మళ్ళీ శుక్రవారం పరుగెత్తుకుంటూ వచ్చేసింది. ఈ సారి నేను కూడా ఎదురుచూస్తూనే ఉన్నాను. ఈ వారం ఎవరి గురించి రాస్తున్నావని ఒక మిత్రుడు అడిగారు. ఫైజ్ గురించే రాస్తాను, ఈ వారమే కాదు మరి కొన్ని వారాలు కూడా ఆయన గురించే రాస్తానన్నాను. దీనికి కారణం లేకపోలేదు. తెలుగు వారికి తెలిసిన ఉర్దూ కవులు తక్కువ. గజల్ పట్ల అభిమానం ఉన్న వారు తప్ప మిగిలిన తెలుగు పాఠకులకు ఉర్దూ కవుల గురించి పెద్దగా తెలియదు. తెలిసిన పేర్లలో కూడా గాలిబ్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఉమర్ ఖయాం పేరు కూడా వినబడుతుంది,కాని నిజానికి ఆయన ఉర్దూ కవి కాదు. ఆయన కవిత్వం ఉర్దూలో తర్జుమా అయ్యింది. తెలుగు వారికి చాలా తక్కువ తెలిసిన పేరు ఫైజ్, భారత ఉపఖండం రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న కాలంలో గొప్ప కవిత్వం రాసిన కవి ఆయన. ఈ వారం ఫైజ్ గురించి మరి కొన్ని వివరాలు అందించి, వచ్చే వారం నుంచి ఆయన కవితలు మరి కొన్ని ఎక్కువగా పోస్ట్ చేయాలనుకుంటున్నాను.
ఫైజ్ అహ్మద్ ఫైజ్ ప్రతి సందర్భంలోను కవిత రాశారు. చాలా ఎక్కువగా రాశారు. ఏడు కవితా సంపుటాలు ఆయన పేరున ఉన్నాయి. ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు. రాజకీయాల పట్ల లోతయిన అవగాహన ఉన్న వ్యక్తి. గతవారం చెప్పుకున్నట్లు ట్రేడ్ యూనియన్లలో ఉన్నరు. సామ్యవాద భావాల పట్ల ప్రభావితులయ్యారు. ప్రగతిశీల రచయితల వేదిక అప్పట్లో సామాజిక అంశాలన్నింటిపై ప్రతిస్పందించేది. అందులో అత్యంత చురుకైన వ్యక్తి ఫైజ్.
ఫైజ్ రాసిన కవితా సంపుటాల్లో మొదటిది నక్ష్ ఫరియాది (ఫిర్యాదు చేస్తున్న చిత్రం). నిజానికి ఇది గాలిబ్ కవితలోని ఒక పంక్తిలోని పదబంధం. దాన్నే ఫైజ్ తన కవితకు వాడుకున్నారు. ఆ కవితా సంపుటం అదే పేరుతో వచ్చింది. అమృతసర్ లోని ఎం.ఏ.ఓ. కళాశాలలో అధ్యాపకుడిగా చేరిన కొత్తలో రాసిన కవితలివి. 1941లో ఈ సంపుటం అచ్చయ్యింది. సాధారణంగా కవులందరి మాదిరిగానే ప్రారంభంలో రాసిన కవితలు ప్రేమ కవితలే. కాని ఈ సంపుటంలో తర్వాత తర్వాత రాసిన కవితల్లో ప్రేమ, విప్లవ భావాలు కలగలిసి కనబడతాయి. ప్రేమ విరహ బాధలే కాదు ప్రపంచ బాధలు కూడా పంక్తుల్లో ఉన్నాయి. ప్రారంభంలో రాసిన కవితలు ఒకవిధమైన స్వాప్నిక ఊహలను ప్రతిబింబిస్తాయి. మేరే నదీమ్, హుస్న్ ఔర్ మౌత్, ఆజ్ కీ రాత్ ఇలాంటి కవితలే. ఫైజ్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కళాశాల వైస్ ప్రిన్సిపల్ మహ్ముదుజ్జఫర్, ఆయన భార్య రాషిదా జహాన్ ఇద్దరు కమ్యునిస్టు పార్టీలో క్రియాశీల సభ్యులుగా ఉండేవారు. వారిద్దరి ప్రభావం వల్ల ఫైజ్ సామ్యవాద సిద్దాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడు. సామ్యవాద ప్రభావం ఆయన రాసిన కవిత – ముజ్ సే పహలీ సీ ముహబ్బత్ మేరే మహ్ బూబ్ నా మాంగ్ (ప్రియా, మునుపటి ప్రేమను ఇప్పుడు కోరవద్దు)లో స్పష్టంగా కనబడుతుంది. తన ప్రేయసి అద్భుత సౌందర్యంతో కళ్ళు తిప్పుకోలేక పోతున్నప్పటికీ, తాను ప్రపంచంలోని కష్టాలను కూడా చూడక తప్పదని అంటాడు. ఈ కవితా సంపుటిలోని ఇతర కవితలు తర్వాత అనేక ఉద్యమాల్లో ప్రేరణ గీతాలయ్యాయి. సంకెళ్ళు, శృంఖలాలు, నిర్బంధాలు ఉన్నప్పటికీ గొంతెత్తాలని నినదించిన కవిత .. బోల్ కె లబ్ అజాద్ హైం తేరే, బోల్ జుబాన్ అబ్ తక్ తేరీ హై (చెప్పు, నీ పెదాలు స్వేచ్ఛగానే ఉన్నాయి, చెప్పు, నీ నాలుక ఇంకా నీదే)లో రాసిన పదాలు భారత పాకిస్తాన్ లలో అనేక నిరసర ఉద్యమాల్లో ప్రతిధ్వనించాయి.
మోజూయె సుఖన్ కవితలో ఒక కవి ఆలోచించవలసిన విషయాలేమిటో ముక్కుసూటిగా చెప్పేశాడు. ప్రేయసి కురుల మృదుత్వం, గోరింటాకు చేతుల లాలిత్యం గురించి ఆలోచించాలా లేక ఆదమ్ ఈవ్ సంతానం (మానవాళి) ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కుంటున్న కష్టాలు కడగండ్ల గురించి ఆలోచించాలా అని ప్రశ్నించాడు. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న ఆకలి, దారిద్ర్యం, దౌర్భాగ్యాలను ప్రశ్నించడం కవుల పని కాదా అని నిలదీశాడు.
ఫైజ్ కవిత్వం ఉద్యమాల ఉప్పెన. ఆయన జీవితం కూడా ఉద్యమాలలోనే గడిచింది. ప్రేయసి చుట్టు తిరిగే కవిత్వాన్ని మనిషి చుట్టు తిప్పిన కవి ఫైజ్.. అందుకే ఫైజ్ గురించి మరి కొన్ని వారాలు కొనసాగిద్దాం..
ఇప్పుడు ఫైజ్ రాసిన ఒక కవిత చూద్దాం.
ప్రియా, మనుపటి ప్రేమను నా నుంచి కొరవద్దు
నీవుంటే జీవితం శాశ్వతంగా ప్రకాశిస్తుందని
ఎల్లప్పుడు అనుకున్నా
ప్రేమబాధ నాదే అయినప్పడు, ప్రపంచబాధ గొడవెక్కడ
నీ నగుమోము ప్రపంచంలో వసంతాన్ని విరజిమ్ముతుంది
నీ కళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకేముందని?
నీవు దొరికితే అదృష్టం నా అడుగులకు మడుగులొత్తుతుంది
కాని అలా కాదు, అలా కావాలని అనుకున్నానంతే...
ప్రపంచంలో ప్రేమే కాదు, ఇంకా దు:ఖాలున్నాయి
ప్రేమికుల కలయికే కాదు, ఇంకా సంతోషాలున్నాయి
శతాబ్ధాలుగా విస్తరిస్తున్న నల్ల మంత్రజాలం
సిల్కు, శాటిన్, బంగారు దారాలతో అల్లుకుంటోంది
అబ్దుల్ వాహెద్
October 25/2013
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి