గ్లో సైను బోర్డులు
మీ పిల్లల్ని అందరికంటే ముందుంచుతామని
గుస గుస లాడుతున్నప్పుదు
నిస్సిగ్గుగా గోలచేస్తున్నప్పుడు
జ్ఞాపకాల పలుగుతో
నన్ను నేను నలభైఐదేళ్ళ లోతు తవ్వుకొని
మా బట్రాజు పంతులు గారి బడికెళ్ళా
నీడ గడియారం కొట్టిన
నిశ్సబ్దపు గంటల మోత నాకింకా వినిపిస్తూనే వుంది
నీడకు కొట్టిన గీతలే మాకు
ఫస్టు బెల్లు పాసుబెల్లు ఇంటికివెళ్ళే బెల్లు
అప్పుడు నాకు విరోచనాల మందిచ్చిందాయనే
వివేచనను మదికందించిదీ ఆయనే
అక్షరాల తోపాటూ అంకెలేకాదు
ఆటలాడే కొరకూ
తాటి ముంజల బండి తాటాకు ఫ్యాను
ఈనెపుల్లల వీణ కొబ్బరాకుల బూర
కాగితం పడవలు గాలి పతంగులు
మట్టి గణపతులను చేసిపెట్టేవారు
మాకు పాట గాడాయనే
తోటి ఆటగాడాయనే
వేమన్న శతకాన్ని వల్లెవేయుంచి
మనిషి మనుగడ జాడ మనసు పట్టించి
భూమికొలతలు నేర్పి ఋతువు క్రమములు చెప్పి
తాడు పేనుట నేర్పి మొక్క ఎదుగుట చూపి
ఎందేళ్ళ లోపులో వందేళ్ళ బతుకుకు
సరిపడే చూపును కుండెడు గింజలకే వండి పెట్టేసారు
నా బ్రతుకు బొమ్మకు రంగు లద్దిపెట్టేసారు
ఈటెక్కు హైటేక్కు కాన్సెప్ట్ ఒలంపియాడ్ ,ఇంటర్నేషనల్ ,కర్పోరేట్ తరహా ఏ స్కూలయునా ఒకటే మాట
మా లక్ష్యం మీ పిల్లల్ని
మార్కుల సంపాయుంచే మిషన్లుగా మార్చడమేనని
విద్యాబుద్దులు చెప్పాల్సిన చోట
జీవితాన్ని నేర్చుకోవడమెలాగో నేర్పేచోట
మార్కుల ముసుగేసి
ర్యాంకుల లాఠీలతో కొడుతూ
మానవత్వం లూఠీచేయబడుతుందక్కడ
తప్పెవరిది ???????????
వాళ్ళుచేసేది వ్యాపారం
నీవడిగిందే ఇస్తారక్కడ నువు కోరిందే చేస్తారక్కడ
మా తాతెన్నడు మా మాస్టారు దగ్గర
మార్కుల ముచ్చట తేలేదు
మా సీనుబాబు బుద్దిగనే వుంటుండా? బాగా చదువొస్తుందా?
ఇప్పుడు మనమడిగే ప్రశ్న ర్యాంకెంతొస్తుంది మావాడికి?
మనం మన ప్రశ్ననూ పిల్లల కొసం కనే కలలకన్నునూ మార్చుకొంటే
ఇప్పటి పిల్లలు అప్పటికంటే
వేల రెట్ల జ్ఞానసూర్యుళ్ళై వెలుగుతారు.
*13-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి