పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, జులై 2012, శనివారం

కె. కె. || ప్రశ్న ||

ప్రశ్నలు ఎన్నెన్నో మనిషి మస్తిష్కంలో
ప్రతిక్షణం, ప్రతీదినం..అడుగడుగునా
ప్రతీరోజు మారే తేదీ, ఆరోజు పరీక్ష కోసం
హాల్ టికట్ నెంబర్ లా కనిపిస్తుంది.
క్యాలెండర్ వైకుంఠపాళిలా కనిపిస్తుంటుంది.

కొన్ని ప్రశ్నలు తటాలున పుడతాయి
వాటి సమాధానాలు అంతే వేగంగా తడతాయి
ఆకాశంలో మెరుపు మెరిసినట్లు
సముద్రం లో అల ఎగిసినట్లు

కొన్ని ప్రశ్నలు గొంతు దాటేందుకు సంశయిస్తాయి
వాటి సమాధానాలకు రూపముండదు, ఊహలు తప్ప
ఇవి వేదిస్తాయి...అప్పుడప్పుడు బాధిస్తాయి
ఆకాశం ఎత్తు కొలిచినట్లు
సముద్రం లోతు తెలుసుకున్నట్లు

కొన్ని ప్రశ్నలు సూటిగా ఉంటాయి
చెప్పాలంటే సూదిగా ఉంటాయి
అవి తిన్నగా మనసు పొరలను తాకుతాయి
వీటి సమాధానం కోసం మేధోమదనం జరగాలి
వీటికి సమాధానం చిక్కేది ఆలోచనా శక్తిమీదే
అవి తాకే గాలిలా కనిపించకున్నా కదిలిస్తుంటాయి

కొన్ని ప్రశ్నలు అంతరంగ అంతర్జాలంలో
కొన్ని ప్రశ్నలు బాహ్యవ్యక్తుల వ్యాఖ్యానంలో
కొన్ని ప్రశ్నలు పసిపిల్లల అమాయకత్వంలో
కొన్నిప్రశ్నలు కనిపించే,వినిపించే ప్రకృతిలో
ఇలా ఎన్నెన్నో...వెంటాడుతూనే ఉంటాయి
మనిషి జీవనయాత్రలో, మరణశయ్య చేరేవరకు

ప్రశ్నలతోనే మనిషి పరిణితి, ప్రగతి
ప్రశ్నలే లేవంటే... చలనమున్నా జీవం లేనట్లే
*20-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి