నన్ను నింపావు నీలంగా
నాతో నిన్ను రాసేందుకు..
మదిలో పొంగిన భావాన్ని
మెదడు నరాల్లోకి లాగి
మనసు భావాన్ని
మనుషభాషకు తర్జుమా చేసి
చెయ్యి కదిపావనుకున్నా
నా నాల్క తెల్లటి నేలపై
నీలం ముత్యాలు రాల్చింది
నీకు ఆనందం..నాకు పరమానందం
నీకు నేనుపయోగపడుతున్న విధం
నీలో ఆశచావలేదనుకున్నా
నీ తీరు మారలేదనుకున్నా
ఇంకొన్ని పొంగిన భావాలు
నానుండి జాలువారిన ముత్యాలు
నీవు నింపుతున్నావు
నేను కక్కుతున్నాను
అదే పనిగా..అదే తీరుగా
నువ్వు ఙ్ఞానివనుకున్నా
మనసులో నీకు కోటి దండాలన్నా
కాలం కదిలింది వేగంగా
నీ చెయ్యి కన్నా కొంచెం వడిగా
నాకు వీలు దొరికింది
నీ లోకం పోకడ చూసే విధంగా
నీకు తెలియలేదు కానీ
నా ఆనందం ఆవిరయ్యింది
నా మనసు బడబాగ్ని మధ్య
నేరాల్చిన అక్షరాలు నవ్వాయి
నా కన్నీళ్ళ మధ్య
నీ ప్రపంచం ఇదా?
నీ అసలు తీరిదా?
రాల్చేందుకే కానీ
అవి నీ మదినుండి కాదని
నీ చెయ్యి రాసేందుకే కానీ
చేసేందుకు కాదనీ
తనివితీరా ఏడ్వాలనుంది
మళ్ళీ కలాన్నై పుట్టరాదని
ఉరేసుకోవాలనుంది
నాతో ఓ సూడో ప్రపంచాన్ని సృష్టిస్తున్నానని!! 08SEP12
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి