పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

రావి రంగారావు // గుర్రాలను మోస్తున్న మనుషులు //


ఈ రోజు మనిషి
రోడ్డు మీద నడుస్తున్నా
ఏదో రూపాయల కట్ట దొరుకుతుందనే,
గునపంతో నేలను తవ్వినా
ఏదో లంకెల బిందెలు దొరుకుతాయనే,
ఆకాశంలో వెళ్తున్నా
ఏ కల్పతరువో అందుతుందనే,
మబ్బులు కమ్ముకువస్తుంటే
ఏవో బంగారం బిళ్ళలు కురుస్తాయనే ...
మనిషి కిప్పుడు వెయ్యి కళ్ళయినా చాలవు-
దేహకణా లన్నీ కళ్ళయితే ఎంత బాగుణ్ణు...

మనిషి మెదడు గురించి
పరిశోధిస్తున్న అమాయకులారా,
ఏ కణం వెతికినా
ఊడిపడేది సంపదల కోరికలే...

ఊళ్లో హత్యలు మానభంగాలు...
అందరూ నిద్రపోతున్నారు-
మేలుకొలపడం నా వల్ల కావడం లేదు-
ఇంతలో ఓ రూపాయి బిళ్ళ జారి కింద పడేసరికి
జనం లేచి ఒకటే వెతుకులాట...

మురికి నగర మైనా
విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నట్లు
ప్లాస్టిక్ బొమ్మలు కూడా
పచ్చనోట్ల వెలుతురు తగిలితే చాలు-
తుమ్మెద వరుడికి
అవే సౌగంధిక పుష్పాలు,
మధువు లేకపోయినా సరే,
పరిమళాలు పట్టుబడకపోయినా సరే...

డబ్బు చెట్ల నూడ్చి
కోసుకొచ్చుకొన్న రూపాయల “కొమ్మ”లతో
చక్కగా కాపురం చేయాల్సినవాళ్ళు
ఇంకా అధికఫలాలు కావాలని ముసలి చెట్లను వేధిస్తున్నారు,
గుడ్ల నీరు కుక్కుకుంటున్నాయి కాపు లేని చెట్లు,
ఉరితాటికి చిక్కుకుంటున్నాయి దిక్కు లేని కొమ్మలు...

సమాజం త్రాసులో
ఒక పల్ల్లెంలో సరస్వతిని
మరో పళ్ళెంలో పచ్చనోట్లు పెడితే
రూపాయల బరువే ఎక్కువని తేలిపోయింది,
సరస్వతిని నమ్ముకున్న సు”బుద్ధి”
రోడ్డుమీద దీనంగా పడిపోయింది...
సరస్వతి మెడకు తాడు కట్టి
పబ్లిగ్గా ఈడ్చుకుపోతున్న నోట్లకట్టలు,
దారి సుగమం చేస్తున్న పెద్దల పొట్టలు...

నిన్నటి దాకా సిగ్గుతో దూరంగా
ఎక్కడో పడివుండేది ఈ చీకటి కొండ,
ఇపు డీ కొండకు కాలం
డబ్బుతో పోసింది ప్రాణం,
ఏనుగులా లేచిన కొండ
దేశం మీద పడి దూకటం మొదలుపెట్టింది,
విద్యాలయాలను తొక్కుతోంది,
దేవాలయాలను గుద్దుతోంది,
మనిషికి మూడో కన్ను ప్రసాదించే
గ్రంథాలయాలను కుమ్ముతోంది...

డబ్బు గుర్రాన్ని ఎక్కి
విజయ విహారం చేయాల్సిన మానవుడా,
గుర్రాన్ని నీవే నెత్తి కెక్కించుకొని
మహానందంగా మోస్తున్నావా,
ఇప్పుడు కాకుంటే రేపటికైనా
ఆ గుర్రం తన్నక మానదు,
నీ తల పగలక తప్పదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి