పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

జగద్ధాత్రి || ఆట విడుపు ||


అవును నిజమే
అప్పుడప్పుడూ అట విడుపు కావాలి
అహరహమూ ఆడుతోన్న
అవిశ్రాంత జీవితపు ఆటనుండి ఆట విడుపు కావాలి
ఆట తప్పని సరైనా
ఆట విడుపు లేకుంటే
అలసిపోతాము....
ప్రతిరోజూ ఓ పరికరంలా
పని చేసే దేహాన్ని
అనుక్షణం ఆలోచనలతో
వేడెక్కిన మేధో కర్మాగారాన్ని
మనకోసం సాగించే
మర లాంటి మనుగడనీ
అప్పుడప్పుడూ విశ్రమించనియ్యాలి
అనుదిన ఆర్భాటాలనుండి
స్వార్ధపు సుఖాల నుండి
ఓ అడుగు పక్కకు వేసి
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా గమనించాలి...

అప్పుడే...
అనంత మైన ఈ భూగోళంలో
మనమెంత అణువులమో తెలుస్తుంది
మన సంకుచిత పరిధులు దాటి
మనకూ ఓ బాధ్యత ఉందన్న
ఎరుక కలుగుతుంది
మనదైన ఒక ముద్ర
చరిత్ర లో మిగాల్చాలన్న
స్పృహ కలుగుతుంది

అప్పుడు.....
ఆలోగోరే ఘోషిస్తోన్న
గ్లోబల్ వార్మింగ్ గురించి
ఏమి చెయ్యాలో ఆలోచిస్తావు
పాలస్తీనా లోని పాలుగారే పసిపాపల
బుగ్గల కన్నీటి చారికలు
నిన్ను నిలువునా కదిలిస్తాయి
అంటార్క్టిక లో కరుగుతోన్న
మంచు పర్వత శ్రేణులు
నీకు పర్యావరణ పరిరక్షణ
కర్తవ్యాన్ని బోధిస్తాయి
భవిష్యత్ నిర్మాతలు కావాల్సిన భావి పౌరులు
ఆటవికతకు ఆనవాళ్ళుగా
ఎలా విజ్రుంభిస్తున్నారో
అవలోకిస్తావు
గుజరాత్ గుండెల్లో
ఆరని గోద్రా మంటలు
నందీగ్రాం, ముది గొండ ప్రేలుళ్ళతో
ప్రతిధ్వనించే తూటాల శబ్దాలు

నీ చుట్టూ విలయ తాండవం చేస్తోన్న
సమస్యలేమైనా ............
అకాలంగా రాలుతోన్న
శవాల వర్షాలు
సమాధానాలే లేని ఇరుగు పొరుగు దేశాల
పీటముడి ప్రశ్నలు
నీదైన మాటను
నమోదు చేయమంటాయి
నీదైన ప్రతిస్పందనను కోరుతాయి
ఆటవిడుపు అంటే విశ్రాంతి కాదు
ఆత్మావలోకనం

నీ జీవితపు ఆట నుండి
ఒకింత బయట పడి
నిస్వార్ధంతో
నీ కింకర్తవ్యాన్ని
చేపట్టగలగడానికి
సమాలోచన చెయ్యగలిగే
సంసిద్ధతా ప్రయత్నం
ఎంత గొప్పగా ఆడినా
బతుకాటలో వృద్ధాశ్రమం
నీ చివరి పెవీలియన్
ఒంటరితనం మాత్రమే
నువ్వు సాధించుకునే
అక్కరకు రాని నీ "లైఫ్ ట్రోఫి "

జీవితం ముఖ్యమే
కానీ అయువుతో ఉన్న నలుగు ఘడియలు
సమసమాజ నిర్మాణంలో
నీవు కూడా ఓ ఇటుక వైతే
సామాజిక సమస్యా పూరణంలో
నీవూ ఓ కరబంధమైతే
జన్మ సార్ధకతను పొంది
మనిషిగా మనుషుల
మనసులలో మరుసటి
తరాలకు నిలుస్తావు !!

ఆట విడుపు అంటే విరామం కాదు
విశ్వ శాంతి ప్రపంచ కప్ సాధించడానికి
మానవత్వపు జట్టు
ఆటగాళ్లుగా మన మందరం
తర్ఫీదు పొందే
సార్ధక సమయం....!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి