నేను ఈ మట్టిలోనే పుట్టాను
ఈ మట్టిలోనే పెరుగుతున్నాను
చివరకు ఈ మట్టిలోనే కలసిపోతానూ
నేను ఈ దేశ పౌరున్ని
అయినా...
నన్ను పరదేశిగానే చూస్తుంది ఈ హైందవం
ఎక్కడ అల్లర్లు,అల్లకల్లోలాలు జరిగిన అందరి కళ్ళు నా పైనే
ఎక్కడ బాంబులు పేలిన అందరి వెళ్ళు నా వైపే
మతోన్మాదం మదమెక్కిన ప్రతిసారి
ఆ మంటల్లో నేను మాడిపోతున్నాను
"కమలం" వికసించిన చోటల్లా
నా మృతదేహంపై కప్పనీకి కొత్త కఫన్ తయారవుతుంది
జిన్నా చేసిన కుట్రకు
నా జిందగీ బర్బాద్ కావట్టె
గజినీ గుళ్ళు దోసినందుకు
నా గళ పిసికి సంపవట్టే
భారత్,పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే
నీ మద్దతేటు అని అడిగాడు మిత్రుడొకడు
చాల దినాల తర్వాత కలసిన దోస్తు గదా అని
గాలే మిలయించబోతే గుండెల్లో త్రిశూలం గుచ్చుకుంది
ఈ నేలంతా వేదభూమి అని చెప్పేటోల్లంత
వేదాలు రాసిన ఆర్యులు పరదేశియులని గుర్తెరగట్లెదు
నా కళ్ళ ముందే తల్లిని,చెల్లిని
పాడుచేస్తున్న ఏమి చెయ్యలేని నిస్సహాయుణ్ణి
కడుపులోంచి పిండాన్ని బయటకు తీసి
త్రిశూలానికి కుచ్చి మంటల్లో మాడుస్తున్నా
అడ్డుకోలేని అసహయున్ని
మనువాదపు అంటారని మంటల్లో కాలుతున్న
మూలవాసులకు గుండెకు హత్తుకున్నవాన్ని
గలే మిళాయించిన సూఫినీ
భారత స్వాతంత్ర సంగ్రామంలో
మౌలానా అబుల్ కలం ఆజాద్ ని
సరిహద్దు గాంధీ గఫార్ ఖాన్ ని
సరే జహాసే అచ్చా మహ్మద్ ఇక్బాల్ ని
నిజాంపై కలం దూసిన షోయబుల్ల ఖాన్ వారసున్ని
బందగికి తమ్మున్ని
అరవై తొమ్మిది తెలంగాణా ఉద్యమంలో తోలి అమరున్ని
రాజకీయ నాయకుల ఓట్ల రాజకీయాలకు బలౌతున్నవాన్ని
జనాబా లెక్కల ప్రకారం నేనీదేశ పౌరున్ని
అయిన నా దేశంలో నేను పరదేశిని
నేల నేలంతా నెత్తురుతో తడిపిన వాణ్ని
ఈ త్రివర్ణ పతాకం నా నెత్తురుతో తడిసి ఎన్నడో ఎరుపెక్కింది
అందరి ముందు అరచి చెప్తున్నా
జరా చెవులు పెద్దగ చేసి ఇనుండ్రి
నేను ముసల్మాన్ నే
దానికి ముందు స్వచ్చమైన భారతీయున్ని
(మతోన్మాద మంటల్లో మాడిపోయిన,అస్సాంలో అసువులు బాసిన ముస్లిం సోదరులకు)
*04-09-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి