పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, జులై 2012, శనివారం

జయశ్రీ నాయుడు || మనసు పతంగం ||

ఆకాశం లో మబ్బుకీ..
నేలమీద గరిక కీ..
నడుమ గిరికీలు కొట్టే
పతంగం మనసు..

పంతం వస్తే..
నామాటకూడా వినదు..
అసలు మాటకూ..
మనసుకూ పొంతన
అనాది నుంచీ గగన కుసుమమే..

అరచేతిలో అన్నీ ఇమడాలి
అరక్షణం చాలదా అంటుంది
తలపుల్లో తలుపులే వుండవు..
దూసుకుపోయే తోక చుక్క మరి..

వజ్రం ఇచ్చినా..
వద్దని విసిరేసే
విరజాజిని చూసి
మురుస్తుంది..
వలపు కలలు కళ్ళ నింపుకుని
వాన లో తడుస్తుంది..

ప్రేమని పరిమళించినా
నువ్వని కలవరించినా
నీ కౌగిట్లో అన్నీ మరిచినా
నన్ను చేరి నువ్వెందుకు
లేవని మారాం చేస్తుంది..

ఓ మనసా... నీకోసమే యోగమూ..
నీ పరుగు ఆపడమే యాగమూ
ఎంత పట్టు పడితే
అంత గింజుకుంటావు
పోనిమ్మని వదిలేస్తే
పరుగులు తీస్తావు..

నువ్వే బానిసవి..
నువ్వే యజమానివి..
మరి నేనెవరూ..
నీ యజమానిని
అని తలపోసే బానిసని..
*20-07-2012

2 కామెంట్‌లు:

  1. చివరి వాక్యాలు ప్రాణంపోసాయి జయాజీ.."ఓ మనసా... నీకోసమే యోగమూ.." మనసు మీ కవితల్లో ఓ తప్పనిసరి భాగం అనుకుంటా, అందుకే అంత హత్తుకుంటాయి మరి

    రిప్లయితొలగించండి
  2. మన ఏవ మనుష్యాణాం కదా దేవ్ జీ..
    మనసుని వదిలి మన గలిగే సాహసం మనకుందా..

    రిప్లయితొలగించండి