పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, అక్టోబర్ 2013, బుధవారం

కవిత్వంతో ఏడడుగులు




కవిసంగమం మిత్రులకి,


కవిత్వం ఒక మహాప్రవాహం. ప్రతి నాగరికతా నీటిప్రవాహాన్ని ఆనుకునే విలసిల్లినట్టు, ఈ కవిత్వం చెమ్మ ఎండిపోకుండా ఎవరు పదిలంగా ఉంచుకుంటారో వారిదగ్గర తప్పకుండా సంస్కారానికి ఆశ్రయం దొరుకుతుందని నా నమ్మకం. అసలు ఏ కవిత్వపు గాలీసోకకుండా మనిషిజీవితము ఉండదంటే అతిశయోక్తి కాదు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసః ఫణిః లో సంగీతానికి ఆసరాగా ఉన్నది ఈ కవిత్వమే. అది అందీ అందకుండా గొంతులోకొట్టాడుతుంటుంది. దొరికినట్టు దొరికి తప్పించుకుంటుంది. అది అనుభూతికి చిక్కినంతగా పాఠకుడి మాటకి చిక్కదు. ఒక్కోసారి కవికే చిక్కదు. ప్రతి కవితా క్రికెట్ ఆటలో ఇన్నింగ్స్ లాంటిది. స్కోరు ఎప్పుడూ సున్నాతోనే ప్రారంభం అవుతుంది... అంతకుముందు ఎన్ని సెంచరీలు చేసినా. ప్రతి కవీ ప్రతి సారీ తన కవితతో మెప్పించాలి తప్ప అంతకుముందు మంచికవితలు రాసినంత మాత్రంచేత తర్వాత రాసేవన్నీ మంచికవితలే రాస్తాడని హామీలేదు. అది షేక్స్పియర్ అయినా కాళిదాసయినా, మరో యువకవి అయినా ఒక్కటే. అలాగే మనం చేసే విమర్శలుకూడా మాటాడుకుంటున్న కవితకే పరిమితం తప్ప కవివ్యక్తిత్వంతోగాని, గత చరిత్రతోగాని ఏ రకమైన అనుబంధము లేకుండా చెయ్యాలి.

ఈ సందర్భంలో నాకు గుర్తొచ్చింది "సాప్తపదీనం సఖ్యం" అన్న పెద్దల మాట. ఏడడుగులు నడిస్తే స్నేహం ప్రారంభమవుతుందట. అలాగ వివిధ దేశాల కవులతో, వారి కవిత్వంతో చెయ్యబోయే స్నేహం ఈ శీర్షిక. మన ముందు తరాలలో వచ్చిన కవిత్వం మనకు తెలియడం వల్ల ఒకటి కవిత్వం దేన్నంటారో నిర్వచనం ఇచ్చేకంటే ఉదాహరణ ద్వారా చూపడం సులువవుతుంది; రెండవది మనకు ఎంత మంచి వారసత్వం ఉందో తెలుస్తుంది. ఇక్కడ 'మన ' అంటే విశ్వనరులుగా 'మన ' అనే అర్థం. మన మాతృభాష, దేశభాషలు కాదు. యావత్ మానవజాతి సాహిత్యం అంతా మనదే. మనం తెలుసుకోవలసినదే. లాభం పొందవలసినదే. నాకున్న భాషాపరమైన పరిమితులమేరకు, అవగాహనమేరకు ఈ నడక ప్రారంభిస్తున్నాను. ఇది ఒక వీక్లీ వాక్. ఒక్కడే నడిస్తే త్రోవ కష్టంగా ఉంటుంది. తోడుంటే ఎంతదూరమైనా అలసటలేకుండా ప్రయాణించొచ్చు.. కనుక తోడురావలసిందిగా మిత్రులందరికీ వినయపూర్వక ఆహ్వానం.


                                                                                                                         ______నౌడూరి మూర్తి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి