పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఆగస్టు 2012, మంగళవారం

జాన్ హైడ్ కనుమూరి ||ఆసుపత్రి ఒక వ్యాపారం||

నాకున్న భీమా ఆసుపత్రి

తనదగ్గర ఆధునిక సౌకర్యాలు లేవంటూ

కార్పొరేట్ ఆసుపత్రికి తరలించడంకోసం

సూచనా(రిఫరల్) కాగితం తయారు చేస్తుంది

దానివెనుకున్న నాకు తెలియని రహస్య ఒప్పందం

బయట అంబులెన్సుగా సిద్దంగా వుంటుంది

అందులోకి అడుగెట్టగానే

ట్రాఫిక్ ఆంక్షలను దాటుకుంటూ

గేటుముందు ఆగగానే

ఆఘమేఘాలమీద స్ట్రెశ్చర్ సిద్దమౌతుంది

లేఖలు సమర్పించి రోగలక్షణాలపై ప్రశ్నల వర్షం కురుస్తుంది

నా దేహానికి అర్థం కాని స్థితిలోచెప్పే సమాధానలమధ్య

ఒక అడ్మిషన్ పైలు తెరవబడుతుంది దానికో నంబరుతో సహా

తరువాత జరిగే లావాదేవీలన్ని ఆనంబరుతోనే



శరీరాన్ని పరీక్షించేందుకు అప్పటివరకు తొడుక్కున్న వస్త్రాలన్నీ విప్పబడతాయి

ఆసుపత్రి ట్రేడ్ మార్కుఅంగీ తొడగబడుతుంది

అప్పుడప్పుడే జీవితాన్ని ప్రారంభిస్తూ అనుభవంకోసం చేరిన యవ్వనపిల్లలు నర్సులై సేవచేస్తుంటారు

నా పిల్లలవయసున్న వీళ్ళతో సేవచేయించుకుంటున్నందుకు

వాళ్ళను సిస్టర్ అని ఎలాపిలవాలోననే సందిగ్దంతో

అంతరాత్మ క్షోభిస్తూవుంటుంది

కాని ఏం చేయగలం ఆ సేవలకూ బిల్లుంటుంది



పరీక్షల పర్వం

రక్తపరీక్షలకోసం ప్రతివుదయం నిద్రలేపి

సూదినొప్పి తెలియకుండానే రక్తం తీయబడుతుంది

ఎక్స్‌రేలు, ఇసిజీ, స్కానింగు, సిటిస్కానింగు, గుండెకు టుడి ఎకో ఇలా ఎవోవో గదులమధ్య నడవలేమన్నట్లు స్ట్రెశ్చర్‌పైనో, వీల్‌చైర్‌లోనో తిప్పుతుంటారు

వాటికి చార్జిచేయబడుతుందని చివరివరకూ తెలియదు



రక్తపోటును అనుక్షణం చూపేందుకు

శ్వాసను నియంత్రించేందుకు

నియమితసమయమంతో నరాలలోనికి మందునుపంపే పరికరాలు అమర్చబడతాయి



డాక్టర్లు

ఎవరి విభాగం వారిదే

ఎవరి కన్సెల్టెన్సీ వారిదే

ఏవేవో చూచనలు చార్టు/కేస్ షీట్‌లో

రాయబడతాయి

అమలుచెయ్యడం నర్సులవంతు

భరించేది మాత్రం ఒకే శరీరం



ఎమర్జెన్సీ వార్దు బోర్డుతో

అయినవాళ్ళనెవరినీ అన్నివేళల అనుమతించరు



ఆరోగ్యశ్రీలు, కార్మికభీమాలు, మరేదైనా భీమాలు

కావలసినంత పిండుకోవడంకోసం

ప్యాకేజీ రోజుల నియమాలు వర్తిస్తాయి



ఒకవేళ లేచి తిరుగుతున్న దేహమైనా

ప్యాకేజీ పూర్తయ్యేవరకు అనుమతే దొరకదు

బయటికి పోవడానికి

అంతా సెక్యూరిటీ పహారా



మత్తుకమ్మిన దేహానికి

ఎప్పుడో చదివిన ఆసుపత్రి గీతం

లీలగా మెదులుతుంది



మళ్ళీ ఎవరైనా కార్పొరేట్ ఆసుపత్రి గీతాన్ని ఆలపించాలేమో!!

*13-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి