దీపావళి పండుగ ఊరంతా లేచింది బారెడు పొద్దెక్కింది.
పక్కింటి పిల్లలు తుపాకీ తో బిళ్ళలు కాలుస్తూ
నోటితో డిష్యుం డిష్యుం అని సందడి చేస్తున్నారు.
ఉలిక్కిపడి లేచింది పుట్టింటికొచ్చిన ఆడపిల్ల
ఇంత మొద్దు నిద్దర పోయానేంటా అనుకొంటూ...
నిజమే మరి...... పదివేలిచ్చి
పాలేరు కుటుంబాన్ని పెట్టుకొన్నా
కళ్ళాపి తానే చల్లుకొనే అమ్మ
గాజుల చేయి వాలిపోయిందిగా
పండగంతటినీ ముంగిట ముగ్గుగా తీర్చే
అచ్చ తెలుగు అల్లిక ఆపట్నే ఆగిపోయిందిగా...
సూర్యునికంటే ముందే లేచి చేదబావి దగ్గర
ఓ బిందెడు నీళ్ళు కుమ్మరించుకొని
"శ్రీ సూర్య నారాయణా వేదపారాయణా
లోక రక్షామణీ దైవ చూడామణీ..." అంటూ
ఆదిదేవుణ్ణి నిద్రలేపుతూ తడిపొడి అడుగులతో
ఇల్లంతా మెట్టెల సందడించే పచ్చని పాదాలు
సుదూర తీరాలకు చేరిపోయాయిగా...
ముసుగెట్టిన మేం నిదుర లేవాలని రేడియో ఆన్ చేసి
భక్తి రంజని పెట్టే తలపులారిపోయాయిగా
"అత్తింటినుంచి అలిసి వచ్చింది నా కూతురు
ఆదమరచి నిదురపోనీ లేపకు " అంటూ నాన్నగారు
అమ్మని మందలించే అవసరం కూడా లేదు
"పండుగ పూట ముస్తాబయిన మహలక్ష్మిలా
నట్టింట తిరగాలి ఆడపిల్లలు... పద్మా ఇక లేమ్మా"
అనే అమ్మ మేలుకొలుపు ఆగిపోయిందిగా...
సిటీ కల్చరంటూ సంప్రదాయాలు వదిలేస్తే ఎలా
అంటూ గోరింటాకు కోసి రుబ్బి చేతులు పండించే
అమ్మ వన్నెలు వెలిసిపోయాయిగా...
అందుకే నాకిక పొద్దున్నే మెలుకువ రా(లే)దు...........
ఆదమరపు లేని అమ్మకై కలల్లో నా వెతుకులాటా పోదు.....
04september2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి