అపశకునాని వంటూ
అనంతకోటి
ధనుస్టంకారావాలు
అంతరంగాన్ని
అదేపనిగా
తరుముతున్నప్పుడు
జన తుఫానులో
వొంటరి చెట్టులా
తెగిన గట్టులా
కరిగిన పుట్టలా
విరిగిన నిచ్చెన మెట్టులా
విషాదం చుట్టుకొని
తన సగానికి అమ్మ
తనకు అత్తయు
మాటల కత్తులు
కోళ్ళ పైనో కుక్కల పైనో
విసిరేస్తూ
నొసలు చిట్లిస్తూ
అసలు వాడి తనాన్ని
తనపైకి సందిస్తున్నప్పుడు
చేయని తప్పుకు
అలుగుపడ్డ
అశృనయనాలతో
ఆశల శవాలను మోస్తూ
అర్హత అంతస్తుకు
దారులు వెతుకుతూ
అమ్మాయు
అమ్మవ్వాలని
నె
లా
ఖ
రి
రోజు
కోసం
వేల ముడుపులతో
వేచివున్నప్పుడు
కడుపులో వున్న
అగ్నిపర్వతం బద్దలై
ఎర్రని లావా వెదజల్లినప్పుడు
శూన్యం విశ్వరూపాన్ని ప్రదర్శించి
భయంకర నిశ్సబ్ద యుద్దం ప్రకటించి
చీకటి శరాలు శరీరం నిండా నాటినా
వేల టన్నుల వత్తిడి మోస్తూ
మళ్ళీ నెలాఖరి రోజుకోసం
నిరీక్షిస్తూనే వుంటుంది ఆమె
తప్పు ఆమెది కాదని తెలిసినా
ఫస్టు తారీఖు ఫోజుతో
మీసాలు మెలేస్తూనే వుంటాడు వాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి