పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

క్రాంతి శ్రీనివాసరావు ||1975..ఓ పోరాటగాధ ||


మా వూరి మర్రి చెట్టుపై
అర్ధ రాత్రి
మందారం పూసిందని
కాఖీలు కాలువల్లా ప్రవహించాయు

తుపాకీ గొట్టాలు
తూరుపు మొక్కలను
పసిగట్టాయు

తెల్లవార్లూ
లాఠీలూ ఎముకలూ
మాట్లాడు కొంటూనే వున్నాయు

సగం వూరు
నిద్రపోకుండా
ఆ పైశాచిక భాషను
అనువదిస్తూనే వుంది

తల్లి పేగును మాత్రం
తప్పుడు తర్జమాలతో
వోదారుస్తూనే వుంది

సూరీడు పదోసారి
పరామర్శిస్తున్నప్పుడు

వూరంతా కలసి
ధర్మంగా వేసిన
చర్మం మూటలను
వేడి కన్నీళ్ళతో
కాపడం పెట్టుకుని
కాపాడుకుంది

రోజంతా పారే
చీకటి వరదల్లో
కన్నుల్లో నిద్రంతా
కొట్టుకుపోతూనే వుంది

ఎవడో చేసే
వీరణం మోతలకు
మరెవడిదో
వీపు వాతలుతేలుతూనే వుంది

పోలీసు పాలనలో
వూరు పొలిమెర మరచి
చానా కాలమయ్యుంది

జతగాని కోసం
రోజూ ఎదురు చూపులే
మిగులుతున్నాయు
నా లేగ కళ్ళకు

ఆ రోజు నే నెప్పటికీ మరచిపోలేను
హటాత్తుగా ఎదురయున
భయ్యా బియ్యాబాని
సకల జీవులను
తాకి పలకరిస్తూ
షిరిడీ సాయులా

కాలం దింపిన మేకులతో
శిలువ వేసిన ఏసుక్రీస్తులా

అందరిలానే నన్నూ చూసి
నేనెవరో తెలియనట్లు తప్పుకొని
చుట్టూమూగిన చిన్నపిల్లలతో
సమావేశం పెట్టి
చిట్టీలు పంచుకొంటున్నాడు

ఎమర్జెంసీ
మావూరి కిచ్చిన బహుమతి
బియ్యబాని సాక్షిగా
ఇప్పుడు మావూరినిండా
మందారాలు విరబూస్తున్నాయు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి