పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, జులై 2012, శనివారం

జగతి జగద్దాత్రి || ఆంతర్య ఛిద్రం... ||

అప్పుడే ఆ క్షణం లోనే
అంతరాంతరాల్లో
భావ బీజావాపన జరిగే
ఆ దివ్య క్షణం లోనే
అధాటుగా ...
అతను నా దేహాన్ని
ఆక్రమించుకున్నాడు
వారించానా....
తగవును వరించానన్న మాటే
అందుకే నిశ్సబ్దంగా
నాలోకి నేను జారుకున్నా ...

నాలో కలిగే భావ స్పందనల్ని
అర్ధం చేసు కోలేడని నాకు తెలుసు
చెప్పాలని ఉన్నా
నా లోకం లో నేనున్నా
నా మనో రోదసి లో
వ్యోమగామినై
మెరుస్తోన్నకవిత్వ పాలపుంతను
ఆవాహన చేస్తున్నా
ఉరికి దూకుతోన్న
ఉల్కలై జారిపడుతోన్న
పద నక్షత్రాలను
మరుపు కృష్ణ బిలం లోకి
జారి పోకుండా నా
అంతరంగపు జోలిలో నింపుకుంటూ
తలుచుకుంటూ పరవశిస్తూ
నే చేసిన కూజితం
అతని నఖ క్షత గిలిగింత
అనుకున్నాడు కాబోలు
మురిసిపోతూ నవ్వుతున్నాడు

దేహాన్ని విడిచి నేను
ఉన్నానని తెలుసుకోలేదతను
దేహం నాది కానట్టే ఆవహించిన నిర్లిప్తత
నా మది లో కైత రస ఝరీ ప్రవాహం
నా ఎదనిండా కావ్య సాగరతరంగాలు
ఎగసి ఎగసి పడుతూ
నన్ను ఉద్దీప్తిస్తూ .....ఉత్తేజిస్తూ....
ఆ సమ్మోహన సమాగం లో నాకు నేనై
పలవరిస్తూ ....కలవరిస్తూ
నా దేహ సాన్నిహిత్యం లో అతను
ఉద్విగ్నుడౌతూ....ఉద్రేక పడుతూ
సహకరించని నా దేహాన్ని
మైమరుపని తలుస్తూ

ఎవరి వారి భ్రమలో ...వారి వారి లోకం లో
ఇరువురమూ రమిస్తూ ...
ఎగసి ఎగసి ....కెరటాలై
మిన్నును తాకిన
ఆ చివ్వరి లిప్త ....
అద్వైతానంద అనుభూతి లో నేను
స్ఖలించిన మగటిమి తో తాను
ఆనందం తో తృప్తిగా
విడివడిన ఇరు దేహాలు ...
భావ ప్రాప్తిలో తాను
మేధో భావ ప్రాప్తి లో నేను
అలసటగా వాలిపోయాడతను
ఆనందంతో ....
చిదానందానుభుతి తో ...నేను
వెదికాను కాగితం, కలం కోసం

ఇద్దరి మొహలలోనూ
ఆనందం , తవిదీరిన సంతృప్తి
అతనికి దైహికం
నాకు ఆత్మికం
ఇద్దరి వదనాలలో విరిసిన
చిరు నగవులు ఒకటే
కారణాలు వేరు అంతే ....
స్రవించిన వాంఛా వాసన తనది
ఫలించిన రస సిద్ధి నాది ...

ఇక మౌనంగా నా అక్షర సాధన ....
ఆతని నిద్రలోని అలసిన గురక వింటూ ...
నాలోకి నేనే పయనించేందుకు
కలం చుక్కాని పట్టి
కాగితం పడవలో నా అంతర్యానం ..
అనంత యానం ....
మనిషిగానే కాక ....
మనిక సార్ధకం చేసుకునేందుకు....
*20-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి