అన్నయ్య లాంటి యాకూబ్ నా మీద నమ్మకంతో రాయమన్నప్పటి నుంచి ఈ ప్రశ్నలు నిద్రపోనీయలేదు. కవితా విమర్శ జోలికి పోయే కన్నా, ఉర్దూ కవులను వారి కవితలను పరిచయం చేయడం మంచిదని భావించాను. కవితా విమర్శ చేయగల స్థాయి నాకు లేదు. ఉర్దూ కవుల్లో ఎవరి నుంచి మొదలుపెట్టాలి? గాలిబ్, జౌఖ్, మీర్, ఇక్బాల్... మహామహుల్లాంటి కవులు ... కవిసంగమంలో ఎవరి కవిత్వాన్ని ముందుగా పరిచయం చేయాలి? ఉర్దూ కవిత్వ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితలే నా కళ్ళ ముందు కనబడతాయి. అవిభక్త భారతదేశంలో ప్రగతిశీల రచయితల సంఘం (తరఖ్ఖీ పసంద్ ముసన్నఫీన్)కు చెందిన కవిగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఉర్దూ సాహిత్య పుటలపై తనదైన ముద్రవేశారు.
ఫైజ్ అహ్మద్ ఫైజ్ తో ప్రారంభించాలనే నిర్ణయించుకున్నాను. ప్రతి శుక్రవారం ఫైజ్ కవితలను, వాటి అనువాదాన్ని, వివరణను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. వరుసగా ఉర్దూ కవుల కవితా కుసుమాలు కవిసంగమంలో విరబూయించడానికి చేసే కృషిలో ఏవయినా పొరబాట్లు దొర్లితే, కవిసంగమంలో పిల్లకాకి లాంటి వాడిని కాబట్టి క్షమించాలి. ఇక ఉపోద్ఘాతం చాలించి, విషయానికి వచ్చేద్దాం. ఫైజ్ కవితలు పరిచయం చేసే ముందు క్లుప్తంగా ఫైజ్ గురించి నాలుగు ముక్కలు మాట్లాడుకుని, ఆ తర్వాత ఆయన కవితలు చూద్దాం. ఫైజ్ అహ్మద్ ఫైజ్ 1911లో పాకిస్తాన్లో ఉన్న సియాల్ కోట్ లో జన్మించారు. ఉన్నతి విద్యాభ్యాసం తర్వాత కొంతకాలం లెక్చరర్ గా పనిచేసి 1942లో సైన్యంలో కెప్టెన్ గా చేరారు. 1951లో రావల్పిండి కుట్ర కేసులో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. 1955లో విడుదలయ్యారు. 1984 నవంబర్లో లాహోర్ లో మరణించిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ తన జీవితకాలంలో రెండు ప్రపంచయుద్ధాలు చూశారు, అవిభక్త భారతదేశంలో రాజకీయాలను, దేశవిభజనను, బంగ్లాదేశ్ ఏర్పాటును చూశారు. ఎలాంటి నిరాశాజనక వాతావరణంలోనైనా ఆశాదీపాన్ని వెలిగించే ఫైజ్ కవితల్లో... ఆయన జైల్లో ఉన్నప్పడు రాసిన – జైలులొ ఒక రాత్రి- ఇప్పుడు చూద్దాం.
జైలులో ఒక రాత్రి
చీకటి పొదల్లో నక్షత్రాల దారుల్లో దట్టమైన రాత్రి నెమ్మదిగా దిగుతోంది పిల్లతెమ్మెర నన్నుతాకి వెళుతోంది ప్రేమపలుకేదో గుసగుసగా చెబుతోంది ఖైదు పెరట్లో దేశబహిష్కృత వృక్షాలు ఆకాశం చీరకు నగిషీలు అద్దుతున్నాయి గగన గవాక్షంలో ఉదారంగా ప్రకాశిస్తంది వెన్నెల సుందరహస్తం తారామండల వెలుగురవ్వలు ధూళిలో కరిగిపోయాయి ఆకాశం నీలి రంగు తేజస్సులో కలిసిపోయింది గుండెలో ప్రేయసి వేర్పాటు బాధా కెరటాల్లా పచ్చని మూలల్లో దట్టమైన నీడలు రెపరెపలాడుతున్నాయి మనసులో నిరంతరం ఒకే భావం కదలాడుతోంది ఈ క్షణం జీవితం ఎంత తీయగా ఉంది దౌర్జన్య విషాన్ని కలిపేవారు నేడు సఫలం కావచ్చు, రేపు కాదు. సమాగమ మందిరంలో దీపాలను వారు ఆర్పేసినా చంద్రుడిని ఆర్పగలరా?
ఈ కవిత ఫైజ్ అహ్మద్ ఫైజ్ జైల్లో ఉన్నప్పడు, కమ్యునిస్టు అనబడే ప్రతి ఒక్కడిని కుట్ర కేసులో ప్రభుత్వం అరెస్టు చేసి నిర్బంధించిన పరిస్థితిలో రాశారు. దుర్భరమైన అణిచివేతను ఎదుర్కుంటూ కూడా మొక్కువోని ఆత్మధైర్యాన్ని, ఆశాభావాన్ని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఉర్దూ కవితను తెలుగులో రాయమని చాలా మంది మిత్రులు అడిగారు. వారి కోరిక ప్రకారం ఉర్దూ కవితను కూడా ఇక్కడ ఇస్తున్నాను.
షామ్ కే బీచో ఖమ్ సితారోం సే జీనా జీనా ఉతర్ రహీ హై రాత్ యుం సబా పాస్ సే గుజర్ తీ హై జైసే కహ్ దీ కిసీ నే ప్యార్ కీ బాత్ సహన్ జందా కే బేవతన్ అష్ జార్ సరంగోం మహూ హైం బనానే మేం దామనె ఆస్మాం పే నక్షో నిఖార్ షానె బామ్ పర్ దమక్ తా హై మహర్బాం చాందినీ కా దస్తె జమీల్ ఖాక్ మేం ఘుల్ గయీ హై ఆబె నుజూమ్ నూర్ మేం ఘుల్ గయా హై అర్ష్ కా నీల్ సబ్జ్ కోషోం మేం నీల్గోం సాయే లహ్ లహాతే హైం జిస్ తరా దిల్ మేం మోజె దర్దె ఫరాఖ్ యార్ ఆయే దిల్ సే పైహమ్ ఖయాల్ కహతా హై ఇతనీ షీరీన్ హై జిందగీ ఇస్ పల్ జుల్మ్ కా జహర్ ఘోల్ నే వాలే కామ్రాం హో సకేంగే ఆజ్ నా కల్ జల్వా గాయే విసాల్ కి షమేం ఓ బుఝా భీ చుకే అగర్ తో క్యా చాంద్ కో గుల్ కరేం తో హమ్ జానేం
ఈ కవితలో – మహర్బాం చాందినీ కా దస్తే జమీల్ – అన్న పంక్తి చాలా గొప్పగా రాశారు. మహర్ అన్న పదానికి చంద్రుడు అన్న అర్ధం కూడా ఉంది. మహర్బాం అంటే దయచూపినవారని అర్ధం. మహర్బాం చాందినీ అనడంలో ఉదారుడైన చంద్రుడి వెన్నెల అన్న భావం స్ఫురిస్తుంది. భాషపై తిరుగులేని ఆధిపత్యం, పదునైన ఊహాశక్తి ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు సాధ్యం.

                                                                                                                                                           అబ్దుల్ వాహెద్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి